వైద్య విద్య కౌన్సెలింగ్‌లో గందరగోళం

Confusion in medical education counseling - Sakshi

అఖిల భారత కోటా జాబితాను తొలుత రద్దు చేయడంపై అనుమానం

ఎట్టకేలకు సవరించిన జాబితాను విడుదల చేసిన ఎంసీసీ

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత కోటా సీట్లకు జరుగుతున్న నీట్‌–2019 కౌన్సెలింగ్‌లో గందర గోళం నెలకొంది. మొదటి కౌన్సెలింగ్‌లో సీట్లు సాధించిన విద్యార్థుల మెరిట్‌ జాబితాను ఉప సంహరించుకోవడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎట్టకేలకు సవరించిన జాబితాను మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) మంగళవారం రాత్రి విడుదల చేసింది. అయితే ఎందుకు రద్దు చేశారన్న దానిపై స్పష్టతివ్వలేదు. దీనిపై తెలంగాణలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వర్గాలూ ఏమీ చెప్పడం లేదు. సవరించిన జాబితాను వెబ్‌సైట్‌  ఝఛిఛి.nజీఛి.జీnలో చూడ వచ్చు. మొదటి మెరిట్‌ జాబితా ఉపసంహరించుకోవటానికి గల కారణం స్పష్టం చేయకపోవడంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.  బుధవారం నుంచి సవరించిన జాబితాలో పేరున్న అభ్యర్థులు తమ కేటాయింపు లేఖను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  

టాప్‌–20లో 18 మంది అక్కడే.. 
నీట్‌లో టాప్‌–20 ర్యాంకులు సాధించిన వారిలో 18 మంది ఢిల్లీలోని మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజీని ఎంచుకున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. మహిళల్లో జాతీయ ఫస్ట్‌ ర్యాంకు సాధించిన మాధురీరెడ్డి జాతీయస్థాయిలో ప్రముఖ మెడికల్‌ కాలేజీనే ఎంచుకున్నట్లు వర్సిటీ వర్గాలు చెబుతున్నా యి. అఖిల భారత కోటా కింద తెలంగాణలో ఏ కాలేజీని.. ఎవరెవరు ఎంచుకున్నారన్న సమాచారం తమ వద్ద లేదని వారంటున్నారు.  

ఈడబ్ల్యూఎస్‌ కోటాపై అస్పష్టత.. 
రాష్ట్రంలోనూ వైద్య విద్య కౌన్సెలింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే కన్వీనర్, మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. కన్వీనర్‌ కోటా సీట్లకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తయింది. అయితే ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని సీట్లకు మాత్రం అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్‌)కు రిజర్వేషన్లను అమలు చేసేందుకు 190 సీట్లను అదనంగా కేంద్రం కేటాయించిన సంగతి తెలిసిందే. అందులో ఎవరికీ సందేహాలు లేవు. కానీ ప్రైవేటులోని కన్వీనర్‌ కోటా సీట్లలోనూ ఈడబ్ల్యూఎస్‌ను అమలు చేస్తామని కేంద్రం తెలిపింది. అందుకోసం దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

ఆ మేరకు గత నెల 28వ తేదీ వరకు గడువు విధించింది. అందుకోసం రాష్ట్రంలోని 10 ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. కానీ ఇప్పటివరకు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) సీట్ల పెంపుపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే కన్వీనర్‌ కోటా సీట్లకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తయింది. అంటే ప్రైవేటులోని కన్వీనర్‌ కోటా సీట్లకు మరి ఎప్పుడు ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్లు కేటాయిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. సకాలంలో సీట్లు కేటాయించకుంటే పరిస్థితి ఏంటనేది కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిర్వహిస్తున్న కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీని, అలాగే అదనపు సీట్ల కోసం ఎదురుచూస్తున్న ఆ 10 ప్రైవేటు మెడికల్‌ కాలేజీలను వేధిస్తుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top