మన సత్తాకు పరీక్ష!

Hockey World Cup: Ahead of Belgium pre-quarters - Sakshi

నేడు బెల్జియంతో కీలకపోరు 

ప్రపంచకప్‌ హాకీ టోర్నీ

భువనేశ్వర్‌: ప్రపంచకప్‌ను ఘనమైన విజయంతో ఆరంభించిన భారత హాకీ జట్టు పటిష్టమైన బెల్జియంను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య ఆదివారం ఆసక్తికర మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ బెల్జియంను ఓడిస్తే టీమిండియా నేరుగా క్వార్టర్‌ ఫైనల్స్‌లో అడుగు పెడుతుంది. బుధవారం తొలి మ్యాచ్‌లో భారత్‌ 5–0తో దక్షిణాఫ్రికాను కంగుతినిపించింది. ఇకపైనా ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని గట్టి పట్టుదలతో ఉంది. ఆ మ్యాచ్‌లో భారత్‌ అటాకింగ్‌లో అదరగొట్టింది. ఫార్వర్డ్‌లో మన్‌దీప్‌ సింగ్, సిమ్రన్‌జిత్‌ సింగ్, ఆకాశ్‌దీప్‌ సింగ్, లలిత్‌ ఉపాధ్యాయ్‌ మ్యాచ్‌ ఆసాంతం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ స్ట్రయికర్లంతా ఫామ్‌లో ఉన్నారు. మన్‌ప్రీత్‌ సింగ్‌ మిడ్‌ఫీల్డ్‌లో రాణించాడు. అయితే డిఫెండర్లు హర్మన్‌ప్రీత్‌ సింగ్, బీరేంద్ర లాక్రా, సురేందర్‌ కుమార్‌లు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఈ రక్షణ పంక్తితో పాటు గోల్‌ కీపర్‌ పి.ఆర్‌.శ్రీజేశ్‌ కూడా పెట్టని గోడలా ఉంటేనే పటిష్టమైన బెల్జియంను భారత్‌ను నిలువరించగలదు. లేదంటే ఘనవిజయం వెంటే పరాజయం వెక్కిరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే భారత్‌కు నిలకడే అసలు సమస్య! ఒక మ్యాచ్‌లో చెలరేగి... మరుసటి మ్యాచ్‌లో అలసత్వం ప్రదర్శించడం రివాజే.

పైగా ప్రపంచ ఐదో ర్యాంకర్‌ భారత్‌కు బెల్జియంతో పేలవమైన రికార్డుంది. 2013 నుంచి ఇప్పటివరకు ఇరు జట్లు 19 సార్లు తలపడితే భారత్‌ ఐది మ్యాచ్‌ల్లోనే గెలిచింది. బెల్జియం మాత్రం 13 సార్లు విజయం సాధించింది. ఒక మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది. చివరిసారిగా నెదర్లాండ్స్‌లో ఈ ఏడాది జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీలో తలపడగా... ‘డ్రా’ ఫలితం ఎదురైంది. మరోవైపు రియో ఒలింపిక్స్‌ రన్నరప్‌ బెల్జియం తక్కువ ర్యాంకులో ఉన్న కెనడాపై 2–1తో చెమటోడ్చి గెలిచింది. అందివచ్చిన పెనాల్టీ కార్నర్లను బెల్జియం ఆటగాళ్లు గోల్స్‌గా మలచడంలో విఫలమయ్యారు. దీంతో ఓ కూన జట్టుపై పోరాడి గెలవాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే ఒక మ్యాచ్‌తో, ఒక్క ఫలితంతో ప్రపంచ టాప్‌–3 జట్టును తక్కువ అంచనా వేయలేం. ఆతిథ్య దేశంపై గెలిచే సత్తా బెల్జియంకు ఉంది. ఫార్వర్డ్, డిఫెన్స్‌ అందరూ ఒక్క సారిగా కదంతొక్కితే భారత్‌కు కష్టాలు తప్పవు. ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నీలో ఏ ఒక్క పొరపాటైనా మూల్యం భారీగానే ఉంటుంది. కాబట్టి ఇరుజట్లు కూడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆడాలి. గత మ్యాచ్‌లో పెనాల్టీ కార్నర్లతో అనుభవమైన బెల్జియంకు భారత్‌తో ఎలా ఆడాలో తెలుసు. తప్ప కుండా మ్యాచ్‌ హోరాహోరీగా సాగే అవకాశముంది. 

పాక్‌ పరాజయం 
ప్రపంచకప్‌ను అత్యధికంగా నాలుగుసార్లు   గెలిచిన పాకిస్తాన్‌ జట్టుకు శుభారంభం దక్కలేదు. పూల్‌ ‘డి’లో భాగంగా జర్మనీతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 0–1తో ఓడిపోయింది. జర్మనీ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను మార్కో మిల్ట్‌కౌ 36వ నిమిషంలో చేశాడు. ఇదే పూల్‌లోని          మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 7–0తో మలేసియాను చిత్తుగా ఓడించింది. నెదర్లాండ్స్‌ తరఫున జెరోన్‌ హెర్ట్‌బెర్గర్‌ ‘హ్యాట్రిక్‌’ సాధించగా... మిర్కో ప్రుసెర్, మింక్‌ వాన్‌ డెర్‌ వీర్డెన్, రాబర్ట్‌ కెంపర్‌మన్, బ్రింక్‌మన్‌ ఒక్కో గోల్‌ సాధించారు.   

►రాత్రి గం. 7 నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌–1లో  ప్రత్యక్ష ప్రసారం  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top