ఇషిత.. బ్యాడ్మింటన్‌లో చిరుత | Ishita selected national level in badminton | Sakshi
Sakshi News home page

ఇషిత.. బ్యాడ్మింటన్‌లో చిరుత

Nov 15 2017 11:53 AM | Updated on Nov 15 2017 11:53 AM

Ishita selected national level in badminton - Sakshi

కోచ్‌ ఫణికుమార్‌తో..

పి.వి.సింధు భారత బ్యాడ్మింటన్‌ సంచలనం. ఒలింపిక్స్‌లో దేశానికి పతకం సాధించిన తెలుగు క్రీడాకారిణి. ఆమె అందించిన స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది చిన్నారులు బ్యాడ్మింటన్‌పై ఆసక్తి చూపుతున్నారు. అదే స్ఫూర్తితో జిల్లాలోని గుంతకల్లుకు చెందిన ఇషిత బ్యాడ్మింటన్‌లో రాణిస్తోంది. బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడే అయిన తండ్రి ప్రోత్సాహంతో రాష్ట్రస్థాయిలో అద్భుత ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికైంది.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: గుంతకల్లుకు చెందిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు సురేష్‌కుమార్, నర్మద దంపతుల కుమార్తె ఇషిత. పి.వి.సింధు స్ఫూర్తితో తండ్రి బాటలోనే బ్యాడ్మింటన్‌పై ఆసక్తి పెంచుకుంది. తాను ఎంచుకున్న లక్ష్యం వైపు ఒక్కో అడుగు వేస్తూ ముందుకు దూసుకుపోతోంది. తల్లిదండ్రుల తోడ్పాటు, కోచ్‌ ఫణికుమార్‌ అందించిన మెలకువలు తనను అండర్‌–14 విభాగంలో జాతీయస్థాయికి ఎంపికయ్యేలా చేశాయి.

ప్రతిభకు పదును..
గుంతకల్లు పట్టణంలో కోచ్‌లు మౌళి, రహీమ్‌ వద్ద గేమ్‌ నేర్చుకున్న ఇషిత ఆటతీరును మెరుగు పరుచుకునేందుకు అనంతపురంలోని స్మాష్‌ అకాడమీలో చేరింది. ఏడాదిన్నర వ్యవధిలోనే కోచ్‌ ఫణికుమార్‌ అందించిన మెలకువలతో ఉన్నత స్థాయికి చేరింది. ప్రత్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తూ సైడ్‌ డ్రాప్, హాఫ్‌ స్మాష్, ట్రిపుల్స్‌ ద్వారా ఆటలో పైచేయి సాధిస్తోంది. షటిల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్ల ద్వారా నిర్వహించే ర్యాంకింగ్‌ టోర్నీల్లో ప్రతిభ కనబరిచి మినీ స్టేట్‌ టోర్నీలో డబుల్స్‌ విభాగంలో పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచింది.

చీరాలలో నిర్వహించిన టోర్నీలో రన్నరప్‌గా నిలిచి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది నిర్వహించిన ఎంపికలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించింది. ఈ ఏడాది వైఎస్సార్‌ కడప జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అద్భుతమైన ఆటతీరుతో జాతీయస్థాయి సింగిల్స్‌ విభాగంలో ఎంపికైంది. ఈనెలలో జరిగే జాతీయస్థాయి క్రీడా పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది.

ఒలింపిక్సే లక్ష్యం
పి.వి.సింధు లాగా ఎప్పటికైనా ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడమే నా లక్ష్యం. జాతీయస్థాయికి ఎంపికే దీనికి మొదటి అడుగుగా భావిస్తాను. రోజూ 4 నుంచి 5 గంటలపాటు సాధన చేస్తాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్‌ నేర్పిస్తున్న మెలకువలతోనే బ్యాడ్మింటన్‌లో రాణించగలుగుతున్నాను. ఎప్పటికైనా లక్ష్యాన్ని చేరుకుంటాను. – ఇషిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement