ఆర్టీసీని ఇలా నడపలేం : కేసీఆర్‌

KCR Review Meeting On TSRTC Strike - Sakshi

ఆర్టీసీని నడపాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలి

సంస్థకు అంత శక్తి లేదు.. సర్కారూ భరించలేదు

చార్జీలు పెంచితే ప్రజలు బస్సెక్కని పరిస్థితి వస్తుంది

అన్నీ పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపిస్తాం

ఉన్నతస్థాయి సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి

రూట్ల ప్రైవేటీకరణపై నేడు హైకోర్టు తీర్పు వచ్చే చాన్స్‌

ఆ తర్వాతే సర్కారు తుది నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌ : ‘ఆర్టీసీ ఇప్పుడున్నట్లు నడవాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలి. ఈ భారమంతా ఎవరు భరించాలి? సంస్థకు ఇప్పుడంత శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదు. అయినా సరే, ఎంతో కొంత ప్రభుత్వం సహాయం చేసినా, అది ఎంత వరకు కొనసాగించగలుగుతుంది? ఆర్టీసీకున్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడం. చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఆర్టీసీని యథావిధిగా నడపడం సాధ్యం కాదు’ అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు 5,100 రూట్ల ప్రైవేటీకరణపై శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పుడు అన్ని అంశాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన గురువారం ప్రగతి భవన్‌లో ఆర్టీసీపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అనే అంశంపై విస్తృతంగా చర్చించారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, కోర్టు నిర్ణయాలు, కోర్టులో ఇంకా నడుస్తున్న కేసులు తదితర అంశాలపై కూలంకషంగా అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికన, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడమే ప్రథమ కర్తవ్యంగా, ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

అప్పుల కుప్ప..
‘ఆర్టీసీకి ఇప్పటికే రూ.5వేల కోట్లకు పైగా అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పలు, బకాయిలు దాదాపు రూ.2వేల కోట్ల వరకు ఉన్నాయి. ఉద్యోగులకు సెప్టెంబర్‌ మాసానికి సంబంధించి మొత్తం జీతం చెల్లించాలంటే రూ.240 కోట్లు కావాలి. సీసీఎస్‌ రూ.500 కోట్లు ఇవ్వాలి. డీజిల్‌ బకాయిలు చెల్లించాలి. రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉంది. 2,600 కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాలి. పీఎఫ్‌ బకాయిల కింద నెలకు దాదాపు రూ.65–70 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది’ అని ఈ సమావేశంలో ప్రభుత్వం చర్చించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆర్టీసీని యథావిధిగా నడపం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, సీనియర్‌ అధికారులు నర్సింగ్‌రావు, సునీల్‌ శర్మ, రామకృష్ణారావు, సందీప్‌ సుల్తానియా, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, ఏజీ ప్రసాద్, అడిషనల్‌ ఏజీ రాంచందర్‌రావు, ఆర్టీసీ ఈడీలు వెంకటేశ్వరరావు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top