గుడుంబాను తరిమికొట్టాలి! | kcr review over new liquor policy | Sakshi
Sakshi News home page

గుడుంబాను తరిమికొట్టాలి!

Jun 16 2015 3:14 AM | Updated on Aug 15 2018 9:27 PM

గుడుంబాను తరిమికొట్టాలి! - Sakshi

గుడుంబాను తరిమికొట్టాలి!

తెలంగాణ రాష్ట్రంలో గుడుంబా మహమ్మారిని తరిమేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.

* నగరాల్లో జనాభాకు అనుగుణంగా వైన్ షాపులు, బార్లు
* తదనుగుణంగా మద్యం విధానానికి రూపకల్పన
* స్టార్ హోటళ్లలో విదేశీ మద్యం ఉండేలా ఏర్పాట్లు
* ఎక్సైజ్‌శాఖపై ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుడుంబా మహమ్మారిని తరిమికొట్టేందుకు అవసరమైన కఠిన విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. నగరాల్లోని జనాభాతోపాటు రాకపోకలు సాగించే జనాన్ని దృష్టిలో ఉంచుకొని తదనుగుణంగా వైన్ షాపులు, బార్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జూలై నుంచి అమల్లోకి రానున్న ఎక్సైజ్ విధానం, ఎక్సైజ్‌శాఖ పనితీరుపై సీఎం కేసీఆర్ సోమవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి టి. పద్మారావుగౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావులు పాల్గొన్న ఈ సమావేశంలో గుడుంబా, కల్తీ మద్యాన్ని అరికట్టే అంశంపైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. గుడుంబాకు ప్రత్యామ్నాయంగా చౌకమద్యం ప్రవేశపెట్టేందుకుగల అవకాశాలపై మంత్రి, అధికారులు ఈ సందర్భంగా సీఎంకు ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిసింది. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం విధానం, గుడుంబాకు వెచ్చించే ధరకే చౌకగా లభించే మద్యం గురించి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన సీఎం...గుడుంబా, కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు ఏ విధానం సరైనదో అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని ఆదేశించినట్లు సమాచారం. తదనుగుణంగానే నూతన మద్యం విధానాన్ని రూపొందించాలని స్పష్టం చేసినట్లు తెలిసింది.
 
 తాను జిల్లాల్లో పర్యటించినప్పుడు, బస్తీల్లో తిరిగినప్పుడు ఎదురైన అనుభవాలను కేసీఆర్ ఈ సందర్భంగా అధికారులకు వివరించారు. ప్రతిచోటా గుడుంబా వల్ల నష్టపోతున్నామనే ఫిర్యాదులు వస్తున్నాయని, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పురుషులు గుడుంబా తాగడం వల్ల చిన్న వయసులోనే మహిళలు వితంతువులుగా మారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం కోసం ఆసరా, సన్నబియ్యం పంపిణీ, పోషకాహారం అందించే ఏర్పాట్లు, జీతభత్యాల పెంపు వంటి కార్యక్రమాలు చేపట్టినా గుడుంబా వల్ల పేదల కుటుంబాల్లో ఆనందం కరువవుతోందని చెప్పారు. గుడుంబాను అరికట్టేందుకు ప్రతిపాదనలు చేయాలని, కఠిన చట్టం తీసుకురావాలా... పీడీ యాక్టును అమలు చేయాలా అనే విషయాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. నూతన మద్యం విధానం ఖరారు చేసే క్రమంలో గుడుంబాను అరికట్టడడమే అన్నింటికన్నా ప్రధాన అంశమని సీఎం వివరించారు. అలాగే కల్తీ మద్యం, ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న మద్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నిఘా వ్యవస్థను బలోపేతం చేసి, తనిఖీలు నిర్వహించాలని, రవాణా వాహనాలపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. మద్యంతో పోలిస్తే కల్తీ కల్లుపై ఫిర్యాదులు తక్కువగా ఉన్నాయని...వినియోగదారులను కోల్పోయేందుకు కల్లు గీత కార్మికులు ఇష్టపడరు కాబట్టి కల్తీకల్లు విక్రయాలు తక్కువేన్నారు.
 
 అందుబాటులో విదేశీ మద్యం    
 రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం వల్ల కొత్తగా ఎన్నో పరిశ్రమలు వస్తాయని, దేశ విదేశాల ప్రతినిధుల రాకపోకలు పెరుగుతాయని సీఎం పేర్కొన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని స్టార్ హోటళ్లలో విదేశీ మద్యం అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. హైదరాబాద్‌కు విశ్వవ్యాప్తంగా మంచి పేరుందని, పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారిపట్ల మంచిగా వ్యవహరించాలన్నారు. వైన్స్, బార్ల నిర్వహణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. బహిరంగ మద్య సేవనం, గొడవల వంటి సంఘటనలు జరగకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. తెలంగాణలో ఎంత మేరకు మద్యం అమ్మకాలు జరుగుతాయో ఆ మేరకు మద్యం తయారు చేసేందుకు అవసరమైన బ్రేవరీలను నెలకొల్పాలన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement