నచ్చకపోతే నాకు ఓటెయ్యకండి

KTR Slms Congress Leaders In Siricilla - Sakshi

సమర్థులకే పట్టం కట్టండి: కేటీఆర్‌

మరోసారి అవకాశమిస్తే ఇంతకు పదింతలు అభివృద్ధి చేసి చూపిస్తా

టీఆర్‌ఎస్‌ లేకుంటే 300 ఏళ్లయినా తెలంగాణ వచ్చేదా?

ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి పీసీసీ పదవి కేసీఆర్‌ భిక్షే..

రమణకు తన సీటే దిక్కులేదు.. ఇరవై సీట్లు తెస్తాడా?

సిరిసిల్లకు రైల్వేలైను, ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటుకు హామీ

సాక్షి, సిరిసిల్ల: నియోజకవర్గ ప్రజలకు తాను నచ్చకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయవద్దని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకంటే విపక్షాల అభ్యర్థులు సమర్థులని విశ్వసిస్తే వారికే ఓటు వేయాలని కోరారు. పేదోళ్ల ముఖంలో ఇంకా చిరునవ్వులు కనిపించాలంటే తనకు మరోసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని, ఇంతకు పదింతలు అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. 2009 ఎన్నికల్లో తొలిసారి సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయగా 171 ఓట్ల మెజార్టీ తో బయటపడ్డానని, ఇప్పుడు కార్యకర్తలు లక్ష మెజార్టీని అందిస్తామంటుంటే పదేళ్లలో జరిగిన మార్పు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

దీనికంతటికీ కారణం కేసీఆర్‌ ఇచ్చిన ఆత్మ విశ్వాసమేనని పేర్కొన్నారు. అరవై ఏళ్ల దుష్టపాలనను మరిపించేలా తమ నాలుగేళ్ల పాలన కొనసాగిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఒకప్పుడు సిరిసిల్ల అంటే ఉరిసిల్లగా చెప్పుకునేవారని.. ఇప్పుడు నేత కార్మికులు నెలకు రూ.20 వేలు సంపాదించే స్థితికి చేరుకున్నారని వివరించారు. తాను నేత కుటుంబంలో పుట్టకపోయినా వారితో సమానంగా నేతన్నలపై అవగాహన పెంచుకున్నానని చెప్పారు. కొన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేద్దామంటే ఖాళీ లేని పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. సిరిసిల్లకు రైల్వే లైను తీసుకువస్తానని, రాష్ట్రస్థాయి ఇంజనీరింగ్‌ కళాశాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.  

మోదీకంత సీన్‌ లేదు.. 
ఇక మీదట ప్రధాని మోదీకంత సీన్‌ ఉండదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇన్నిరోజులు గడిచినట్లుగా ఇక మీదట సాగవని స్పష్టం చేశారు. 15మంది ఎంపీలను గెల్చుకుంటే అందరూ మన వెంటే ఉంటారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్‌ఎస్‌ పాత్ర ఏమీలేదని కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ అన్నారని.. టీఆర్‌ఎస్, కేసీఆర్‌ అనే మూడు అక్షరాలు లేకుంటే ఇంకా 300 ఏళ్లయినా తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను గద్దె దించాలనే లక్ష్యంతోనే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తిరుగుతున్నారని, ఆయనకు ఆ పదవి రావడం కూడా కేసీఆర్‌ పెట్టిన భిక్షేనని వ్యాఖ్యానించారు. ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్‌ నేతలు అడ్డగోలుగా హామీలిస్తున్నారని, ఆరు రాష్ట్రాల బడ్జెట్‌ కేటాయించినా వారి హామీలు నెరవేరవన్నారు.

టీటీడీపీ అధ్యక్షుడు రమణకు తన సీటే దిక్కులేదని, ఇంకా ఇరవై సీట్లు తెస్తానంటున్నాడని ఎద్దేవా చేశారు. కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పాలనతో ప్రతీ కార్యకర్త గర్వంగా ఫీలవుతున్నారన్నారు. ఏ మాత్రం అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అమలుపర్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రతిపక్ష పార్టీగా కూడా అర్హత లేని విధంగా కాంగ్రెస్‌ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌ టీఆర్‌ఎస్‌ నేతలు బస్వరాజు సారయ్య  తదితరులు పాల్గొన్నారు. 

కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకోండి 
కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మల్లుగారి నర్సగౌడ్‌ తన ఆవేదనను వెలిబుచ్చారు. తాము కోరుకున్న విధంగా పాలన సాగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకోవాలని, కేటీఆర్‌ స్థానికంగా తమకు అందుబాటులో ఉండటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నర్సగౌడ్‌ను పిలుచుకుని కేటీఆర్‌ సర్ది చెప్పారు.

సమావేశానికి కొన్ని నిమిషాల ముందు..

సమావేశానికి కె.తారకరామారావు చేరుకోవడానికి కొద్ది నిమిషాల ముందే చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ అక్కడ దర్శనమిచ్చారు. కేటీఆర్‌కు ఎదురుపడి తన సీటు విషయమై గోడు వెళ్లబోసుకున్నారు. తర్వాత మాట్లాడుతానని కేటీఆర్‌ ఆమెకు నచ్చజెప్పి పంపించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 105 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించి, చొప్పదండి సీటును సస్పెన్స్‌లో ఉంచిన విషయం తెలిసిందే.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top