దొడ్డి దారిన ఉద్యోగ భర్తీ చెల్లదు

High Court Erred In Replacing Junior Panchayat Secretaries - Sakshi

జూనియర్‌ పంచాయతీ సెక్రటరీల భర్తీని తప్పుపట్టిన హైకోర్టు

9,335 పోస్టుల భర్తీలో లొసుగులు

గత కమిషనర్‌ నీతూకుమారి ప్రసాద్‌కు కోర్టు ధిక్కార నోటీసు

విచారణ శుక్రవారానికి వాయిదా  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 9,335 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేట ప్పుడు రిజర్వేషన్ల నిబంధనలను అమలు చేయలేదని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఏపీ స్టేట్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌–1996లోని రూల్‌ 22కు వ్యతిరేకంగా ఆ పోస్టులను భర్తీ చేయడంపై కోర్టు ఆక్షేపించింది. 2018లో రాష్ట్రంలోని వివిధ ప్రాం తాల్లో పంచాయతీరాజ్‌ శాఖ ఆ పోస్టులను భర్తీ చేసింది. అయితే అప్పటికే ఆ పోస్టులను రిజర్వేషన్ల నిబంధనలకు లోబడి భర్తీ చేయాలని హైకోర్టు ఉత్తర్వులున్నా పట్టించుకోలేదు. క్రీడలు ఇతర అన్ని కేటగిరీల రిజర్వేషన్లు 50 శాతం మించకుండా భర్తీ ఉండాలని, వంద పాయింట్ల రోస్టర్‌ విధానాన్ని అమలు చేయాలని, ఏపీ సబా ర్డినేట్‌ రూల్స్‌ యాక్ట్‌–1996లోని 22వ నిబం ధనలను అమలు చేయాలన్న చట్ట నిబంధనలను ఉల్లంఘించి పోస్టులు భర్తీ చేశారని తప్పుపట్టింది.

చట్టానికి వ్యతిరేకంగా పోస్టుల భర్తీ చేశారని దాఖలైన కోర్టు ధిక్కార వ్యాజ్యం విచారణకు పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు హాజరయ్యారు. పూర్తి వివరాలు సమర్పిం చేందుకు 8 వారాల సమయం కావాలని ఆయన కోరారు. అందుకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎమ్మెస్‌ రామచంద్రరావు అంగీకరించలేదు. అంతకు ముందు ఉన్న కమిషనర్‌ నీతూకుమారి ప్రసాద్‌కు హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది. ఇదే విషయాన్ని ఆమెకు తెలియజేయాలని రఘునందన్‌రావును హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.

ఐఏఎస్‌లకు ఆ మాత్రం తెలియదా?
‘దొడ్డి దారిన భర్తీ చేసిన పోస్టులపై ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి. రిజర్వేషన్ల నిబంధన అమలు చేయకుండా పోస్టులను భర్తీ చేస్తే హైకోర్టు చూస్తూ కూర్చోదు. చట్ట వ్యతిరేకంగా భర్తీ చేసిన పోస్టుల్లో చేరిన వారిని ఏం చేస్తారో చెప్పండి. నియామకాలు చేసేటప్పుడు చట్ట ప్రకారం న్యాయపర అభిప్రాయాన్ని కూడా పొందిన తర్వాతే చేయాలన్నది పాలనలో అత్యంత కీలక విషయం అని ఐఏఎస్‌ అధికారులకు తెలియదా. చట్టాలను సరిగ్గా అమలు చేస్తే కోర్టు ధిక్కార కేసుల నమోదు అనూహ్యంగా ఉండదు.

ఈ కేసులో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు చేయకపోవడం చట్టవ్యతిరేకం. చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఎవ్వరూ ఉద్యోగాలు పొందడానికి వీల్లేదు. చేసిన తప్పుల్ని ఎలా సరిదిద్దుతారో చెప్పండి. భర్తీ చేసే ముందు అడ్వొకేట్‌ జనరల్‌ అభిప్రాయం తీసుకుని ఉంటే న్యాయపరమైన అవరోధాలు ఉండేవే కావు. తప్పులను సరిదిద్దే చర్యలు ఏం తీసుకున్నారో వచ్చే శుక్రవారం జరిగే విచారణ సమయంలో చెప్పండి’అని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top