మళ్లీ ఆడాలని ఉంది: బెల్జియం భామ

Kim Clijsters Plans Comeback In 2020 - Sakshi

బ్రసెల్స్‌:  ఏడేళ్ల క్రితం టెన్నిస్‌కు వీడ్కోలు చెప్పిన బెల్జియం భామ కిమ్‌ క్లియస్టర్స్‌ మళ్లీ కోర్టులో దిగేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. 2020లో తాను రాకెట్‌ పడతానంటూ తన మనసులోని మాటను వెల్లడించారు. మాజీ నంబర్‌ వన్‌, నాలుగు గ్లాండ్‌ స్లామ్‌ల విజేత అయిన క్లియస్టర్‌.. 2012లో టెన్నిస్‌కు గుడ్‌ చెప్పేశారు. ఇలా తన రిటైర్మెంట్‌ ప‍్రకటించడం రెండోసారి. అయితే రెండుసార్లు రిటైర్మెంట్‌  తీసుకున్న క్లియస్టర్‌కు ఆటపై మక్కువ తగ్గలేదు. మళ్లీ టెన్నిస్‌ ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే టెన్నిస్‌ ఆల్‌ హాఫ్‌ ఫేమ్‌లో సభ్యురాలైన క్లియస్టర్‌.. వచ్చే ఏడాది టెన్నిస్‌ రాకెట్‌ పట్టడమే లక్ష్యం అంటున్నారు.

‘నా లక్ష్యం ఇప్పుడు ఫిట్‌నెస్‌ సాధించడంపైనే ఉంది. అత్యుత్తమ స్థాయిలో టెన్నిస్‌ ఆడాలంటే ఫిట్‌నెస్‌ను  కాపాడుకోవాలి. ఇది నా చాలెంజ్‌. నన్ను నేను మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి సారించా.  ఇది చాలా కష్టంతో కూడుకున్న నిర్ణయం. నేను కనీసం ఒక గ్రాండ్‌ స్లామ్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగడానికి కసరత్తు చేస్తున్నా. ఇందుకోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంది’ అని క్లియస్టర్‌ పేర్కొన్నారు.

2007లో వరుస గాయాల కారణంగా ఆట నుండి తప్పుకుంది. ఏడాది తర్వాత ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఈ మాజీ నెంబర్‌ వన్‌ 2009లో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. పునరాగమనం చేసిన ఏడాదిలోనే యుఎస్‌ ఓపెన్‌ గెలిచి సరికొత్త రికార్డు సృష్టించారు. గ్రాండ్‌శ్లామ్‌ గెలిచిన తల్లిగా రికార్డులకెక్కారు క్లియస్టర్స్‌. 2010లోనూ అదే జోరు కొనసాగించిన క్లియస్టర్స్‌ మళ్ళీ యుఎస్‌ ఓపెన్‌ నిలబెట్టుకున్నారు. ఇలా వరుసగా రెండేళ్ళు గ్రాండ్‌శ్లామ్స్‌ గెలిచిన తల్లిగా చరిత్ర సృష్టించారు. 2003లో ఏడాది పాటు నెంబర్‌ వన్‌ ర్యాంకును కైవసం చేసుకున్న క్లియస్టర్స్‌ డబుల్స్‌లోనూ అగ్రస్థానం సాధించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top