
మొహాలి: ఐపీఎల్... క్రిస్ గేల్... క్రికెట్ ప్రజాదరణలో విడదీయలేని పేర్లివి. ఐపీఎల్ ఎంత పెద్ద హిట్టో, గేల్ కూడా అంతే గొప్పగా ఈ లీగ్‌లో పేరు గడించాడు. అలాంటి గేల్‌కు జనవరిలో వేలం సందర్భంగా చేదు అనుభవం ఎదురైంది. ఏడు సీజన్ల పాటు ప్రాతినిధ్యం వహించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతన్ని తీసుకోలేదు. చివరకు పంజాబ్ రూ.2 కోట్ల కనీస ధరకు దక్కించుకుంది. ఈ పరిణామాలపై తాజాగా గేల్ స్పందించాడు. తనను రీటెయిన్ చేసుకుంటామని రాయల్ చాలెంజర్స్ యాజమాన్యం హామీ ఇచ్చి... తర్వాత కనీసం ఫోన్ చేయకుండా మొహం చాటేసిందని అతడు చెబుతున్నాడు.
‘అది ఎంతో నిరుత్సాహపర్చింది. వారు నన్ను తీసుకోవట్లేదని తెలిసింది. వేలం చివరి రౌండ్‌లో ఎంచుకున్నా బాధపడేవాడిని కాదు. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. అప్పటికే సీపీఎల్, బీపీఎల్‌లలో రెండు సెంచరీలు చేశా. నా రికార్డులు అబద్ధం చెప్పవుగా. కొన్నిసార్లు ఐపీఎల్, ఆటకు దూరంగా వెళ్తున్నట్లు కనిపిస్తుంటుంది. జీవితం అంటే ఇదే’ అని గేల్ వివరించాడు.
నేనే దిగ్గజం..: ‘వారి దిగ్గజ ఆటగాళ్లలో నేనొకడిని కాదు. నేనే వారి దిగ్గజ ఆటగాడిని’ అంటూ గేల్ పరోక్షంగా బెంగళూరు జట్టును ఎద్దేవా చేశాడు. పంజాబ్‌కు ఐపీఎల్ ట్రోఫీని అందివ్వడం తన తక్షణ కర్తవ్యంగా, 2019 ప్రపంచకప్‌ను వెస్టిండీస్ గెలిచేలా చూడటం భవిష్యత్ లక్ష్యంగా తెలిపాడు.