మళ్లీ మమ!

GHMC Officials Negligence on Prajavani - Sakshi

మొక్కుబడిగా ప్రజావాణి

కమిషనర్‌ సీరియస్‌గా చెప్పినా అంతే..  

సగం మంది ఉన్నతాధికారులే హాజరు  

అందులోనూ చివరి వరకు ఉన్నదీ కొందరే  

కమిషనర్‌ వెళ్లగానే జారుకున్న అధికారులు  

ఈసారి పెరిగిన ఫిర్యాదులు.. మొత్తం 33

సాక్షి, సిటీబ్యూరో: ప్రజావాణి.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీహెచ్‌ఎంసీలో ప్రతి సోమవారం నిర్వహించే విశిష్ట కార్యక్రమం. కానీ గత కొంత కాలంగా అధికారులు దీన్ని పట్టించుకోవడం లేదు. దాదాపు రెండేళ్లకు పైగా ఇదో మొక్కుబడి తంతుగా తయారైంది. వాస్తవానికి ప్రజావాణికి ఉన్నతాధికారులు హాజరై ప్రజల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. అయితే ఉన్నతాధికారులు కాకుండా సంబంధిత సెక్షన్‌లోని ఎవరో ఒకరు హాజరవడం కొద్దిరోజులు సాగింది. ఆ తర్వాత కొన్ని విభాగాలు పూర్తిగా రావడమే మానేశాయి. ఇక ఇటీవల కాలంలో ఎన్నికల కోడ్‌ ప్రజావాణికి అడ్డంకిగా మారింది. పరిస్థితిని గుర్తించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ ప్రజావాణికి విభాగాధిపతులంతా తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని, ఏదైనా సమావేశం ఉంటే వేరే వారిని పంపించాలని ఆదేశించారు. విభాగాధిపతులే వెళ్లాల్సి వస్తే ముందస్తుగా తనకు సమాచారమివ్వాలని చెప్పారు. కమిషనర్‌ సీరియస్‌ కావడంతో అధికారులంతా హాజరవుతారని భావించారు. కానీ సోమవారం జరిగిన ప్రజావాణికి అన్ని విభాగాల ఉన్నతాధికారులు హాజరు కాలేదు. హాజరైన వారిలోనూ సగం మంది కమిషనర్‌ వెళ్లగానే జారుకున్నారు. బోనాల ఏర్పాట్లకు సంబంధించి సచివాలయంలో మంత్రితో సమావేశం ఉండడంతో కమిషనర్‌ వెళ్లారు. ఆయన అటు వెళ్లగానే ఒక్కొక్కరుగా అధికారులు కూడా వెళ్లిపోయారు. ఇలా మొత్తానికి మరోసారి ప్రజావాణిని మమ అనిపించారు. దీన్నో మొక్కుబడి తంతుగా ముగించారు.  

ఒక్కచోటే హాజరు...  
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్, సర్కిల్‌ కార్యాలయాల్లోనూ ప్రజావాణి సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుంది. కొందరు జోనల్‌ కమిషనర్లే ప్రధాన కార్యాలయం నుంచి ఆయా విభాగాలను పర్యవేక్షించే అడిషనల్‌ కమిషనర్లుగానూ ఉన్నారు. దీంతో వారు ప్రధాన కార్యాలయంలోని ప్రజావాణికి హాజరు కాలేదు. ఇలాంటి అడిషనల్‌ కమిషనర్లలో కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్‌), జీవవైవిధ్య విభాగం పర్యవేక్షణ, ఎస్సార్‌డీపీ, హౌసింగ్, నాలాల ఆక్రమణలు, చార్మినార్‌ పాదచారుల పథకం  విభాగాల అధికారులు ఉన్నారు.  

కమిషనర్‌ సీరియస్‌..
జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజావాణికి కమిషనర్‌ దానకిశోర్‌ కూడా హాజరయ్యారు. దాదాపు మూడేళ్లుగా ప్రజావాణికి కమిషనర్‌ హాజరు కావడం లేదు. దానకిశోర్‌ రావడంతో ఫిర్యాదుదారులు సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన ఆయన సంబంధిత అధికారులకు వాటిని మార్క్‌ చేశారు. ఎంతోకాలంగా అందుతున్న ఫిర్యాదులను పట్టించుకోని అధికారులను ఫోన్‌లోనే మందలించారు. ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణం స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  

పెరిగిన ఫిర్యాదులు..
ప్రజావాణి నిర్వహణపై కమిషనర్‌ సీరియస్‌ అయిన తెలియడంతో గతంలో కంటే ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రధాన కార్యాలయానికి 33 మంది తమ ఫిర్యాదులు అందజేసేందుకు వచ్చారు. జీహెచ్‌ఎంసీలో ప్రజావాణికి అందే ఫిర్యాదుల్లో సింహభాగం టౌన్‌ప్లానింగ్‌వే. సోమవారం ప్రధాన కార్యాలయంలో ప్రజావాణికి మొత్తం 33 ఫిర్యాదులు రాగా... వీటిలో 22 టౌన్‌ప్లానింగ్‌వే. ముషీరాబాద్‌లో 40 గజాల స్థలంలో ఐదంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారని, పంజగుట్ట మీరా ట్రేడ్‌ సెంటర్‌ వద్ద అక్రమ షెడ్లను నిర్మించారని, రోడ్ల తవ్వకాలు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు తదితర అంశాలపై కమిషనర్‌కు ఫిర్యాదులు అందాయి.

ఫిర్యాదులు ఇలా..  
ఇంజినీరింగ్‌    8
వెటర్నరీ    1
టౌన్‌ప్లానింగ్‌    22
రెవెన్యూ (ఆస్తిపన్ను)    2

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top