దిగజారుడు రాజకీయాల్లో కొత్త ఒరవడి!

YS Jagan Comments On Central And State Governments Behaviour - Sakshi

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై వైఎస్‌ జగన్‌ ఫైర్‌

సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్, అసెంబ్లీలో ప్రత్యేక హోదా అంశంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన కామెంట్లపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పందించారు. శుక్రవారం పలువురు వైఎస్సార్‌ సీపీ నాయకులతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు నెలలకు ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్‌లో వాగ్దానాలు, వరాలు, పథకాలు పెడుతున్నారంటే ప్రజల్ని మోసం చేయటంలో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పెద్దలు పీహెచ్‌డీ తీసుకున్నట్లు అర్థమవుతోందన్నారు. మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెడుతూ ఇంత హడావుడి చేస్తున్నారంటే, ఇంతగా ప్రలోభాలకు దిగుతున్నారంటే రాజకీయాలు ఎంతగా దిగజారాయో ప్రజలందరికీ కనబడుతోందని మండిపడ్డారు. ఇది దిగజారుడు రాజకీయాల్లో కొత్త ఒరవడి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఐదో బడ్జెట్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ఎలాంటి ప్రకటన లేదని తెలిపారు. ముఖ్యమంత్రి చేతకానివాడు అయితే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దెబ్బతింటాయో దానికి చంద్రబాబు పెద్ద ఉదాహరణ అని అన్నారు. 

ఓటుకు కోట్లు కేసు తర్వాత చంద్రబాబు లొంగుబాటు వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఆ తర్వాతే ప్రత్యేక హోదాను చంద్రబాబు వదిలేసి లేని ప్యాకేజీకి ఊకొట్టారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ ఇదే అసెంబ్లీలో నాలుగు సార్లు తీర్మానాలు చేయించాడన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ఆ రోజు మేం ఇది తప్పు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని నల్ల చొక్కాలతో వచ్చాం. ఆ రోజు మమ్మల్ని సభలో నానా మాటలు అని ఈ రోజు చంద్రబాబు నల్ల చొక్కాలు వేసుకొచ్చారు. ఆ రోజు ఆందోళన చేసినందుకు, ప్రత్యేక హోదా కోసం గొంతు ఎత్తినందుకు మా ఎమ్మెల్యేలపై ప్రివిలైజ్‌ నోటీసులు ఇచ్చారు. ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు జై కొట్టడాన్ని వ్యతిరేకిస్తూ నేను నిరసన చేస్తుంటే, 2016 సెప్టెంబరు 8,9,10 తేదీల్లో అసెంబ్లీలో మాట్లాడ్డానికి నాకు 30 సెకన్ల సమయం కూడా ఇవ్వలేదు. ఈ రోజు ఎవరూ లేకుండా చూసి భారీ డైలాగులు చెప్తున్నాడు. అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదన్న కనీస జ్ఞానం కూడా చంద్రబాబుకు లేదు.

2017 జనవరి 27న ఇదే చంద్రబాబు ఏమన్నాడో గుర్తుకు తెచ్చుకోవాలి. ఇంతకంటే ఏ రాష్ట్రానికి ఇచ్చారో చెప్పండి.. అంటూ వరుసగా నాలుగు సంవత్సరాలు కేంద్రం ఏపీకి అద్భుతంగా సహాయం చేసిందని ఇదే చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు వైఖరిని చూస్తే హత్యచేసిన వాడే ఆ హత్యకు వ్యతిరేకంగా శాంతి ర్యాలీ చేస్తే ఎలా ఉంటుందో.. ఇప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు డైలాగుల్ని చూసినా అలాగే ఉంది. నాలుగేళ్లపాటు టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు కేంద్ర కేబినెట్‌లో ఉన్నారు. వాళ్లు ఉండి కూడా ఈ రాష్ట్రానికి ఏం చేశారంటే.. ఏమీ మాట్లాడరు. ఆ మంత్రులు దిగిపోతూ ప్రెస్‌మీట్‌ పెట్టి కూడా కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా చేసిందని చెప్పారు. 4 ఏళ్లుగా ఏ బడ్జెట్‌ను కూడా చంద్రబాబుగాని, కేంద్రంలో ఆయన మంత్రులు గాని వ్యతిరేకించలేదు. విశాఖ మెట్రో రైల్‌కు లక్ష రూపాయలు ఇచ్చినా, పోలవరం ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించకపోయినా చంద్రబాబు జై కొట్టారు. కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఇవ్వనిది ఓ టాన్‌ అకౌంట్‌ బడ్జెట్లో ఇస్తుందని ఎవరు అనుకుంటారు?. ఏపీకి న్యాయం చేసైనా ఎన్నికలకు వెళ్తారు అన్న ఆశ కొద్దిగా ఎవరికైనా మిగిలి ఉంటే అది లేకుండా చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీలన్నింటికీ గుణపాఠం తప్పద’ని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top