ఆమెతో వేగలేం..అందుకే వెళ్లిపోదాం

Vepakunta Rajanna Slams Paritala Sunitha in Anantapur - Sakshi

అనుచరులతో సమావేశమైన టీడీపీ నాయకుడు వేపకుంట రాజన్న

త్వరలో వైఎస్సార్‌సీపీలో   చేరేందుకు రంగం సిద్ధం

కనగానపల్లి: రాప్తాడు నియోజకవర్గంలో కుటుంబ పాలన సాగిస్తున్న మంత్రి పరిటాల సునీత అసలు పేరు ధర్మవరపు సునీత అని టీడీపీ నేత, పరిటాల రవి ముఖ్య అనుచరుడు వేపకుంట రాజన్న అన్నారు. సునీత వైఖరితో పాటు చంద్రబాబు ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగడం లేదన్న కారణంతో నాలుగేళ్లుగా ఆయన టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం తల్లిమడుగుల గ్రామంలో తన అనుచరులు, పలువురు టీడీపీ నాయకులతో కలసి సమావేశం నిర్వహించారు. టీడీపీ సీనియర్‌ నాయకులు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మామిళ్లపల్లి పెద్దప్పయ్య, వెంకటరామిరెడ్డి, గంగంపల్లి జేష్ట రామయ్య, కనగానపల్లి రామక్రిష్ణ, నెట్టం సుబ్రమణ్యం తదితరులు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో తమతో పాటు పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు.

అనంతరం వేపకుంట రాజన్న మాట్లాడుతూ.. నాడు నిరుపేదలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పరిటాల రవితో కలసి భూస్వామ్య పోరాటాలు చేశామన్నారు. అయితే రవి మరణించిన తర్వాత... రాజకీయాల్లోకి వచ్చిన అతని భార్య సునీతమ్మ తమ ఆశయాలను పక్కన పెట్టి కుటుంబ రాజకీయాలకు తెరలేపిందన్నారు. సునీత పాలనలో వారి కుటుంబ సభ్యులకు తప్ప... ఈ ప్రాంతంలోని బడుగు, బలహీన వర్గాల్లోని పేదలకు న్యాయం జరగడం లేదన్నారు.  వీటితో పాటు సీఎం చంద్రబాబు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడన్నారు.   ‘ఇక ఆమెతో వేగలేం.. అందరమూ కలిసి వెళ్లిపోదాం’ అంటూ పిలుపునిచ్చారు.  పేదల పక్షాన పనిచేసే నాయకులు, పార్టీలకు మద్దతు ఇవ్వాలని ఆలోచిస్తున్నామన్నారు. 

వైఎస్సార్‌సీపీలో చేరేందుకు రంగం సిద్ధం
సమావేశం ముగిసిన తర్వాత విలేకరులతో  రాజన్న మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో  ఏ వర్గానికీ న్యాయం జరగలేదనీ, అందువల్లే  పేదలకు అండగా నిలిచిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పక్షాన నిలిచేందుకు తన అనుచరుల కోరిక మేరకు త్వరలో∙వైఎస్సార్‌సీపీలోకి చేరబోతున్నట్లు ప్రకటించారు. పార్టీ నాయకులు గంగంపల్లి నారాయణరెడ్డి, ముత్యాలు, కనగానపల్లి ములుగురు గోపాల్, రమేష్, కోనాపురం ఆదినారాయణ, తల్లిమడుగుల జయరాంలు, శ్రీనివాస్, రమేష్, ముత్తువకుంట్ల గోపాల్‌తోపాటు వందలాది మంది అనుచరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top