ఆ'పరేషన్‌' టీడీపీ

Testament On Ration Dealers - Sakshi

డీలర్లపై మరో పిడుగు నెలకో నిబంధనతో ఇబ్బంది

కమీషన్లలోనూ సర్కారు కక్కుర్తి

దుకాణం ఆలస్యంగా తెరిస్తే జరిమానా

రూ.500 విధించేందుకు చర్యలు

ఏలూరు (మెట్రో): రేషన్‌ డీలర్లపై మరో పిడుగు పడింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజుకో నిబంధనతో ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న టీడీపీ సర్కారు తాజాగా  షాపు ఆలస్యంగా తెరిస్తే జరిమానా విధిచేందుకు సిద్ధపడింది. దీంతో రేషన్‌ డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

తొలి నుంచీ అంతే..
తెలుగుదేశం ప్రభుత్వం తొలి నుంచీ రేషన్‌ డీలర్లపై కక్ష కట్టినట్టు కనిపిస్తోంది. సరుకుల పంపిణీలో పారదర్శకత అంటూ ఆన్‌లైన్‌ విధానం, ఈ–పోస్‌ యంత్రాలు ప్రవేశపెట్టి అటు డీలర్లను, ఇటు లబ్ధిదారులను అవస్థల పాల్జేసింది.  ఆ తర్వాత రేషన్‌ తీసుకోని వారి ఇళ్లకు వెళ్లి సరుకులు ఇవ్వాలనే నిబంధనతో వేధించారు. వేలిముద్ర పడకపోతే వీఆర్‌ఓ వేలిముద్ర ద్వారా సరుకులు సరఫరా చేయాలని నిబంధన పెట్టారు. వీటిన్నింటితో డీలర్లు తీవ్ర అవస్థలు పడ్డారు. అయినా మింగలేక, కక్కలేక అన్న తీరుగా షాపులను నడిపిస్తున్నారు.

కమీషనూ అంతంతమాత్రమే!
ఇంత కష్టపడుతున్నా.. రేషన్‌ డీలర్లకు వచ్చే కమీషన్‌ అంతంతమాత్రమే.  గతంలో రేషన్‌ షాపుల ద్వారా కందిపప్పు, బెల్లం, చింతపండు, మంచినూనె వంటివి అందించేవారు. అయితే ప్రస్తుత సర్కారు కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేస్తోంది. ఒక్కోనెల పంచదార ఇస్తోంది. ఇక నూనె, పప్పులు, బెల్లం వంటి వాటి గురించి ఎప్పుడో మరిచిపోయింది. దీంతో కమీషన్‌ అంతగా రాని పరిస్థితి నెలకొంది. 

తాజాగా రూ.500 జరిమానా
తాజాగా రేషన్‌ షాపుల్లో సమయపాలన పాటించకున్నా, షాపులు తెరవకున్నా రోజుకు రూ.500 జరిమానా విధిస్తామని సర్కారు హెచ్చరిస్తోంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ దుకాణాలు తెరిచి ఉంచాలని, ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ సరుకులు పంపిణీ చేయాలని, దుకాణాలు తెరుస్తున్నదీ, లేనిదీ ఈ పోస్‌ యంత్రాల ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు అవుతుందని వేధిస్తోంది. ఈపీడీఎస్‌ విధానంలో ప్రతి రోజూ ఎన్ని సరుకులు ఇస్తున్నదీ, ఎంత మంది కార్డుదారులు సరుకులు తీసుకున్నదీ, వసూలు చేసిన మొత్తం ఎంతో తెలిసిపోతుంది.  దీంతో దుకాణం తెరవకుంటే ఆటోమేటిక్‌గా రూ.500 జరిమానా పడుతుంది. ఈ మొత్తాన్ని మినహాయించుకుని నెలవారీ కమీషన్‌ చెల్లించనున్నారు. ఇలా నాలుగుసార్లు జరిమానా పడితే రేషన్‌ దుకాణాన్నే రద్దు చేయాలని సర్కారు ఆదేశాలు చేయడంపై డీలర్లు మండిపడుతున్నారు.

నాలుగుసార్లు జరిగితే షాపు రద్దు
మొదటిసారి ఆలస్యం అయినా, షాపు తెరవకున్నా రూ.500 జరిమానా విధిస్తారు. రెండోసారి ఆలస్యమైతే రూ.1,000 జరిమానా, మూడోసారి రూ.1,500 జరిమానా, నాలుగోసారి రూ.2,000 జరిమానా విధిస్తారు. ఇక ఐదోసారి జరిమానా విధించకుండా షాపును రద్దు చేయాలని ఆదేశాలు అందాయి.– సయ్యద్‌ యాసిన్, జిల్లా పౌరసరఫరాల అధికారి

దుకాణాలునిర్వహించలేకపోతున్నాం
నెలకో నిబంధన పెడుతూ ప్రభుత్వం రేషన్‌ డీలర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. రేషన్‌ షాపులు కాకుండా సూపర్‌మార్కెట్లు అని చెప్పారు. రోజుకో నిత్యావసర వస్తువును తొలగించుకుంటూ వస్తున్నారు. రోజుకో నిబంధన పెడుతున్నారు. తాజాగా దుకాణాన్ని ఏమాత్రం ఆలస్యంగా తెరచినా రూ.500 జరిమానా విధించడం ఎంతవరకూ సమంజసం.– రాణి, రేషన్‌ డీలరు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top