కాంగ్రెస్‌లో ఉత్కంఠ | Congress workers upset as nominated posts lie vacant | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో ఉత్కంఠ

Nov 16 2014 2:56 AM | Updated on Mar 18 2019 7:55 PM

అధికార కాంగ్రెస్ పార్టీలో అటు ప్రభుత్వ పరంగా, ఇటు పార్టీ పరంగా నెలాఖరుకు భారీ మార్పులు జరగబోతున్నాయి.

20 తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ!
 * అనంతరం మంత్రి మండలి విస్తరణ, పునర్ వ్యవస్థీకరణ
* లాబీయింగ్ జోరు పెంచిన ఆశావహులు
* సమన్వయ బాటలో సీఎం సిద్ధు, కేపీసీసీ చీఫ్ ?

సాక్షి, బెంగళూరు : అధికార కాంగ్రెస్ పార్టీలో అటు ప్రభుత్వ పరంగా, ఇటు పార్టీ పరంగా నెలాఖరుకు భారీ మార్పులు జరగబోతున్నాయి. గత ఏడాదిన్నరగా ఊరిస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు మంత్రి మండలి విస్తరణ, పునఃవ్యవస్థీకరణ కూడా జరగనుంది. దీంతో ఆశావహులు ఇటు సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌తో పాటు ఢిల్లీ పెద్దల ఆశీస్సులను పొందడానికి భారీ లాబీయింగ్ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటికీ నామినేటెడ్ పోస్టుల భర్తీ కొలిక్కి రాలేదు.

సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ మధ్య నడుస్తున్న కోల్డ్‌వారే ఇందుకు ప్రధాన కారణమనేది బహిరంగ రహస్యం. అయితే గత నెల బెంగళూరు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఈ ఇద్దరు నాయకులపై సీరియస్ అయ్యారు. దీంతో వారు దారిలోకి వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ నెల 20 తర్వాత జాబితాను విడుదల చేయాలని పార్టీ అధినాయకులు భావిస్తున్నట్లు సమాచారం.

ఈ విషయమై సీఎం ఆప్త మంత్రి ఒకరు మాట్లాడుతూ... ‘మొదట్లో ఈనెల 16న జాబితా విడుదల చేయాలని భావించినా, ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో ఓడిపోయిన వారికి పోస్టులను కేటాయించడంపై కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అందువల్లే సిద్ధరామయ్య, పరమేశ్వర్ సోమవారం నాటి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఇరవై తర్వాత వారు ఈ విషయమై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఏది ఏమైనా నెలాఖరుకు ఈ విషయంలో స్పష్టత వస్తుంది’ అని పేర్కొన్నారు.
 
పదవులు కోల్పోవడం ఖాయం!
ఏడాదిన్నర దాటినా రాష్ట్ర మంత్రి మండలిలో ఇంకా ఖాళీలు ఉన్నాయి. వీటిపై చాలా మంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పరమేశ్వర్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి కచ్చితమనే వాదన వినిపిస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే బసవరాజరాయరెడ్డి తదితరులు మంత్రి పదవులు ఆశలు పెట్టుకున్నారు. వీరికి ఇప్పటికైనా పదవులు కేటాయించకపోతే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. పరమేశ్వర్ డిప్యూటీ సీఎం పదవి కోరకున్నా ఆయన అనుచరులు హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. ‘అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటాం.

మంత్రి మండలి విస్తరణ కూడా ఉంటుంది’ అని ఇటీవల బెంగళూరు పర్యటనలో డిగ్గీ పేర్కొనడం ఇందుకు ఊతమిస్తోంది. చాలా మంది సీనియర్ మంత్రులు కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై సొంత పార్టీ ఎమ్మెల్యేలే సీఎం సిద్ధరామయ్యకు లేఖలు రాశారు. మరోవైపు అవినీతి, అక్రమాలే ప్రచార సాధనాలుగా చేసుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది మంత్రులపై భూకబ్జా, ఇసుక అక్రమ రవాణా తదితర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పునఃవ్యవస్థీకరణలో భాగంగా కొంతమందిని పదవుల నుంచి తప్పించడంతో పాటు శాఖల మార్పు కూడా జరగవచ్చునని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఈ రెండు విషయాలపై కూడా ‘ఢిల్లీ టూర్’లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా,‘పునఃవ్యవస్థీకరణలో భాగంగా కొంత మంది మంత్రులను తప్పించవచ్చు. శాఖల మార్పు కూడా ఉంటుంది’ అని సీఎం సిద్ధరామయ్య ఢిల్లీలో ఇటీవల పేర్కొనడం ఇందుకు మరింత బలమిస్తోంది. ఏది ఏమైన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దాదాపు ఏడాదిన్నర తర్వాత కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు జరుగనున్నాయనేది స్పష్టమవుతోంది. అయితే ఈ పరిణామం ఏ మలుపు తిరుగుతుందో తెలియడానికి మరికొంత సమయం వేచిచూడాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement