హెచ్‌ఎం వర్సెస్‌ టీచర్‌

Controversy Between Teacher and Headmaster at ZP School, Kadipikonda - Sakshi

కడిపికొండ జెడ్పీ హైస్కూల్‌లో రగడ

టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన హెచ్‌ఎం

విద్యారణ్యపురి: కడిపికొండలోని జిల్లాపరిషత్‌ హైస్కూల్‌లోని హెచ్‌ఎం జయమ్మ, అదే స్కూల్‌లో గణితం స్కూల్‌ అసిస్టెంట్‌గా వెంకటకరుణాకర్‌కు మధ్య కొంత కాలంగా విబేధాలు నెలకొన్నాయి. ఇరువురు పరస్పరం డీఈఓకు ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు వెంకటకరుణాకర్‌ తన విధులను సక్రమంగా నిర్వర్తించకపోగా.. బెరింపులకు గురిచేస్తున్నారని హెచ్‌ఎం జయమ్మ 15సార్లకు పైగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోకున్నా.. చార్జెస్‌ ప్రేమ్‌ చేశారని తెలిసింది. మరోవైపు వెంకటకరుణాకర్‌ కూడా హెచ్‌ఎం జయమ్మపై డీఈఓకు పలు ఆరోపణలతో ఫిర్యాదు చేశారని తెలిసింది. ఇరువురి ఫిర్యాదులపై డీఈఓ కార్యాలయంలోని డీసీఈబీ కార్యదర్శి రమేష్‌బాబుతో పరిశీలన చేయించారు. ఈ అంశంపై ఆయన నివేదిక ఇవ్వగా... హెచ్‌ఎం జయమ్మ  చెప్పినట్లు ఉపాధ్యాయుడు వినడం లేదని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.

ఒక ఇంక్రిమెంట్‌ కట్‌ చేస్తాం 
కడిపికొండ జెడ్పీ హైస్కూల్‌లో హెచ్‌ఎం జయమ్మ, వెంకటకరుణాకర్‌కు మధ్య తలెత్తిన వివాదంపై విచారణ జరిపించాక వెంకటకరుణాకర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఈఓ కె.నారాయణరెడ్డి వివరణ ఇచ్చారు. కొద్దిరోజుల క్రితమే ఆయనపై చార్జెస్‌ ఫ్రేమ్‌ చేశామన్నారు. ఒకటి, రెండురోజుల్లో విద్యాశాఖకు సబంధించిన వారితో విచారణ జరిపించాక చర్యల్లో భాగంగా ఒక ఇంక్రిమెంట్‌ కట్‌ చేస్తామని తెలిపారు. 

పోలీసులకు ఫిర్యాదు
కడిపికొండ జెడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎం జయమ్మ ఈనెల 13న సంబంధిత పరిధిలోని పోలీస్టేషన్‌లో మ్యాథ్స్‌ స్కూల్‌అసిస్టెంట్‌ వెంకటకరుణాకర్‌పై ఫిర్యాదు చేశారు. పాఠశాలలో తన వద్దకు వెంకటకరుణాకర్‌ వచ్చి రిజిస్టర్‌లో సంతకం చేయబోగా.. సర్వీస్‌బుక్‌ ఇవ్వాలంటూ తాను ఇచ్చిన మెమో, నోటీసులు తీసుకోవాలని సూచించానని తెలిపారు. సరేనని నమ్మబలికి హాజరు రిజిస్టర్‌లో సంతకం చేశాక మెమో, నోటీసుబుక్‌ను తన ముఖంపై కొట్టడంతో పాటు కులం, లింగ వివక్షతతో దూషించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా ఏసీసీ ఈనెల 16న హైస్కూల్‌కు వెళ్లి కూడా విచారణ జరిపినట్లు సమాచారం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top