మళ్లీ... అదే తడబాటు | Hockey World Cup: India go down 2-3 against Belgium | Sakshi
Sakshi News home page

మళ్లీ... అదే తడబాటు

Jun 1 2014 1:12 AM | Updated on Aug 21 2018 3:08 PM

మళ్లీ... అదే తడబాటు - Sakshi

మళ్లీ... అదే తడబాటు

మళ్లీ అదే తడబాటు... ఆధిక్యంలోకి వెళ్లడం... ఆ తర్వాత ఆధిక్యాన్ని కోల్పోవడం... చివరకు మ్యాచ్‌నే చేజార్చుకోవడం... కొన్నేళ్లుగా భారత హాకీ జట్టుకు అలవాటుగా మారింది.

బెల్జియం చేతిలో ఓడిన భారత్
 చివరి నిమిషంలో గోల్ సమర్పణ
 హాకీ ప్రపంచకప్
 
 ది హేగ్ (నెదర్లాండ్స్): మళ్లీ అదే తడబాటు... ఆధిక్యంలోకి వెళ్లడం... ఆ తర్వాత ఆధిక్యాన్ని కోల్పోవడం... చివరకు మ్యాచ్‌నే చేజార్చుకోవడం... కొన్నేళ్లుగా భారత హాకీ జట్టుకు అలవాటుగా మారింది. శనివారం మొదలైన హాకీ ప్రపంచకప్‌లో  బె ల్జియంతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. మ్యాచ్‌లో మరో 15 సెకన్ల సమయం... అప్పటికీ ఇరుజట్ల స్కోరు 2-2... డిఫెండర్ల ఏమరుపాటును పసిగట్టిన జాన్ డొమెన్... వాయువేగంతో భారత్ సర్కిల్‌లోకి దూసుకొచ్చాడు. మెరుపు వేగంతో బంతిని నేర్పుగా గోల్‌పోస్ట్‌లోకి పంపాడు.
 
 అంతే అప్పటి వరకు ‘డ్రా’ అనుకున్న మ్యాచ్‌ను బెల్జియం సొంతం చేసుకుంటే... నిమిషంలో ఫలితాన్ని తారుమారు చేసుకొని భారత్ మూల్యం చెల్లించుకుంది. ఫలితంగా ప్రతిష్టాత్మక హాకీ ప్రపంచకప్‌ను టీమిండియా ఓటమితో మొదలుపెట్టింది. కొయెసెరా స్టేడియంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెల్జియం 3-2తో భారత్‌పై గెలిచి శుభారంభం చేసింది. మన్‌దీప్ సింగ్ (45వ ని.), ఆకాశ్‌దీప్ సింగ్ (50వ ని.) భారత్‌కు గోల్స్ అందించగా... ఫ్లోరెంట్ అబెల్ (34వ ని.), సిమోన్ గోంగార్డ్ (56వ ని.), జాన్ డొమెన్ (70వ ని.) బెల్జియం తరఫున గోల్స్ చేశారు.
 
 మ్యాచ్ మొత్తం హోరాహోరీగా సాగినా చివరి నిమిషంలో జరిగిన డ్రామాలో భారత్ చేతులెత్తేసింది. మొత్తం ఆరు పెనాల్టీల్లో బెల్జియం ఒక్కదాన్ని వినియోగించుకోగా... భారత్‌కు దక్కిన ఏకైక పెనాల్టీ కార్నర్‌ను రూపిందర్ వృథా చేశాడు.
 
 ఆసీస్ దూకుడు: మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 4-0తో మలేసియాను ఓడించింది. గ్లెన్ టర్నర్ (25, 54వ ని.) రెండు గోల్స్ చేయగా, ఎడిల్ ఒకెండెన్ (50వ ని.), జెమీ డ్వేయర్ (52వ ని.) చెరో గోల్ సాధించారు. ఆసీస్ ఆరు పెనాల్టీ కార్నర్లను మిస్ చేసుకోగా, మలేసియా రెండింటిని వృథా చేసుకుంది. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 1-0తో గెలిచింది. అలిస్టర్ బ్రోగ్డన్ (6వ ని.) ఏకైక గోల్ చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement