బావ వ్యూహాలతో ఒంటరైన హరికృష్ణ 

Harikrishna was alone with chandrababu Strategies - Sakshi

     ఆయన ఆవేశాన్ని, అమాయకత్వాన్ని వాడుకున్న చంద్రబాబు 

     లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా హరికృష్ణను రెచ్చగొట్టిన వైనం 

     వెన్నుపోటు సమయంలో పార్టీ అధ్యక్ష, మంత్రి పదవుల ఆఫర్‌ 

     పార్టీ హస్తగతం తర్వాత అధ్యక్ష పదవి ఇచ్చేందుకు నిరాకరణ 

     మంత్రి పదవి కూడా మూన్నాళ్ల ముచ్చటే.. 

     బాలకృష్ణకు హిందూపూర్‌ టికెట్‌తో సోదరుల మధ్య విభేదాలు 

కొమ్మినేని శ్రీనివాసరావు– హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన నందమూరి హరికృష్ణ జీవితంలో ఆవేశపరుడిగా గుర్తింపు పొందారు. దీని కారణంగా కొంత నష్టానికి గురికావాల్సి వచ్చింది. ఆ ఆవేశంలోనే తన బావ చంద్రబాబు పన్నిన యుక్తుల్లో చిక్కుకుని విలవిలలాడారు. కొన్నిసార్లు దానిని ఆయన బహిర్గతం కూడా చేశారు. మరికొన్నిసార్లు మౌనంగానే భరించారు. దివంగత నేత ఎన్‌.టి.రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు రాజకీయాల్లో హరికృష్ణ క్రియాశీలకంగా లేరు. ఎన్టీఆర్‌ రాష్ట్రవ్యాప్త పర్యటనకు ఉపయోగించిన చైతన్య రథం డ్రైవర్‌గానే ఉండటానికి ఇష్టపడ్డారు. నిజానికి ఆ రోజుల్లో తండ్రితో పాటే హరికృష్ణ రాజకీయాల్లోకి వచ్చి ఉంటే తెలుగుదేశం పార్టీ చరిత్ర మరోలా ఉండేది. అలాగే తన వారసుడు బాలకృష్ణ అని 1986లో ఎన్టీఆర్‌ ప్రకటించిన తర్వాత చంద్రబాబు వ్యూహాత్మకంగా దానిని ఆయనతోనే విరమింప చేశారు. ఎన్టీఆర్‌కు స్వాభావిక వారసులుగా హరికృష్ణ, బాలకృష్ణ రాజకీయాలపై శ్రద్ధ చూపకపోవడం చంద్రబాబుకు కలిసి వచ్చింది. అదే సమయంలో వీరిని తన చేతిలో పెట్టుకోవడంలో కూడా బాబు సక్సెస్‌ అయ్యారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా అప్పట్లో చంద్రబాబు ప్రచారం చేసేవారు.  

ఎన్టీఆర్‌ రెండో వివాహంతో విభేదాలు... 
ఎన్టీఆర్‌ 1993లో లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవడంతో కుటుంబంలో ఒక చిన్న సైజు తుపాను ఏర్పడింది. దీంతో రాజకీయంగా టీడీపీకి నష్టం వస్తుందని చంద్రబాబు, మరికొందరు భయపడ్డారు. కాని ప్రజలు మరో రకంగా చూశారు. ధైర్యంగా ఎన్టీఆర్‌ పెళ్లి చేసుకోవడం తప్పు కాదని భావించారు. కాని ఆ తర్వాత పరిణామాల్లో లక్ష్మీపార్వతి వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. ఎన్టీఆర్‌ పరువును కాపాడాల్సిన చంద్రబాబు వర్గమే ఆయనను తమకు అండగా ఉండే మీడియా ద్వారా ఉన్నవి.. లేనివి.. ప్రచారం చేయించి అప్రతిష్టపాలు చేశారు.  

హరికృష్ణను రెచ్చగొట్టిన చంద్రబాబు... 
అదే సమయంలో ఆవేశపరుడైన హరికృష్ణను కూడా తండ్రికి వ్యతిరేకంగా చంద్రబాబు రెచ్చగొట్టారు. లక్ష్మీపార్వతిని వ్యతిరేకిస్తున్నట్లుగా హరికృష్ణ రాష్ట్రంలో పలు చోట్ల పర్యటించేలా చేశారు. అయితే రాజకీయంగా తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఎన్టీఆర్‌ ఊహించలేకపోయారు. చంద్రబాబు, లక్ష్మీపార్వతి వర్గాలు గొడవపడి.. తన వద్దకు పంచాయితీకి వస్తారనుకున్నారు కానీ తన కాళ్లకిందకు నీళ్లు తెస్తారని అనుకోలేకపోయారు. ఆ క్రమంలో లక్ష్మీపార్వతికి ఎన్టీఆర్‌ ప్రాధాన్యత ఇస్తున్నారన్న ప్రచారం విస్తృతంగా చేసేవారు. ఆమెకు వారసత్వంగా ముఖ్యమంత్రి పదవి కూడా కట్టబెడతారన్నంతగా వార్తలు వ్యాపింపజేశారు. ఆ దశలో చంద్రబాబు తన అనుయాయులతో కలసి వ్యూహాత్మకంగా పావులు కదిపారు. లక్ష్మీపార్వతిని దుష్ట శక్తిగా, ఆమె చేతిలో ఎన్టీఆర్‌ చిక్కినట్లుగా బాబు వర్గం ప్రచారం చేసేది. లక్ష్మీపార్వతి తమ కుటుంబంలో ప్రవేశించడం ఇష్టం లేని ఇతర కుటుంబ సభ్యులు కూడా దానిని నమ్మినట్లు చెబుతారు. దీనికి తోడు ఆస్తుల వ్యవహారాలు కూడా ఉంటాయి.  

టీడీపీ అధ్యక్ష పదవి, మంత్రి పదవి ఆఫర్‌... 
ఆ దశలో హరికృష్ణతో చంద్రబాబు మంతనాలు జరిపి టీడీపీ అధ్యక్ష పదవి, మంత్రి పదవి ఇచ్చేలా ఆఫర్‌ ఇచ్చారన్న ప్రచారం జరిగింది. తండ్రి నుంచి హరికృష్ణను, ఇతర కుటుంబ సభ్యులను దూరం చేసి చంద్రబాబు తనవైపు తిప్పుకోవడంలో సఫలం అయ్యారు. అదే తరుణంలో మరో తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును కూడా తనవైపు ఆకట్టుకోగలిగారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పారు. ఎన్టీఆర్‌ మరో కుమారుడు బాలకృష్ణ ఆ రోజుల్లో తండ్రి వద్ద కనిపించినా, బాబుతోనూ సత్సంబంధాలు కొనసాగించారు. ఆ రకంగా ఎన్టీఆర్‌ కుటుంబం అంతా తన వెంటే ఉందని పార్టీ వారిని కూడా బాబు నమ్మించగలిగారు. దీంతో ఎన్టీఆర్‌ చివరి రోజుల్లో అందరూ ఉన్నా ఒంటరివాడిగా కుమిలిపోవలసి వచ్చింది. ఇదంతా చంద్రబాబు నమ్మక ద్రోహమని, తన కుమారులనూ బాబు వలలో వేసుకున్నారని ఎన్టీఆర్‌ బాధపడేవారు.  

హరికృష్ణకు అధ్యక్ష పదవి ఇవ్వని బాబు... 
ఏమైతేనేం ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేసి బాబు అధికార పగ్గాలు చేపట్టగలిగారు. అది వెన్నుపోటు అనండి.. కుట్ర అనండి.. మెజార్టీ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్నారు. అప్పటికే చంద్రబాబు సహా ఐదుగురిని పార్టీ నుంచి తొలగించినట్లు ఎన్టీఆర్‌ ప్రకటించి, మంత్రి పదవుల నుంచి తీసివేసినట్లు ఆదేశాలు ఇచ్చారు. అయినా నాటి గవర్నర్‌ కృష్ణకాంత్, ప్రధాని పీవీ నరసింహారావు బాబుకే మద్దతు ఇవ్వడంతోనే ఇది సాధ్యమైందన్నది పలువురి అభిప్రాయం. ఆ తర్వాత మరో కథ ఆరంభం అయింది. జరిగిన ప్రచారం ప్రకారం పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వకపోయినా, హరికృష్ణకు మంత్రి పదవి ఇచ్చారు. దగ్గుబాటికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా మొదటే మోసం చేశారు. దీంతో దగ్గుబాటి తాను తప్పు చేశానని తెలుసుకుని చంద్రబాబు దగ్గర నుంచి బయటకు వచ్చారు. కానీ, అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. హరికృష్ణ ఆరు నెలల పాటు మంత్రిగా ఉన్నారు. ఈలోగా నిబంధనల ప్రకారం ఆయన అసెంబ్లీకి ఎన్నిక కావల్సి ఉన్నా ఆయనకు ఆ అవకాశం రాలేదు. 1995, ఆగస్టు చివర్లో పదవి కోల్పోయిన ఎన్టీఆర్‌.. ఆ బాధతోనే 1996, జనవరిలో మరణించారు.  

టీడీపీలోకి వచ్చినా పార్టీ విధానాలపై విమర్శలు
2004 నాటికి చంద్రబాబు అధికారాన్ని కోల్పోయి కాంగ్రెస్‌ నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు మళ్లీ ఎన్టీఆర్‌ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనబడాలని చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే హరికృష్ణను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చారు. 2008లో రాజ్యసభ సీటు ఇచ్చి ఎన్టీఆర్‌ కుటుంబం తనతోనే ఉందన్న అభిప్రాయం కలిగించి ప్రజల్లో సానుభూతి పొందాలని బాబు భావించాడని చాలా మంది అభిప్రాయం. అయినా ఆయా సందర్భాల్లో హరికృష్ణ టీడీపీ అనుసరిస్తున్న విధానాలను విమర్శించేవారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇస్తే, హరికృష్ణ సమైక్య రాష్ట్రం కోరుతూ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. బాబు నాయకత్వం పట్ల ఆయనకున్న అసమ్మతికి ఇది పెద్ద ఉదాహరణ. ఆ తర్వాత తన కుమారుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ను 2009 ఎన్నికల్లో చంద్రబాబు వాడుకుని వదలేశారన్న బాధ కూడా ఆయనకు ఉంది.  

గెలిచినా హరికృష్ణకు రాని మంత్రి పదవి... 
ఎన్టీఆర్‌ మరణంతో ఖాళీ అయిన హిందూపూర్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడానికి కొంత సమయం పట్టింది. దీంతో హరికృష్ణ మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ తర్వాత కొద్ది కాలానికి హిందూపూర్‌ ఉప ఎన్నిక జరిగి హరికృష్ణ గెలిచారు. ఆ వెంటనే ఆయనకు మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ చంద్రబాబు వ్యూహాత్మకంగా హరికృష్ణను పక్కన పెట్టేశారు. దీంతో తీవ్ర అవమాన భారానికి గురైన హరికృష్ణ కొంతకాలం ఓపిక పట్టి, 1999 ఎన్నికల ముందు సొంతంగా అన్నా టీడీపీ అనే పేరుతో సొంతంగా పార్టీని ఏర్పాటు చేశారు. అప్పట్లో చంద్రబాబు నమ్మక ద్రోహంపై హరికృష్ణ తీవ్ర విమర్శలు చేసేవారు. కానీ నాటి పరిస్థితులు ఆయనకు కలసి రాలేదు. కార్గిల్‌ యుద్ధం నేపథ్యం, వాజ్‌పేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయిన సానుభూతి ఉపయోగపడి బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాగలిగారు. ఓటమి తర్వాత హరికృష్ణ రాజకీయంగా వెనుకబడ్డారు.

పార్టీలో తగ్గిన ప్రాధాన్యతతో బాధ... 
ఇటీవలి కాలంలో తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిందన్న బాధ కూడా హరికృష్ణకు ఉండి ఉండవచ్చు. అందువల్లే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గించారని చెప్పాలి. అదే సమయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా హరికృష్ణను పక్కనబెట్టి ఆయన సోదరుడు బాలకృష్ణకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు. బాలకృష్ణ కుమార్తెను కోడలిగా చేసుకోవడం, ఆయనకు హిందూపూర్‌ టికెట్‌ ఇవ్వడంతో అన్నదమ్ముల మధ్య కూడా ఒక రకంగా సంబంధాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్న భావన ఉంది. స్థూలంగా చూస్తే హరికృష్ణ ఆవేశాన్ని, రాజకీయ అమాయకత్వాన్ని చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాలకు పూర్తిగా వాడుకోగలిగారు. హరికృష్ణ తన అమాయకత్వంతో రాజకీయంగా ఎంతో నష్టపోయారు. కాంగ్రెస్‌లో ఓడిపోయిన తర్వాత టీడీపీలోకి వచ్చిన చంద్రబాబు తన మామ ఎన్టీఆర్‌ ద్వారా అధికార అందలం ఎక్కి ఆయనకే ఎసరు పెట్టగలిగారు. అలాగే హరికృష్ణను కూడా కరివేపాకు మాదిరి వాడుకుని వదలేశారు. ఎన్టీఆర్‌కు రాజకీయ వారసుడిగా ఎదగవలసిన హరికృష్ణ ఒంటరిగా మిగిలిపోవడం చారిత్రక విషాదం.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top