ఆ ‘వెసులుబాటే’ కొంపముంచిందా..? | Enquiry On MMTS Incident In Hyderabad | Sakshi
Sakshi News home page

ఆ ‘వెసులుబాటే’ కొంపముంచిందా..?

Nov 21 2019 4:36 AM | Updated on Nov 21 2019 4:36 AM

Enquiry On MMTS Incident In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాచిగూడ రైల్వే స్టేషన్‌.. నవంబర్‌ 11, ఉదయం 10.30 గంటలు.. అంతకు ఐదు నిమిషాల క్రితం లింగంపల్లి నుంచి వచ్చి ఫలక్‌నుమా వెళ్లేందుకు రెండో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఎంఎంటీఎస్‌ రైలు సిగ్నల్‌ లేకున్నా ముందుకు కదిలింది. చూస్తుండగానే వేగం గంటకు దాదాపు 40 కి.మీ. అందుకుంది. సరిగ్గా 500 మీటర్ల దూరం వెళ్లి మరో ప్లాట్‌ఫామ్‌ వద్దకు వెళ్లేందుకు లైన్‌ క్రాస్‌ చేస్తూ ఎదురుగా వచ్చిన కర్నూలు టౌన్‌–సికింద్రాబాద్‌ హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను బలంగా ఢీకొంది. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజిన్‌ ఎంఎంటీఎస్‌ లోకోపైలట్‌ క్యాబిన్‌లోకి చొచ్చుకెళ్లింది.

రైళ్ల కదలికల్లో సిగ్నళ్లదే కీలక పాత్ర. వాటిని గమనించకుండా లోకోపైలట్లు రైళ్లను ముందు కు కదిలించరు. మరి సిగ్నల్‌ ఇవ్వకున్నా ఎంఎంటీఎస్‌ రైలు లోకోపైలట్‌ దాన్ని ముందుకు ఎందుకు తీసుకెళ్లారు అన్నది అర్థంకాని ప్రశ్న. సమాధానం చెప్పేందుకు ఆయన ప్రస్తుతం ప్రాణాలతో లేరు. అక్కడి పరిస్థితులను పరిశీలించిన రైల్వే కమిషనరేట్‌ అధికారులు ప్రమాదానికి కారణాలను శోధించే పనిలో రెండు రోజులు పర్యటించారు. తుది నివేదిక ఇవ్వాల్సి ఉంది. కానీ.. అధికారులు మాత్రం ప్రమాదానికి ఓ ‘వెసులుబాటే’ కారణమని దాదాపు నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. 

ఏంటది?
నగరంలో ఎంఎంటీఎస్‌ రైళ్లకు ప్రత్యేకంగా సిగ్నళ్లకు సంబంధించి ఓ వెసులుబాటు ఉంది. ఏదైనా స్టేషన్‌లో ఎంఎంటీఎస్‌ రైలు ఆగిన తర్వాత రెండు నిమిషాలకు తిరిగి బయలుదేరుతుంది. సాధారణంగా మిగతా రైళ్లు సిగ్నల్‌ ఇచ్చే వరకు వేచి ఉంటాయి. ఎంఎంటీఎస్‌ రైళ్లకు మాత్రం ఈ విషయంలో ఓ వెసులుబాటు ఉంది. రెండు నిమిషాల్లో సిగ్నల్‌ పడకున్నా రైలును ముందుకు తీసుకెళ్లచ్చు. అయితే ఆ సమయంలో దాని వేగం 12 కి.మీ. లోపే ఉండాల్సి ఉంటుంది. తక్కువ వేగంతో ఉన్నప్పుడు బ్రేక్‌ వేసి ఆపే అవకాశం ఉంటుంది.

సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, ఫలక్‌నుమా, లింగంపల్లి, హఫీజ్‌పేట స్టేషన్‌లలో మాత్రం ఈ వెసులుబాటు ఉండదు. ఈ ఆరు స్టేషన్‌లలో లూప్‌ లైన్లు ఉన్నందున రైళ్లు ఎదురుగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ ఆరు స్టేషన్లలో మాత్రం కచ్చితంగా సిగ్నల్‌ ఇచ్చిన తర్వాతనే ముందుకు కదలాలి. కాచిగూడ స్టేషన్‌లో ఆ వెసులుబాటు లేదనే విషయాన్ని మరిచి సిగ్నల్‌ లేకున్నా లోకోపైలట్‌ రైలును ముందుకు తీసుకెళ్లాడని అధికారులు దాదాపు నిర్ధారణకు వచ్చారు. ఆ సమయంలో వేగం 40కి.మీ.కి చేరుకోవటం పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఎంఎంటీఎస్‌ రైలు బయలుదేరేముందు లోకోపైలట్‌ తన క్యాబిన్‌లోనే బెల్‌ మోగిస్తాడు, గార్డు కూడా తిరిగి బెల్‌ మోగిస్తేనే లోకోపైలట్‌ రైలును ముందుకు నడిపించాల్సి ఉంటుంది. ప్రమాద సమయంలో ‘బెల్‌’ విషయంపై అధికారులు గార్డును విచా రించారు. అధికారులు మాత్రం ప్రమాదానికి సిగ్నల్‌తో సంబంధం లేకుండా ఎంఎంటీఎస్‌ ముందుకు వెళ్లేందుకు ఉన్న వెసులుబాటే కారణమని భావిస్తుండటం విశేషం. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement