మహిళా శకానికి స్వాగతం

మహిళా శకానికి స్వాగతం


కొత్త కోణం

ప్రతికూల పరిస్థితులు తమను వెనక్కు నెట్టలేవని మన అమ్మాయిలు ఒలింపిక్స్‌లో రుజువు చేశారు. సివిల్స్‌ టాపర్‌ టీనా, ఎవరెస్ట్‌ను అధిరోహించిన పూర్ణ సామాజిక అసమానత్వపు సంకెళ్లు తమ ప్రతిభను అడ్డుకోలేవని చాటారు.భారతదేశం నూతన శకం లోనికి అడుగిడుతోందా? అది మహిళల శకం కాబోతున్నదా?  బ్రెజిల్‌ నగరం రియోలో ముగి సిన ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభను కనపర్చిన మహిళలు ఒక్కరు కాదు, ముగ్గురు. ఆడ పుట్టుకను ఈసడిస్తున్న, కట్టు బొట్టు నుంచి నడవడిక వరకు మహిళను శాసిస్తున్న జాతే.. దేశ గౌరవాన్ని నిలిపారని ఆ ముగ్గురు ఆడపిల్లలను వేనోళ్ల కొనియాడుతున్నది. భారత్‌ నుంచి 117 మంది క్రీడాకారులు రియో ఒలింపిక్స్‌లో  పాల్గొంటే హైదరాబాదీ తెలుగమ్మాయి పి.వి. సింధు, హరియాణాకు చెందిన సాక్షి మాలిక్‌లు ఇద్దరి వల్లనే భారత్‌ పేరు పతకాల జాబితాలోకి ఎక్కింది. జిమ్నాస్టిక్స్‌లో ఒలింపిక్స్‌ పైనల్స్‌కు చేరడమే గాక నాలుగో స్థానంలో నిలిచిన దీపా కర్మాకర్‌ ఆడపిల్లే.  రియోలో భారత్‌ పరువును దక్కించిన ముగ్గురూ అమ్మా యిలే. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, భవిష్యత్‌ దర్పణం.క్రికెట్‌లోనూ, టెన్నిస్, బ్యాడ్మింటన్‌లనే రెండు అంతర్జాతీయ క్రీడలలోనూ తప్ప భారత్‌ పేరు ప్రపంచ క్రీడా రంగంలో వినిపించదు. ఎందరో క్రీడా నిపుణులు, క్రీడాకారులు ఎన్నోసార్లు ఈ దుస్థితికి కారణాలను విశ్లే షించి, పరిష్కారాలను సూచించారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసింది శూన్యం. క్రీడారంగంలోని మన వైఫల్యం లోపభూయిష్టమైన మన విద్యా విధానం వల్ల ఏర్పడిన అనర్థాలలో ఒకటని ఎన్నో అధ్యయనాలు గుర్తించాయి. ప్రపంచపటంలో భూతద్దం పెట్టి వెతికినా కనపడని చిన్న దేశాలు సైతం పతకాలను సొంతం చేసు కుంటుంటే  మన దేశం పేరును చివరి నుంచి వెతుక్కో వాల్సిన దుస్థితి.ఏకాగ్రత, సమయపాలన అమ్మాయిల సొత్తు

ఇటీవలి కాలంలో విద్యారంగంలో అమ్మాయిలు, అబ్బా యిలతో పోటీపడటమే కాక వారికంటే మెరుగైన ఫలి తాలను సాధిస్తున్న నేపథ్యం నుంచే భారత యువతుల ఒలింపిక్స్‌ విజయాలను చూడాలి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీ డియట్, ఎంసెట్‌ పరీక్షల్లో బాలికల హవా కొనసాగు తోంది. ఇది తెలుగు రాష్ట్రాల అనుభవమే కాదు. ఢిల్లీ, మహారాష్ట్ర, హరియాణాల్లో కూడా ఇదే కనిపిస్తున్నది. జాతీయ స్థాయిలోని సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పరీక్షల్లో కూడా బాలికలు తమ ప్రతిభను నిరూపించుకుంటు న్నారు. ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కో–ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌ మెంట్‌ (ఓఈసీడీ) అధ్యయనం సైతం దాదాపు ప్రతి ఏటా బాలికలే టాపర్లుగా నిలుస్తున్నారని తేల్చింది. ఆ సంస్థ ఇందుకు కారణాలను తెలుసుకోవడానికి పది హేనేళ్ల అమ్మాయిలను, అబ్బాయిలను పరిశీలించింది. బాలికలు ముందుండటానికి ముఖ్యమైన ఆరు కారణాలను ఆ అధ్యయనం వెల్లడించింది:1. పద్ధతి ప్రకారం చదువు సాగించడం, నిర్దిష్ట లక్ష్యాలను నిర్ణయించుకొని, వాటి సాధనకు శాయ శక్తులా ప్రయత్నించడం, 2. స్వయం క్రమశిక్షణను రూపొందించుకోవడం, 3. బాలుర కన్నా బాలికలకు చదివే అలవాటు ఎక్కువ, ఎక్కువ సమయం చదవడా నికే కేటాయిస్తారు. దీనివల్ల కొత్త విషయాలను తెలుసు కునే నేర్పుని సంపాదిస్తారు, 4. బాలురకన్నా బాలికలు హోంవర్క్‌ చేయడానికి ఎక్కువ సమయం కేటాయి స్తారు, 5. అబ్బాయిలు పాఠాలు వినడంలో అశ్రద్ధగా ఉంటారు. స్నేహితులతో ఇతర వ్యాపకాలకు ఎక్కువ అలవాటు పడుతుంటారు, 6. అమ్మాయిలు తమ ప్రాధా న్యతలను సరిగ్గా నిర్ణయించుకుంటారు. అబ్బాయిలు మాత్రం సమయపాలన పాటించక పరీక్షల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ అంశాలను నిశితంగా పరిశీలిస్తే, ఇది కేవలం చదువుకు మాత్రమే వర్తించదని స్పష్టం అవుతోంది. చదువు, క్రీడలు, ఉద్యోగం దేనికైనా ఏకాగ్రత అవసరం. అది అమ్మాయిలలోనే ఎక్కువని అర్థం అవుతోంది.అన్నీ ప్రతికూలతలే అయినా... .

భారత్‌లోలాగే మహిళలు, బాలికల పట్ల తీవ్ర వివక్ష అమలవుతున్న పాకిస్తాన్‌లో కూడా గత విద్యా సంవత్స రంలో పదవ తరగతి పరీక్షల్లో బాలికలే పై చేయి సాధించారు. అమెరికాలోని న్యూబ్రన్స్‌విక్‌ విశ్వవిద్యా లయం తమ దేశంతో సహా 30 దేశాల్లోని 10 లక్షల మంది విద్యార్థినీ, విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు. అమెరికన్‌ గ్రాడ్యుయేట్లలో ఎక్కువ శాతం అమ్మాయిలే నని ఆ అధ్యయనంలో తేలింది. మన దేశంలోనే కాదు, అభివృద్ధి చెందిన అమెరికాలాంటి దేశాల్లోని అధ్యయ నాలు కూడా అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకే క్రమ శిక్షణతో లక్ష్యాలను సాధించే శక్తిసామర్థ్యాలు ఎక్కువని స్పష్టం చేశాయి. అయితే అమెరికాలాంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో మహిళలు, బాలికల పట్ల సాంప్ర దాయాల పేరుతో అమలవుతున్న తిరోగమన భావ జాలం వల్ల మన అమ్మాయిలు ప్రతిభావంతులు కావ డానికి తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోందనేది వాస్తవం.వీటిలో మొదటిది స్త్రీపురుష సమానత్వ భావన కొరవడటం వల్ల ఆడవాళ్లు రెండవ శ్రేణి పౌరులనే  అభిప్రాయం బలంగా ఉండటం. ఒకవంక మగ పిల్లలకు అదనపు అవకాశాలను సమకూర్చే ధోరణి కనబడు తుంది. మరోవంక తిండి, బట్ట నుంచి విద్య, క్రీడల వరకు అన్ని విషయాల్లోనూ ఇంటా బయటా వివక్ష కొనసాగుతోంది. పైగా దీన్నే మన ఘనమైన సంస్కృ తిగా కొనియాడటం విచారకరం. ఈ పితృస్వామిక సంస్కృతి, దుస్సంప్రదాయాలు పేద మధ్య తరగతి కుటుంబాలను ప్రత్యేకించి ఎక్కువగా దెబ్బతీస్తున్నాయి. కూతుర్ని వసతులు, సౌకర్యాలు లేని ప్రభుత్వ పాఠశాల లకు, కొడుకును ఖరీదైన ప్రైవేట్‌ పాఠశాలలకు పంప డమూ, ఉద్యోగం పురుష లక్షణంగా, అమ్మాయిలకు పెళ్ళే పరమావధిగా భోదించడం వంటివి ఎన్నో.ఒకటేమిటి అడుగడుగునా ఇలా అమ్మాయిల పట్ల చూపుతున్న వివక్ష కారణంగా వారు అన్ని అవరోధా లను ఎదుర్కొంటూనే ఉన్నారు. కేవలం టాయ్‌లెట్స్‌ లేకనే ఆడపిల్లలు చదువుకు దూరమవుతున్న దుస్థితి. విద్యాలయాల్లో, ఆ దారుల్లో విద్యార్థినులపై సాగుతున్న వేధింపులు, హింస కారణంగా ఎందరో ఆడపిల్లలు చదువులు మానేసు కోవాల్సి వస్తోంది. ఇన్ని ప్రతికూ లతల మధ్య అమ్మాయిలు విద్యలోనూ, క్రీడలలోనూ మంచి ప్రతిభను కనబరుస్తుండటం ఆశించదగ్గ పరిణామం.  అవకాశాల నిరాకరణ వెనుకబాటుకు బాట  

ఇంకొక ముఖ్య విషయాన్ని ప్రస్తావించుకోవాలి. స్వత హాగానే మహిళలు ఎంతో శక్తిసామర్థ్యాలు కలవారు. సమాజంలో వారిపట్ల ఉన్న వివక్ష వల్ల వారికి అవ కాశాలు రావడం లేదు. ఎవరైనా ఏ రంగంలోనైనా రాణించాలంటే ఇతరులతో సమాన అవకాశాలు కల్పిం చడం తప్పనిసరి. అప్పుడే నిజమైన ప్రతిభ బయట పడుతుంది. స్త్రీలలాగే ఆదివాసులు, దళితుల పట్ల కూడా వివక్ష అమలవుతోంది. సరిగ్గా చెప్పాలంటే సమాజంలో ఉన్న అవకాశాలన్నీ పురుషాధిపత్య, కులాధిపత్య దృక్కోణం నుంచి కల్పించినవే. అయితే ఏ సామా

జిక వర్గానికి చెందినవారైనా స్త్రీలు అదనంగా జెండర్‌ వివక్షను ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఎస్సీ, ఎస్టీలనూ, మహిళలను కలిపితే దేశంలో మూడింట రెండు వంతులకు పైగా సమాన అవకాశాలకు దూర మయ్యారు.ఒలింపిక్స్‌లో కీలకమైన అథ్లెటిక్స్‌ పోటీల్లో మనం విజేతలకు దరిదాపుల్లో కూడా లేం. కొండలూ గుట్టలు అవలీలగా ఎక్కగలిగే ఆదివాసీ యువతీయువకులకు సరైన శిక్షణనిస్తే అథ్లెటిక్స్‌లోనూ మనం రాణించగలం. పతకాల కోసమనే కాదు మానవ శారీరక మానసిక వికాసం కోసం కూడా క్రీడల ఆవశ్యకతను పాలకులు గుర్తించాలి. కుటుంబం నుంచి, సమాజం నుంచి ఎదు రవుతున్న ప్రతికూల పరిస్థితులు తమను ఎంతో కాలం వెనక్కు నెట్టలేవని మన అమ్మాయిలు నేడు ఒలిం పిక్స్‌లో రుజువు చేశారు. అంతకు ముందు సివిల్స్‌ టాపర్‌గా నిలిచిన టీనా, అతి చిన్న వయస్సులోనే ఎవరెస్ట్‌ని అధిరోహించిన పూర్ణ అసమానత్వపు సంకెళ్లు తమ ప్రతిభకు అడ్డం కాజాలవని చాటారు. టీనా, పూర్ణలు దళిత, ఆదివాసీ బిడ్డలు. వీటిని రాబోయే మహిళా శకానికి సూచనలుగా చూడాలి. బాలికల, మహిళల శక్తి సామర్థ్యాల అణచివేతకు ముగింపు పలకడానికి, వారి శక్తియుక్తులకు పదును పెట్టడానికి సమాజం, కుటుంబం, ప్రభుత్వాలు సమైక్యంగా కృషి చేయడమే తక్షణ కర్తవ్యం.

వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు

మల్లెపల్లి లక్ష్మయ్య

మొబైల్‌ : 97055 66213

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top