కాంగ్రెస్‌కు మాజీ మంత్రి ఝలక్‌!

Congress Leader Sudarshan Reddy Resignations - Sakshi

పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి తప్పుకోవడంతో కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద షాక్‌ ఇచ్చినట్లయింది. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని అభ్యర్థి గెలుపు కోసం పనిచేసే బాధ్యతను కాంగ్రెస్‌ అధిష్టానం ఇన్‌చార్జులకు అప్పగించింది. ఈ నేపథ్యంలో సుదర్శన్‌ రెడ్డితో అభ్యర్థి మధుయాష్కి, అసెంబ్లీ ఇన్‌చార్జులు గత అర్ధరాత్రి వరకు సమాలోచనలు జరిపారు. అయితే శనివారం తెల్లవారుజామునే సుదర్శన్‌ రెడ్డి ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. మరోవైపు టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకు పోతున్నారు.

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆ పార్టీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్‌ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పగా, తాజాగా నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం ఎన్నికల ఇన్‌చార్జిగా ఉన్న మాజీ మంత్రి పి సుదర్శన్‌రెడ్డి ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు అధిష్టానానికి లేఖ పంపినట్లు శనివారం ఆయన ప్రకటించారు. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని అభ్యర్థి గెలుపు కోసం పనిచేసే బాధ్యతను అధిష్టానం ఈ ఇన్‌చార్జులకు అప్పగించింది.

పార్లమెంట్‌ స్థానం పరిధిలోని ప్రచార బాధ్యతలను ఇన్‌చార్జి పర్యవేక్షించాల్సి ఉంటుంది. అలాగే అగ్రనేత ప్రచార సభల నిర్వహణ వంటి బాధ్యతలనూ ఇన్‌చార్జికి పార్టీ అప్పగించింది. ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక్కో సీనియర్‌ నేతను ని యమిస్తూ కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సందర్భంగా ఈ ఇన్‌చార్జులను ప్రకటించింది. అయితే ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తయింది. మరోవైపు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సభలు, సమావేశాలు, రోడ్‌షోలు, పార్టీలో చేరికలు ఇలా ప్రతి ఓటరును కలిసేలా ప్రణాళికాబద్ధంగా ప్రచారం కొనసాగిస్తున్నారు.

ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ అన్ని నియోజకవర్గాల్లో గ్రామ గ్రామాన్ని చుట్టి వచ్చేలా చేస్తున్నారు. ఇటు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ ప్రచారం కూడా ఊపందుకుంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూనే రోడ్‌షోలతో ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. ఇటు కాంగ్రెస్‌లో మాత్రం ఈ స్థాయి ఊపు కనిపించడం లే దు. పార్టీ నాయకులను, శ్రేణులను సమన్వయం చేయడంలో కీలకమైన పార్టీ ఇన్‌చార్జి ఇప్పుడు బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది. ఇప్పటికే బోధన్‌కు చెందిన కాంగ్రెస్‌ కేడర్‌ దాదాపు అంతా టీ ఆర్‌ఎస్‌ పార్టీలో చేరింది. ఇటీవల గెలిచిన సర్పంచ్‌లు, ద్వితీయ శ్రేణి నాయకులు కూ డా ఈ ఎన్నికల సందర్భంగా గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో సు దర్శన్‌రెడ్డి పార్టీ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అర్ధరాత్రి వరకు సమాలోచనలు.. 
కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలు శుక్రవారం అర్ధరాత్రి వరకూ సమాలోచనలు జరిపారు. పార్టీ అభ్యర్థి మధుయాష్కిగౌడ్‌ రాత్రి 11 గంటల ప్రాంతంలో నగరంలోని కంఠేశ్వర్‌లోని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్‌రెడ్డి, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు తాహెర్‌బిన్‌ హందాన్, ఈరవత్రి అనీల్, ఆర్మూర్‌కు చెందిన ఒకరిద్దరు నేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. అభ్యర్థిత్వం ప్రకటించిన వెంటనే మధుయాష్కి హైదరాబాద్‌లో సుదర్శన్‌రెడ్డితో సమావేశమైన విషయం తెలిసిందే. తాజాగా గత అర్ధరాత్రి మరోసారి సమావేశమయ్యారు. శనివారం తెల్లవారుజామున తాను ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సుదర్శన్‌రెడ్డి ప్రకటించడం ఎన్నికల వేళ ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top