పవార్‌ వ్యాఖ్యలపై సేన ఫైర్‌

 Shiv Sena Says Sharad Pawars Politics Dangerous Disrupting Society Harmony - Sakshi

సాక్షి, ముంబై : ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌పై శివసేన విరుచుకుపడింది. పవార్‌ రాజకీయాలు మహారాష్ట్రకు ప్రమాదకరమని, సమాజంలో సామరస్యానికి ఇవి విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీమా కోరెగావ్‌ హింసపై జరుగుతున్న పోలీసు విచారణకు పవార్‌ వ్యాఖ్యలు అవరోధం కలిగించేలా ఉన్నాయని పేర్కొంది. ఈ ఘటనపై జరుగుతున్న విచారణను తప్పుదోవ పట్టించడం ద్వారా పవార్‌ ఎవరిని కాపాడాలని ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించింది. బీమా కోరెగావ్‌ అల్లర్లకు సంబంధించి ఇటీవల పూణే పోలీసులు ఐదుగురిని అరెస్ట్‌ చేయడంపై పవార్‌ స్పందిస్తూ ఘర్షణల వెనుక ఉన్న వారిని విడిచిపెట్టి, వాటితో ఏమాత్రం సంబంధం లేని వారిని అరెస్ట్‌ చేయడం అధికార దుర్వినియోగమేనని వ్యాఖ్యనించారు.

ఉత్తర్‌ ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో జరిగిన ఇటీవలి హింసాకాండను ప్రస్తావిస్తూ మహారాష్ట్రలోనూ మతపరంగా ప్రజల్లో చీలిక తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని శివసేన ఆందోళన వ్యక్తం చేసింది. శరద్‌ పవార్‌ రాజకీయాలు రాష్ట్రానికి ప్రమాదకరమని శివసేన తన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. బీమా కోరేగావ్‌ ఘటనపై విచారణను పక్కదారి పట్టించేందుకు శరద్‌ పవార్‌, భరిప బహుజన్‌ మహాసంఘ్‌ నేత ప్రకాష్‌ అంబేడ్కర్‌లు ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించింది.

పోలీసులు అరెస్ట్‌ చేసిన నిందితులకు బీమా కోరెగావ్‌ అల్లర్లతో సంబంధం లేదని పవార్‌ ఏ ప్రాతిపదికన చెబుతున్నారని నిలదీసింది. పోలీసులు అసలైన నిందితులను పట్టుకోలేదని చెప్పడం ద్వారా పవార్‌ ఎవరిని రక్షించదలుచుకున్నారని శివసేన ప్రశ్నించింది. టీవీ ఛానెళ్ల కెమేరాలకే పరిమితమవకుండా పవార్‌ ప్రజల్లోకి వచ్చి శాంతిసామరస్యాలు నెలకొనేలా చొరవ చూపాలని హితవు పలికింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top