సమ్మె ఎఫెక్ట్‌ : పీకల్లోతుకు ఆర్టీసీ

Greater RTC Loss With TSRTC Strike And Bus Break Downs - Sakshi

సమ్మె ఎఫెక్ట్‌ భారీ నష్టాల్లో  గ్రేటర్‌ ఆర్టీసీ

40 రోజుల్లో రూ.60 కోట్లకు పైగానే...

68 నుంచి 45కు పడిపోయిన ఆక్యుపెన్సీ

మెకానిక్‌లు లేక కొరవడిన నిర్వహణ

పెరిగిన బస్సుల బ్రేక్‌డౌన్స్‌..

సాక్షి, సిటీబ్యూరో: కార్మికుల సుదీర్ఘమైన సమ్మెతో గ్రేటర్‌ ఆర్టీసీ కుదేలైంది. పీకల్లోతు నష్టాల్లోకి మునుగుతోంది. నిరవధిక సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ప్రైవేట్‌ సిబ్బందిని నియమించుకున్నారు. కానీ 50 శాతం బస్సులను కూడా నడపలేని పరిస్థితి నెలకొంది. దీంతో గడిచిన 40 రోజులుగా గ్రేటర్‌ ఆర్టీసీ భారీ నష్టాలను చవి చూస్తోంది. సాధారణంగానే ప్రతి రోజు రూ.కోటి చొప్పున నష్టాలు చోటుచేసుకొనేవి. రోజుకు రూ.2.5 కోట్ల ఆదాయం లభిస్తే నిర్వహణ వ్యయం, ఇతర ఖర్చులన్నీ కలిపి రూ.3.5 కోట్ల వరకు ఉండేవి. ప్రస్తుతం సమ్మె రోజుల్లో అది రెట్టింపైంది. సిబ్బంది జీతభత్యాలు, విడిభాగాల కొనుగోళ్లు,  తదితర నిర్వహణ వ్యయం తగ్గినప్పటికి సిటీలో తిరిగే బస్సుల సంఖ్య, ట్రిప్పులు, కిలోమీటర్లు సగానికి పైగా పడిపోవడంతో ఆదాయం గణనీయంగా పడిపోయింది. సమ్మె ప్రారంభించిన తొలి 10 రోజుల్లో రోజుకు రూ.20 లక్షలు కూడా ఆర్జించలేకపోయారు. రోజుకు 500 నుంచి 700 వరకు బస్సులు నడిచేవి. ఇప్పుడు బస్సుల సంఖ్య 1300 నుంచి 1500 వరకు చేరుకుంది. ప్రైవేట్‌ డ్రైవర్లు, కండక్టర్‌లు అందుబాటులోకి  రావడంతో బస్సుల సంఖ్యను  కొంత మేరకు పెంచారు.

కానీ గ్రేటర్‌ ఆర్టీసీ జోన్‌లోని  29 డిపోల్లో ఉన్న మొత్తం 3750 బస్సుల్లో ఇవి  50 శాతం లోపే ఉన్నాయి. పైగా సాయంత్రం 7 దాటిన తరువాత బస్సులు అందుబాటులో ఉండడం లేదు. దీంతో ట్రిప్పుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. సాధారణ రోజుల్లో  42 వేల ట్రిప్పులు తిరిగిన సిటీ బస్సులు ఇప్పుడు రోజుకు 20 వేల ట్రిప్పుల కంటే దాటడం లేదని, డిపోల్లో మెకానిక్‌లు లేక కొరవడిన బస్సుల మెయింటెనెన్స్, సూపర్‌వైజర్లు, చీఫ్‌ ఇన్‌స్పెక్టర్లు వంటి వ్యవస్థాగతమైన నిర్వహణ లేకపోవడం వల్ల  బస్సులను నడుపలేకపోతున్నట్లు ఆర్టీసీ అధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో  ప్రస్తుతం ఆదాయం పైన కాకుండా కేవలం ప్రయాణికులకు రవాణా సదుపాయం కల్పించేందుకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నట్లు  పేర్కొన్నారు. ‘అప్పట్లో రూ.2.5 కోట్లు లభిస్తే ఇప్పుడు కోటి రూపాయలు కూడా రావడం లేదు. ప్రైవేట్‌ సిబ్బందే అయినా కండక్టర్‌లు, డ్రైవర్లకు టార్గెట్లు ఇస్తున్నాం. రూట్ల వారీగా అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు చర్యలు చేపట్టాం. కానీ బస్సుల సంఖ్య, ట్రిప్పుల సంఖ్య పెరిగితే తప్ప ఆదాయం పెరగడం సాధ్యం కాదు.’అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గతంలో రోజుకు రూ.కోటి చొప్పున నష్టాలు వస్తే  ఇప్పుడు రూ.కోటిన్నరకు పైగా నష్టమే. ఈ లెక్కన  గత 40 రోజులలో గ్రేటర్‌ ఆర్టీసీ నష్టాలు సుమారు రూ.60 కోట్లకు పైగా నమోదైనట్లు అంచనా.

పడిపోయిన ఆక్యుపెన్సీ....
మరోవైపు బస్సుల్లో ఆక్యుపెన్సీ కూడా దారుణంగా పడిపోయింది. ఉదయం, సాయంత్రం మాత్రమే సిటీ బస్సుల్లో రద్దీ కనిపిస్తుంది. అరకొరగా తిరగడం వల్ల  ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. మెట్రో, ఎంఎంటీఎస్‌ రైళ్లలో పయనిస్తున్నారు. ఇక రాత్రి వేళల్లో బస్సులు లేకపోవడం వల్ల, సిబ్బంది కొరత కారణంగా ట్రిప్పులు తగ్గడంతో ఆక్యుపెన్సీ తగ్గింది. సాధారణ రోజుల్లో 68 శాతం ఆక్యుపెన్సీ ఉంటే ఇప్పుడు 45 శాతం వరకు మాత్రమే నమోదవుతున్నట్లు  అధికారులు అంచనా వేశారు. ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గింది. సిటీ బస్సులు నడపడంలో పెద్దగా అనుభవం లేని ప్రైవేట్‌ డ్రైవర్ల వల్ల డీజిల్‌ వినియోగం పెరిగింది. గతంలో ఒక లీటర్‌పైన 4.5 కిలోమీటర్‌ల చొప్పున నడిచిన ఆర్డినరీ బస్సులు ఇప్పుడు  3 కిలోమీటర్‌లకు తగ్గినట్లు అంచనా. సమ్మెకు ముందుకు  నగరంలోని  3750  బస్సులు ప్రతి రోజు  9.5 లక్షల కిలోమీటర్లు తిరిగితే ఇప్పుడు 4 లక్షల కిలోమీటర్లు కూడా తిరగడం లేదు.  

పెరిగిన బ్రేక్‌డౌన్స్‌...
డిపోల్లో  మెకానిక్‌లు ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే బయటకు వెళ్లేవి. ప్రతి 15 రోజులకు ఒకసారి బస్సులను పూర్తిగా తనిఖీ చేసి సామరŠాధ్యన్ని పెంచేవారు. అవసరమైన విడిభాగాలను ఏర్పాటు చేసి బస్సులు బ్రేక్‌డౌన్‌లకు గురికాకుండా చర్యలు తీసుకొనే సమర్ధవంతమైన యంత్రాంగం ఆర్టీసీకి ఉంది. ఇప్పుడు ఆ సిబ్బంది అంతా సమ్మెలో ఉండడం వల్ల బస్సుల నిర్వహణ కొరవడింది. మెకానిక్‌లు లేకపోవడంతో బ్రేక్‌డౌన్స్‌ పెరిగాయి. చెడిపోయిన బస్సులు డిపోలకే పరిమితమవుతున్నాయి. సమ్మె ఇలాగే కొనసాగితే ఆర్టీసీకి మరింత అపారమైన నష్టం వాటిల్లే  అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కొనసాగుతున్న సమ్మె...
ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. అన్ని డిపోలు, బస్‌స్టేషన్‌ల వద్ద  కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరాహార దీక్షలు, ధర్నాలు, బైఠాయింపులు, నిరసన సభలు, తదితర  రూపాల్లో కార్మికుల ఆందోళన కొనసాగుతోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top