భార్యను చంపిన భర్త..ఆత్మహత్య

Husband Murdered His Wife Warangal - Sakshi

మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదన

పచ్చని సంసారాన్ని విచ్ఛిన్నం చేసిన మద్యం మత్తు

ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో సంఘటన

స్థానికంగా సంచలనం

సాక్షి, కరీమాబాద్‌: భార్యను గొడ్డలితో నరికి తాను సమీపంలోని రైలు పట్టాలపై రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని అండర్‌ రైల్వేగేట్‌ 23వ డివిజన్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ తోటలోని హనుమాన్‌ గుడి వీధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. మిల్స్‌కాలనీ పోలీసులు, కుటుంబ సభ్యుల, స్థానికుల కథనం ప్రకారం... ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో చాలా కాలంగా ఊగ చిన్న,కన్నమ్మ దంపతులతో పాటు కుటుంబ సభ్యులు కిరాయి ఇంట్లో ఉంటున్నారు. ఉగ చిన్న (57)తాగుడుకు బానిసయ్యాడు.

ప్రతిరోజూ తన భార్య కన్నమ్మ(52)తో గొడవకు దిగడంతో పాటు కొట్టేవాడు. ఈ క్రమంలో శుక్రవారం తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కన్నమ్మను మద్యం మత్తులో ఉన్న  చిన్న అతి కిరాతరంగా కన్నమ్మను గొడ్డలితో తలపై నరికి చంపాడు. అక్కడి నుంచి పారిపోయిన చిన్న సమీపంలోని రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాళం చెవి కోసం మనవరాలు ప్రియదర్శిని కన్నమ్మ చనిపోయి ఉన్న విషయాన్ని చూసి వెళ్లి  తన తల్లిదండ్రులకు చెప్పింది.

ఈ లోగా మిల్స్‌కాలనీ సీఐ దయాకర్, ఎస్సై భీమేష్‌తో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి  వివరాలు తీసుకుని పంచనామా చేసి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు.  అదే విధంగా వరంగల్‌ జీఆర్‌పీ పోలీసులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న చిన్న మృతదేహాన్ని సైతం ఎంజీఎంకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.   ఇదిలా ఉండగా కన్నమ్మ–చిన్నలకు నాగలక్ష్మి, శ్రీలత, లావణ్య, శివ ఉన్నారు.   కుమారుడు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరాడని స్థానికులు చెబుతున్నారు.

మిన్నంటిన కూతుళ్ల రోదనలు 
అటు తల్లిని చంపి, ఇటు తండ్రి కూడా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో వారి కూతుర్లు నాగలక్ష్మి, లావణ్యల రోదనలు మిన్నంటాయి. తన తల్లి తమను పండ్లు, కూరగాయలు, కంకులు అమ్మి సాదుకుందని, తమకు ఎలాంటి లోటు లేకుండా పెంచిందని ఏడుస్తూ గుర్తు చేశారు. తమ తండ్రి చిన్న తాగుడుకు బానిసై తమ కుటుంబాన్ని ఏనాడు పట్టించుకోలేదని బోరున విలపించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top