తెలంగాణ ‘కల్వకుంట్ల’ ఇల్లు కాదు | Konda surekha fired on kcr family | Sakshi
Sakshi News home page

తెలంగాణ ‘కల్వకుంట్ల’ ఇల్లు కాదు

Sep 9 2018 2:05 AM | Updated on Sep 9 2018 2:05 AM

Konda surekha fired on kcr family  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కల్వకుంట్ల వారి ఇల్లు కాదని... అలా మార్చాలనుకుంటే ప్రజలు ఊరుకోరని కేసీఆర్‌ కుటుంబంపై మాజీ మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ నుంచి తమను పొమ్మనలేక పొగబెడుతున్నారని, మంత్రి కేటీఆరే తనకు ఎమ్మెల్యే టికెట్‌ ఆపారని ఆరోపించారు. 105 మంది అభ్యర్థులతో టీఆర్‌ఎస్‌ ప్రకటించిన ఎన్నికల జాబితాలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన పేరు లేకపోవడం ఆవేదన కలిగించిందన్నారు. దీని పై టీఆర్‌ఎస్‌ రెండు రోజుల్లో సమాధానం చెప్పాలని లేకుంటే బహిరంగ లేఖ రాసి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. తన భర్త, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావుతో కలసి కొండా సురేఖ శనివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బీసీ మహిళను ఇలా అవమానిస్తారా?
‘గత ఎన్నికల్లో 55 వేల మెజారిటీతో గెలిచిన నన్ను టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాలో ప్రకటించకపోవడం బాధ కలిగించింది. బీసీ మహిళనైన నన్ను ఇలా పక్కనపెట్టి పార్టీ నన్ను అవమానపరిచింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మొత్తం 12 స్థానాల్లో 11 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించి నా పేరు ప్రకటించకపోవడానికి కారణం చెప్పాలని టీఆర్‌ఎస్‌ను అడుగుతున్నా. గత ఎన్నికల్లో పరకాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటే టీఆర్‌ఎస్‌ పదేపదే మాకు వర్తమానాలు పంపి మాతో సంప్రదింపులు జరిపింది.

పరకాల సీటు ఇస్తేనే వస్తామని చెప్పినా మీరు తప్పితే బస్వరాజు సారయ్యను ఎవరూ ఓడించలేరని చెప్పి కేసీఆర్‌ మా మీద ఒత్తిడి తెచ్చి వరంగల్‌ తూర్పు నుంచి నిలబడాలన్నారు. నాకు మంత్రి పదవి, కొండా మురళీకి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక జిల్లాలో జరిగిన వివిధ ఎన్నికల్లో సొంత డబ్బుతోనే ప్రచారం చేశాం. కేసీఆర్‌ సూచన మేరకు వరంగల్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి టీఆర్‌ఎస్‌కు వచ్చేందుకు కాంగ్రెస్‌ క్యాంపులోని ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులను మురళి తీసుకొచ్చారు.

క్రమశిక్షణగల కార్యకర్తలుగా పార్టీ అభివృద్ధి కోసమే పని చేశాం. ఒక్క మహిళకూ మంత్రి పదవి ఇవ్వని ప్రభుత్వంగా టీఆర్‌ఎస్‌ సర్కారు చరిత్రలో నిలిచిపోయింది. బీసీలను ముఖ్యంగా తెలంగాణ మహిళలను అవమానపరిచారు. మహిళలు లేకుండా తెలంగాణ వచ్చిందా? మహిళల పోరాటంతోనే ఉద్యమం ఉధృతమైంది. మహిళలకు అన్యాయం చేయడం ఎంతవరకు సబబు. ఆరుగురు మహిళా ఎమ్మెల్యేల్లో ఎస్సీ, బీసీ మహిళలం అయిన బొడిగె శోభ, నాది ఆపారు. బాబూమోహన్, నల్లాల ఓదెల వంటి ఎస్సీలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీఆర్‌ఎస్‌పై ఉంది’అని కొండా సురేఖ డిమాండ్‌ చేశారు.

అందరి సర్వే రిపోర్టులు బయట పెట్టాలి...
గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సారయ్యను, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పని చేసిన సుధారాణిని, తమకు వ్యతిరేకంగా ఉండే ఎర్రబెల్లి దయాకర్‌రావును టీఆర్‌ఎస్‌లోకి తీసుకునేటప్పుడు పార్టీ చెప్పలేదని కొండా సురేఖ ఆరోపించారు. తాము పార్టీ గుర్తుపై గెలిచామని, కానీ టీడీపీ నుంచి వచ్చిన ఎర్రబెల్లి ఎందుకు తీపి అయ్యాడని ప్రశ్నించారు. టికె ట్లు ఇచ్చిన అందరి సర్వే రిపోర్టులను బహిర్గతం చేయాలని, 105 మంది అభ్యర్థులకూ పార్టీ తరపున బీఫామ్‌ ఇస్తామని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

నేనే పోటీ చేస్తానని చెప్పినా...
రెండు సీట్లు అడిగినందుకే తన పేరు ప్రకటించలేదని టీఆర్‌ఎస్‌ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని కొండా సురేఖ విమర్శించారు. రెండు రోజుల ముందు కేటీఆర్‌ తనకు ఫోన్‌ చేశారని, పరకాల, భూపాలపల్లి, వరంగల్‌ తూర్పు సీట్లను ఆశిస్తున్న తమకు భూపాలపల్లి సీటు కుదరని సీఎం చెప్పమన్నారని కొండా సురేఖ వివరించారు. ‘మీరు నిలబడతారా? మీ పాప నిలబడతారా’అని కేటీఆర్‌ అడగ్గా తానే పోటీ చేస్తానని క్యాంపు ఆసీసుకు వెళ్లి సంతోష్‌కు చెప్పడంతోపాటు అక్కడి నుంచే కేటీఆర్‌కు వాట్సాప్‌ చేశానన్నారు.

కానీ ఈ రోజు తననే బదనాం చేస్తున్నారని, రెండు అడిగి ఒక్కటీ తీసుకోలేదని చెబుతున్నారని ఆరోపించారు. తాము ఏమి చేస్తున్నామో, ఎక్కడ ఉన్నామో తెలుసుకునేందుకు ఫోన్లు టాప్‌ చేయడం, ఇంటెలిజెన్స్‌ నివేదికలు తెప్పించుకోవడం వంటివి చేశారని విమర్శించారు. తాము పార్టీ నుంచి వెళ్లాలనుకుంటే బహిరంగంగా లేఖ రాసి కారణాలు చెప్పి నిర్ణయం తీసుకుంటామన్నారు.


కేటీఆర్‌ కోటరీ తయారు చేసుకుంటున్నారు...
టీఆర్‌ఎస్‌ జాబితా వచ్చాక కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌లకు ఫోన్లు చేస్తే ఎత్తలేదని కొండా సురేఖ చెప్పుకొచ్చారు. హరీశ్‌రావుకు తాము పార్టీ లోకి రావడం ఇష్టంలేకున్నా అన్ని విధాలుగా అం డగా నిలిచారని, కానీ పార్టీలోకి తమను తీసుకుకొచ్చిన కేసీఆర్‌ మాత్రం తమ వెంట ఎప్పుడూ లేరన్నారు.

నియోజకవర్గంలో తమకు వ్యతిరేకంగా కేటీఆర్‌ పది మందిని తయారు చేశారని, తమకు టికెట్‌ రాకుండా చేసింది ఆయనేనని ఆరోపిం చారు. ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి మాత్రం ఎమ్మెల్యే టికెట్లు ఖరారు చేసి ఒక కోటరీని తయారు చేసుకుంటున్నారని సురేఖ దుయ్యబట్టారు. మళ్లీ అధికారంలోకి వస్తే వారిని మంత్రులను చేసుకుని తెలంగాణను ఆగం చేసుకునేందుకు టీమ్‌ను తయారు చేసుకుంటున్నారని మండిపడ్డారు. తాము స్వత్రంగానైనా పోటీ చేస్తామని, రెండు చోట్ల, అవసరమైతే మూడు చోట్ల పోటీ చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement