రాజీలేని పోరుకు చిరునామా | Sakshi
Sakshi News home page

రాజీలేని పోరుకు చిరునామా

Published Wed, Feb 14 2018 8:48 AM

people support to ys jagan on special status for ap - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ‘ప్రత్యేక హోదా మన హక్కు–ప్యాకేజీతో మోసపోవద్దు’అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహోద్యమానికి సిద్ధమవుతోంది. రాష్ట్ర శ్రేయస్సు కోసం నాలుగేళ్లుగా అలుపెరగని పోరు సాగిస్తున్న ప్రధాన ప్రతిపక్షం ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. ప్యాకేజీ పేరిట కపట నాటకమాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించేందుకు పూనుకుంటోంది. నాలుగేళ్లుగా మౌనంగా ఉన్న టీడీపీ పెద్దలు నాలుగు రోజుల పాటు పార్లమెంటులో ఆడిన నాటకంపై ఇప్పటికే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హోదా సాధనే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే దిశగా ఏప్రిల్‌ 6న తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ నెల 8న వామపక్షాలతో వైఎస్సార్‌ సీపీ తలపెట్టిన బంద్‌కు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష మద్దతు లభించింది. అదే రీతిలో ఎంపీల రాజీనామా ప్రకటనతో అధికార టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్ర కేబినెట్‌లో కొనసాగుతున్న మంత్రులు, ఎంపీలు రాజీనామా చేయకుండా ఒత్తిడి చేయడం వల్ల ప్రయోజనం ఉండదన్న భావన టీడీపీలో సైతం వ్యక్తమవుతోంది.

నాలుగేళ్లుగా ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. ఇదిగో.. అదిగో.. అంటూ రెండేళ్ల పాటు ఊరించిన పాలకవర్గాలు చివరకు చేతులెత్తేశాయి. ఐదు కోట్ల మంది ఆంధ్రులు హోదా కావాలని ఘోషిస్తుంటే.. ప్యాకేజీ ముద్దు అంటూ టీడీపీ పెద్దలు ప్రకటనలు చేయడాన్ని అంతా జీర్ణించుకోలేకపోయారు. దీంతో హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎప్పుడు ఏ పిలుపు ఇచ్చినా స్వచ్ఛందంగా విశాఖవాసులు ముందుండి కదం తొక్కారు. ప్రస్తుతం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మార్చి 1న జిల్లా కేంద్రంలో మహాధర్నాను విజయవంతం చేసేందుకు పార్టీ జిల్లా శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. మరో వైపు మార్చి 5న జంతర్‌మంతర్‌ వద్ద తలపెట్టిన మహాధర్నాకు కూడా తరలి వెళ్తామని ప్రతినబూనుతున్నారు.

ఇక నాటకాలు కట్టిపెట్టాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా నాటకాలు కట్టిపెట్టాలి. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి. హోదా ఒక్కటే ఏపీకి సంజీవిని. అది లేకపోతే రాష్ట్రం అధోగతే. హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీయే. విభజన నాటి నుంచి నేటి వరకు హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ధర్నాలు.. బంద్‌లు చేసి హోదా కోసం పోరాడుతోంది. మా పార్టీ ఎంపీల రాజీనామాలతో టీడీపీ, బీజేపీ ప్రజాప్రతినిధులపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. కచ్చితంగా వాళ్లు కూడా రాజీనామా చేసి హోదా కోసం పోరాడాలి.   – మళ్ల విజయప్రసాద్, మాజీ ఎమ్మెల్యే,విశాఖ నగర అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ

హోదా కోసం అలుపెరగని పోరు
ప్రత్యేక హోదాపై నమ్మకద్రోహం చేయడమే కాకుండా.. పార్లమెంటు సాక్షిగా రెండు పార్టీలు కపట నాటకమాడుతున్నాయి. హోదా కోసం కడవరకు పోరాడతాం. ఇందు కోసం మా పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని మా అధినేత ఎప్పుడో ప్రకటించారు. ఏప్రిల్‌ 6న చేసి తీరుతారు. హోదా ఇవ్వకపోతే కాంగ్రెస్‌కు పట్టిన గతే టీడీపీ, బీజేపీలకు పడుతుంది.
– గుడివాడ అమర్‌నాథ్, వైఎస్సార్‌సీపీఅనకాపల్లి పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు    

చంద్రబాబువి సన్నాయి నొక్కులు
ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తామని మా అధినేత జగన్‌ ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఆఖరి ప్రయత్నంలో ఇందుకు వెనుకాడం. ఇప్పటికే అలుపెరుగని పోరాటం సాగిస్తూనే ఉన్నాం. ఐదు బడ్జెట్‌లు చూశారు. నెల రోజుల పాటు అల్టిమేటం ఇచ్చి ఏప్రిల్‌ 6న రాజీనామా చేస్తారని ప్రకటించారు. చంద్రబాబు మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. హోదా కోసం ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఇప్పుడు కొత్త నాటకమాడుతున్నాడు. – తైనాల విజయకుమార్, విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ

సరైన సమయంలో ఎంపీలు రాజీనామా నిర్ణయం
వైఎస్సార్‌ సీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్‌ చేసిన ప్రకటనను వామపక్షాలు స్వాగతిస్తున్నాయి. బలమైన నిరసన తెలియజేయడం ఇదొక మార్గం. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు దోహదం చేస్తుంది. ఏపీ ప్రజల కోరిక.. విభజన చట్టంలో కూడా ఉంది. వామపక్షాలు చేపట్టిన బంద్‌లో కూడా హోదా డిమాండ్‌ కీలకం. హోదా ఇచ్చి తీరాల్సిందే. రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేయాలి. హోదా కోసం వారు చేపట్టే ఆందోళనలకు  మా మద్దతు ఉంటుంది. – సీహెచ్‌ నరసింగరావు,సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు

Advertisement
Advertisement