‘ఈఎస్‌ఐ’ వెలవెల..

ESI Hospital Has No Facilities In Kagaznagar  - Sakshi

ఈఎస్‌ఐ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువు

సాక్షి, ఆసిఫాబాద్‌: సిర్పూర్‌ పేపర్‌ మిల్లు పునఃప్రారంభం కావడంతో ఆసుపత్రికి పూర్వవైభవం వస్తుందని ఆశప డ్డ కార్మికులకు నిరాశే ఎదురవుతోంది. ఈ ఆసుపత్రిలో 9526 వేల మంది కార్మికులు ఆరోగ్య కార్డులు పొంది ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో చాలా తక్కువ మంది కార్మిక కుటుంబా లకు నామమాత్రంగా వైద్యసేవలు అందిస్తున్నారు. నిత్యం దాదాపు 200 మంది ఇక్కడికి వైద్య పరీక్షల కోసం వస్తున్నారు. అయినా సౌకర్యాలు, వైద్య సిబ్బంది లేక ఆశించిన స్థాయి వైద్యం అందడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో అడ్మిట్‌ అవుదామన్నా భయంగా ఉంటుందని రోగులు పేర్కొంటున్నారు.

పెచ్చులూడుతున్న పై కప్పు.. ఆసుపత్రిలో విద్యుత్‌ సౌకర్యం సక్రమంగా లేదు. పైకప్పు పెచ్చులు ఊడుతోంది. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని రోగులు భయాందోళనకు గురవుతున్నారు. గత 15 ఏళ్లుగా మరమ్మతులు చేపట్టకపోవడంతో ఆసుపత్రి బూతు బంగ్లాలా మారింది. దీంతో ఆసుపత్రికి వచ్చే ఒకరిద్దరూ కూడా వైద్యం తీసుకుని వెనుతిరుగుతున్నారు. ఇక ఆసుపత్రిలో మరుగుదొడ్లు సక్రమంగా పనిచేయడం లేదు, తాగునీటి వసతి లేదు. వీటికి తోడు అంతో,ఇంతో వైద్యం అందుతుందని ఆసుపత్రి కి రోగులు వస్తే గంటల తరబడి వేచిచూడాల్సి దుస్థితి నెలకొంది. వైద్యులు ఆలస్యంగా వస్తుండడంతో రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 

నామమాత్రంగా విధులు..
కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో సిబ్బంది నామమాత్రంగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపణలున్నాయి. కార్మిక కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలందించడానికి ఆసుపత్రిలో 75 మంది వివిధ విభాగాలకు చెందిన సిబ్బందిని నియమించారు. అయితే ఇందులో చాలా మంది ప్రధాన వైద్య సిబ్బంది దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, తదితర పట్టణాల నుంచి వారానికి ఒకసారి వచ్చి వెళుతున్నారని ఆరోపణలున్నాయి. సూపరింటెండెంట్‌ సైతం స్థానికంగా ఉండడం లేదు. దీంతో ఇదే అదనుగా ఇతర సిబ్బంది సైతం సమయపాలనా పాటించడం లేదు. 

డిస్పెన్సనరీలో ఏఎన్‌ఎంలే దిక్కు.. 
ఈఎస్‌ఐ డిస్పెన్షనరీలోనూ వైద్యులు లేకపోవడంతో సేవలు అందని ద్రాక్షగానే ఉన్నాయి. డిస్పెన్షనరీకి నిత్యం 200 మంది వైద్యం కోసం వస్తుంటారు. అయితే ఇందులో నలుగురు వైద్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్కరు కూడా లేరు. ఏఎన్‌ఎంలు కేవలం తమకు తోచిన వైద్యం అందిస్తున్నారు. ఫార్మసిస్టులు ముగ్గురు ఉండాల్సి ఉండగా ఇద్దరు విధులు నిర్వహిస్తున్నారు.

ఒకరు డిప్యూటేషన్‌పై, స్టాఫ్‌నర్స్‌ ఒకరు ఉండగా ఒక పోస్టు ఖాళీగా ఉంది. వెంటనే ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులతో పాటు ఇతర సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలని కార్మికులు కోరుతున్నారు. దీంతో పాటు ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించి పూర్వవైభవం తీసుకురావాల్సి అవసరముంది. 

ఇబ్బంది పడుతున్నారు
ప్రభుత్వ బీమా ఆసుపత్రిలో సరైన వైద్య సేవలు అందడం లేదు. కొన్నేళ్ల క్రితం ఆసుపత్రిలో అన్ని విభాగాల వైద్యసేవలు అందేవి. ప్రస్తుతం సరిపడా సిబ్బంది లేకపోవడంతో సరైన చికిత్సలు అందడం లేదు. ఎంతపెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా ఈఎస్‌ఐ ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చన్న దీమా లేకుండా పోయింది. అన్ని విభాగాలకు చెందిన వైద్యులను నియమించి, వసతులు కల్పించాలి.       
– శేబ్బీర్‌హుస్సేన్, ఎస్పీఎం కార్మిక సంఘం నాయకుడు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top