సెలవుల్లో యథేచ్ఛగా ఇంటర్‌ తరగతులు

Inter classes also in the holidays - Sakshi

రాష్ట్రంలో కార్పొరేట్‌ కాలేజీల ఇష్టారాజ్యం

ప్రవేశాలకూ గేట్లు బార్లా.. 

ఇంటర్‌ బోర్డు ఆదేశాలు బేఖాతర్‌

కాలేజీల చేతుల్లోకి విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్లు

భారీ మొత్తానికి అధికారులు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు!

సాక్షి, హైదరాబాద్‌: ‘‘వేసవి సెలవుల్లో ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు ప్రవేశాలు, తరగతులు చేపట్టడానికి వీల్లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం’’అంటూ ఇంటర్మీడియెట్‌ బోర్డు మార్చి 30న జారీ చేసిన ప్రకటన బుట్టదాఖలైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లోని కార్పొరేట్‌ కాలేజీలు బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కుతూ యథేచ్ఛగా తరగతులు నిర్వహిస్తున్నాయి. ర్యాంకుల కోసం ఇప్పటి నుంచే విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. సెలవులకు ఇంటికి వెళ్తామని అడిగే విద్యార్థులకు టీసీలు ఇస్తామని బెదిరిస్తున్నాయి. అలాగే పదో తరగతి ఫలితాలు రాకముందే ఇంటర్‌ ప్రవేశాలకు ఆయా కాలేజీలు తెరలేపాయి. తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ తమ కాలేజీల్లో విద్యార్థులను చేర్పించాలని, అలా చేర్పిస్తే రాయితీ ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నాయి. 

అప్పటికైతే ఎక్కువ ఫీజు చెల్లించాల్సిందేనంటూ.. 
తమ కాలేజీల్లో చేరాలంటూ ఫోన్లు చేస్తున్న కాలేజీల ప్రతినిధులు రాయితీలను సాకుగా చూపి అడ్వాన్స్‌లు తీసుకుంటున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ‘ఇప్పుడైతే ఫీజు రాయితీ ఉంటుంది.. ఫలితాలు వచ్చాక చేర్చాలంటే మాత్రం మేం చెప్పినంత చెల్లించాల్సి ఉంటుంది, మీ ఇష్టం..’అంటూ తల్లిదండ్రులను సందిగ్ధంలో పడేస్తున్నారు. ఇప్పుడు సీటు కావాలంటే 2, 3 రోజుల్లో తమ కాలేజీ కార్యాలయాలకు వచ్చి సీట్లు రిజర్వు చేసుకోవాలని చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులు వారి మాటలను నమ్మి కాలేజీలకు వెళ్లి డబ్బులు చెల్లించేస్తున్నారు. 

పట్టించుకోని బోర్డు అధికారులు... 
రాష్ట్రంలో 405 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఉండగా 1,560 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ఏటా దాదాపు 4.5 లక్షల మంది విద్యార్థులు చేరుతున్నారు. వారిలో చాలా మంది విద్యార్థులను చేర్చుకునేందుకు కార్పొరేట్‌ కాలేజీలు ఏజెంట్లను పెట్టుకొని మరీ వ్యవహారం చక్కబెడుతున్నా ఇంటర్‌ బోర్డు మాత్రం నోరు మెదపడం లేదు. వేసవి సెలవుల్లో ప్రవేశాలు చేపట్టవద్దని ఓ ప్రకటన జారీ చేసి చేతులు దులుపుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్‌ యాజమాన్యాలు ఇచ్చే మామూళ్ల మత్తులో అధికారులు జోగుతూ ఇలాంటి ఉదంతాలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్లు యాజమాన్యాల ప్రతినిధుల వద్దకు చేరుతుండటం కూడా పలు సందేహాలకు తావిస్తోంది. పదో తరగతి పరీక్షల విభాగం, ఇంటర్‌ బోర్డుల నుంచి అనధికారికంగా ఈ వివరాలు బయటకు వెళ్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో రూ. లక్షలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టిపెడితే ఇంటి దొంగల భరతం పట్టవచ్చన్న వాదనలు ఉన్నాయి.

ప్రభుత్వ కాలేజీల నుంచి ఫోన్‌ రాదే.. 
పదో తరగతి పరీక్షల ప్రారంభం నుంచే తల్లిదండ్రులకు కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల నుంచి ఫోన్లు వెళ్తున్నా.. ప్రభుత్వ కాలేజీల నుంచి మాత్రం అలాంటి చర్యలు చేపడుతున్న దాఖలాలు లేవు. రెండేళ్ల కిందట ఇంటర్‌ విద్యా జేఏసీ, జూనియర్‌ లెక్చరర్ల సంఘం అధ్వర్యంలో ప్రభుత్వ కాలేజీల్లో నమోదును పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈసారి ఆ దిశగా బోర్డు ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదు. మరోవైపు ఇపుడు ప్రైవేటు కాలేజీలు చెప్పే మాయమాటలతో ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు కూడా ప్రైవేటు కాలేజీల్లోనే తమ పిల్లలను చేర్చేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో జూన్‌ నాటికి ప్రభుత్వ కాలేజీల్లో చేర్పించేవారు లేకుండాపోతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top