పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు.
దుబాయ్ : పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు. శుక్రవారం మూడో రోజు ఆట సందర్భంగా అతను బంతిని ట్రౌజర్‌కున్న జిప్ మీద పలుమార్లు బలంగా రుద్దినట్లు టీవీ రీప్లేలో స్పష్టమైంది. దీంతో అంపైర్లు రాడ్ ఠక్కర్, ఇయాన్ గౌల్డ్‌లు కెప్టెన్ స్మిత్‌ను పిలిచి హెచ్చరించారు. దాంతో పాటు సఫారీ జట్టుకు జరిమానా విధిస్తూ పాక్ స్కోరుకు ఎక్స్‌ట్రాల రూపంలో ఐదు పరుగులు కలిపారు. రెండో ఇన్నింగ్స్‌లో 31వ ఓవర్‌కు ముందు ఈ సంఘటన జరిగింది. అప్పటికి పాక్ స్కోరు 67/3. అయితే సవరించిన ఐసీసీ నిబంధనల ప్రకారం ఈ సంఘటనకు బాధ్యుడైన డుప్లెసిస్‌పై చర్య తీసుకునే అవకాశముంది.
ఇదే జరిగితే డుప్లెసిస్‌పై 50 నుంచి వంద శాతం మ్యాచ్ ఫీజులో కోత, ఒక టెస్టు మ్యాచ్, రెండు వన్డేలు లేదా రెండు టి20ల్లో నిషేధం విధించే అవకాశముంది. ఇందులో ఏది ముందు వస్తే ఆ మ్యాచ్‌లకు ఈ నిషేధం వర్తిస్తుంది. 2006 ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ట్యాంపరింగ్‌కు పాల్పడిందని అంపైర్లు ఐదు పరుగుల జరిమానా విధించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన అప్పటి కెప్టెన్ ఇంజమామ్ జట్టును తీసుకుని మైదానం బయటకు వెళ్లిపోయాడు. దీంతో ఇంగ్లండ్ గెలిచినట్లు ప్రకటించారు. మళ్లీ అప్పటి మ్యాచ్ తర్వాత ట్యాంపరింగ్ జరగడం ఇప్పుడే.
పాక్‌పై విజయం దిశగా స్మిత్‌సేన
రెండో టెస్టులో దక్షిణాఫ్రికా విజయం దిశగా సాగుతోంది. శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు చేసింది. మిస్బా (42 బ్యాటింగ్), అసద్ షఫీక్ (28 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం పాక్ 286 పరుగులు వెనుకబడి ఉంది. అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టం. అంతకుముందు 460/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 163.1 ఓవర్లలో 517 పరుగులకు ఆలౌటైంది. దీంతో 418 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.