అడ్డగోలు బదిలీలు!

Corruption In Telangana Teacher Transfers - Sakshi

టీచర్ల బదిలీల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అధికారులు

సీఎం హెచ్చరించినా ఆగని వైనం

జిల్లా పరిధిలో రూ.2 లక్షలు

అంతర్‌జిల్లా బదిలీ కోసం 3 లక్షల నుంచి 5 లక్షల దాకా వసూలు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉపాధ్యాయుల సాధారణ బదిలీలకు ముందే అడ్డగోలుగా ‘విచక్షణ’ బదిలీలు జరుగుతున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాము కోరుకున్న చోట పోస్టింగ్‌ కోసం కొందరు, అధికంగా హెచ్‌ఆర్‌ఏ (ఇంటి అద్దె భత్యం) పొందవచ్చని మరికొందరు, మారుమూల ప్రాంతాల్లో ఉండటం ఇష్టం లేక పట్టణ ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు అధికారులను, రాజకీయ నేతలను పట్టుకుని ఈ ‘విచక్షణ’ బదిలీలు చేయించుకుంటున్నట్టు ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. కొందరు అధికారులు లక్షల కొద్దీ ముడుపులు పుచ్చుకుని ఇష్టారాజ్యంగా బదిలీలు చేస్తున్నారని.. దీనివల్ల ఇతర టీచర్లకు నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ బదిలీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. వాస్తవానికి ఈ బదిలీల వ్యవహారంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే అధికారులను హెచ్చరించారు. ‘టీచర్ల విచక్షణ బదిలీలతో ప్రభుత్వం అభాసుపాలవుతోంది. అత్యవసరమైతే తప్ప అలాంటి బదిలీలు వద్దు. బదిలీల షెడ్యూల్‌ జారీ చేశాక ఎట్టి పరిస్థితుల్లో విచక్షణ బదిలీలు చేయవద్దు..’ అని స్పష్టం చేశారు. అయినా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఈనెల 6వ తేదీన బదిలీల షెడ్యూల్‌ విడుదలయ్యాక కూడా పాత తేదీలతో అడ్డగోలుగా బదిలీలు చేసినట్టు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.

400కు పైగా బదిలీలు!
విచక్షణ బదిలీల పేరుతో ఇప్పటివరకు దాదాపు 400 మంది టీచర్లు బదిలీ పొందినట్టు విద్యాశాఖ అధికారులే పేర్కొంటున్నారు. ఇందులో ఆయా జిల్లాల పరిధిలో 300 మందిని బదిలీ చేయగా.. మరో వంద మందిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో భారీగా సొమ్ము చేతులు మారినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాల పరిధిలోని పట్టణ ప్రాంతాలకు బదిలీ కోసం రూ.2 లక్షల వరకు, అంతర్‌ జిల్లా బదిలీలకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు.

రాజకీయ పలుకుబడి, డబ్బులు..
సాధారణ బదిలీల్లో తాము కోరుకున్న స్థానాలు రాకపోవచ్చని భావించిన కొందరు ఉపాధ్యాయులు.. రాజకీయ నాయకులతో పరిచయాన్ని, డబ్బు, పరపతిని ఉపయోగించుకుని కోరుకున్న చోటికి బదిలీ చేయించుకోగలిగారని అంటున్నారు. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు ముట్టజెప్పాల్సి వచ్చిందని పోస్టింగులు సాధించుకున్న ఉపాధ్యాయులు తోటి ఉపాధ్యాయులతో చెప్పుకుంటుండటం గమనార్హం. ఓ కీలక అధికారి, కొందరు నేతలను పట్టుకుంటే కావాల్సిన చోటికి బదిలీ చేయించుకోవచ్చని, తమకు తెలిసిన ఏయే టీచర్‌ ఎంత ‘ఖర్చు’ పెట్టుకుని బదిలీ చేయించుకున్నారని ఉపాధ్యాయుల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇక కొందరు నేతలు అధిక హెచ్‌ఆర్‌ఏ వర్తించే ప్రదేశాలను ముందే గుర్తించి.. ఆయా చోట్ల పోస్టింగ్‌ ఇప్పించేందుకు పలువురు టీచర్లతో బేరాలు కూడా కుదుర్చుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

టీచర్లు వెళ్లి చేరితేనే..
ఇతర జిల్లాల నుంచి ఒక్క రంగారెడ్డి జిల్లాకే 35 మంది టీచర్లు బదిలీ చేయించుకున్నారు. పాత రంగారెడ్డి జిల్లా పరిధిలోకి మరో 13 మంది టీచర్ల బదిలీలు జరిగాయి. ఇవన్నీ బయటకు వచ్చిన వివరాలే. ఇంకా టీచర్లు వెళ్లి స్కూళ్లలో చేరితే తప్ప తెలియని విధంగా బదిలీల ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. గతంలో ఎవరినైనా విచక్షణ బదిలీ చేయాలనుకుంటే జీవో రూపంలో ఉత్తర్వులు వెలువడేవి. కానీ ఇప్పుడు మెమో రూపంలో బదిలీలు చేస్తున్నారు. దీంతో సదరు టీచర్లు ఆయా పాఠశాలలకు వెళ్లి చేరితే తప్ప బదిలీ అయినట్టు బయటికి తెలియడం లేదు. ఇలా హైదరాబాద్, సంగారెడ్డి, నల్లగొండ, వరంగల్, మెదక్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల నుంచి 200 మందికిపైగా టీచర్లకు బదిలీలు జరిగినట్టు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. మరోవైపు ఇప్పటివరకు సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ), పండిట్లు, పీఈటీలు, స్కూల్‌ అసిస్టెంట్లను విచక్షణ బదిలీలు చేయగా.. ఈసారి పెద్ద సంఖ్యలో ప్రధానోపాధ్యాయులూ ఇలా బదిలీ అయ్యారు. ఒక్క వరంగల్‌ జిల్లా పరిధిలోనే నలుగురిని ఇలా పట్టణ ప్రాంతానికి బదిలీ చేసినట్టు తెలిసింది. ఇప్పటివరకు జరిగిన బదిలీలతోపాటు మరో 200 వరకు బదిలీల ఫైళ్లు ఉన్నట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు.

గల్లంతవుతున్న పోస్టులు
స్థానిక, ఓపెన్‌ కోటాలలో 80:20 పద్ధతిన పోస్టులు భర్తీ చేయాలి. కానీ విచక్షణ బదిలీలతో మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో స్థానికేతరుల సంఖ్య పెరిగిపోయిందని, దీనివల్ల స్థానికులకు పోస్టులు మిగలకుండా పోయే పరిస్థితి నెలకొందని అంటున్నారు. అంతేకాదు అక్రమ బదిలీలతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 30 శాతం హెచ్‌ఆర్‌ఏ కలిగిన ప్రదేశాలు (ఖాళీలు) భర్తీ అయిపోయాయని చెబుతున్నారు. మరోవైపు అడ్డదారి బదిలీల ఆర్డర్లు పట్టుకుని వస్తున్న టీచర్లతో అధికారులు గందరగోళంలో పడుతున్నారు. ఇలా పోస్టింగ్‌ ఆర్డర్లు పట్టుకుని వస్తున్న వారి కారణంగా.. ఖాళీల సంఖ్య మారిపోతుండటంతో తరచూ మార్పులు చేయాల్సి వస్తోందని ఓ ఉన్నతాధికారి వాపోవడం గమనార్హం. మరోవైపు అడ్డదారి బదిలీలపై నిరసన తెలిపినా ప్రభుత్వంగానీ, ఉన్నతాధికారులుగానీ పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.

సీఎంవో బదిలీలు రద్దు చేయాలి
‘‘అక్రమ బదిలీలను ప్రోత్సహించడం సరికాదు. ఇలా ఇప్పటివరకు చేసిన బదిలీలన్నింటినీ రద్దు చేయాలి. దీనిపై కొందరు టీచర్లు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. విచక్షణ బదిలీల కోసం ఇంకా 200 ఫైళ్లు ఉన్నట్టు తెలిసింది..’’ – భుజంగరావు, ఎస్టీయూ అధ్యక్షుడు

ఇక కౌన్సెలింగ్‌ ఎందుకు?
‘‘ప్రభుత్వమే అడ్డదారిలో బదిలీలు చేస్తే.. ఇంకా కౌన్సెలింగ్‌ ఎందుకు? ఇప్పటివరకు చేసిన బదిలీలను రద్దు చేయాలి. ఆయా స్థానాలు అర్హులైన వారికి దక్కేలా చూడాలి..’’ – రవి, యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top