రాష్ట్రంలో అవినీతి పెచ్చరిల్లుతోంది

MLA Adimulapu Suresh Criticize On TDP Government Prakasam - Sakshi

యర్రగొండపాలెం (ప్రకాశం): రాష్ట్రంలో అవినీతి పెచ్చరిల్లుతోందని, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైఎపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ విమర్శించారు. సోమవారం స్థానిక మోడల్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఎమ్మెల్యే మాట్లాడారు. కళాశాల భవన నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఒక తరగతి గదిలో అడ్డంగా పరదాలు కట్టుకొని రెండు తరగతులు నిర్వహిస్తున్నారని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కేవలం లంచం ఇవ్వడం లేదని కాంట్రాక్టర్‌కు సకాలంలో డబ్బులు చెల్లించకుండా ప్రభుత్వ పెద్దలు జాప్యం చేస్తున్నారని వివరించారు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్‌ను మార్చాలనే ఆలోచనతో ఉన్నట్లు తమకు తెలిసిందని విద్యార్థులు పేర్కొన్నారు. కమీషన్ల కోసం తమ జీవితాలను నాశనం చేస్తున్నారని, గత 15 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వెంటనే భవనాల నిర్మాణం చేపట్టకపోతే జిల్లా కేంద్రానికి వెళ్లి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆందోళన చేపట్టినప్పటికీ సమస్యలు సర్కారు చెవికి ఎక్కవని, విద్యార్థులు చేసే కార్యక్రమాల్లో తమ పార్టీ పాలుపంచుకుంటుందన్నారు. 2008లో మార్కాపురం ఎమ్మెల్యే కె.పి.కొండారెడ్డి ఈ ప్రాంత సమస్యలను సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారన్నారు. యర్రగొండపాలెం ప్రాంతంలో విద్యాభివృద్ధికి డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని కోరడంతో స్పందించిన వైఎస్సార్‌ మోడల్‌ డిగ్రీ కళశాలను మంజూరు చేశారని గుర్తు చేశారు.

ఆ తరువాత తాను కళాశాల భవనాల నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకున్నానన్నారు. తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవిధంగా తాను కృషి చేస్తానని చెప్పారు. ముందుగా జూనియర్‌ కళాశాల భవనంలో నిర్వహిస్తున్న మోడల్‌ డిగ్రీ కళాశాల తరగతి గదులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఏపీ ఎంహెచ్‌ఐడీసీ ఎండీతో ఫోన్‌లో కళాశాల భవనాల నిర్మాణం గురించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు దొంతా కిరణ్‌గౌడ్, ఎస్‌కే జబీవుల్లా, యవజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కె.ఓబులరెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎన్‌.వెంకటరెడ్డి, కో ఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడు ఎ.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top