
హరారే: ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించి... రెండు సార్లు వన్డే వరల్డ్‌కప్ చేజిక్కించుకున్న విండీస్ ఎట్టకేలకు వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జరుగనున్న మెగా టోర్నీకి అర్హత సాధించింది. చిన్న జట్లతో కలిసి క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొన్న విండీస్ బుధవారం స్కాట్లాండ్‌తో జరిగిన సూపర్‌సిక్స్ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో గెలుపొందింది. తక్కువ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో వరణుడు విండీస్ వైపు నిలవడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం గెలిచి ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కరీబియన్లు 48.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటయ్యారు.
గేల్ (0) ‘గోల్డెన్’ డక్‌గా వెనుదిరగగా... ఎవిన్ లెవీస్ (66; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్లోన్ శామ్యూల్స్ (51; 4 ఫోర్లు) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో షరీఫ్, బ్రాడ్ వీల్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో స్కాట్లాండ్ 35.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 125 పరుగులతో ఉన్న సమయంలో వర్షం పడింది. మ్యాచ్ నిలిచే సమయానికి డక్‌వర్త్ లూయిస్ ప్రకారం స్కాట్లాండ్ స్కోరు 130 పరుగులుగా ఉంటే ఆ జట్టు గెలిచేది. అయితే ఆ స్కోరుకు ఐదు పరుగుల దూరంలో స్కాట్లాండ్ ఉండటంతో విండీస్ విజయం ఖాయమైంది.