‘మహా’ బంద్‌ హింసాత్మకం

Why tensions in Maharashtra represent a tussle between competing nationalisms - Sakshi

ముంబై సహా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన నిరసనలు

కోట్ల రూపాయల ఆస్తినష్టం..స్తంభించిన జనజీవనం

బంద్‌ ప్రశాంతం:ప్రకాశ్‌ అంబేడ్కర్‌  

ముంబై/పుణే: మహారాష్ట్రలో ‘భీమా–కోరేగావ్‌’ ఘటన తాలూకు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బుధవారం కూడా ముంబై, పుణే సహా మహారాష్ట్రలోని పలు సున్నిత ప్రాంతాల్లో పరిస్థితి మరింత హింసాత్మకంగా మారింది. ముంబైలో రోడ్డు, రైలు రవాణా వ్యవస్థతోపాటుగా జనజీవనం స్తంభించింది. హార్బర్‌ లైన్‌ సహా రెండుచోట్ల రాళ్లురువ్విన ఘటనలూ చోటుచేసుకున్నాయి. భీమా–కోరేగావ్‌ యుద్ధానికి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ వర్గం చేపట్టిన కార్యక్రమం హింసాత్మకంగా మారటంతో ఈ వివాదం మొదలైన సంగతి తెలిసిందే.

దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్పీఐ) బహుజన మహాసంఘ్, దళిత నేత ప్రకాశ్‌ అంబేడ్కర్‌ బుధవారం ఒక్కరోజు బంద్‌కు పిలుపునిచ్చారు. ముంబై, పుణేల్లో వందలమంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ఆందోళలు జరిగాయని ప్రకాశ్‌ అంబేడ్కర్‌ తెలిపారు. నవీ ముంబై, థానే, పుణే, ఔరంగా బాద్, నాందేడ్, పర్భణీ, వాషిం, అకోలా, సింధుదుర్గ్, రాయ్‌గఢ్, కోల్హాపూర్‌ ప్రాంతాల్లోనూ పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఉద్రిక్తతలకు కారకులైన వారిని వదిలిపెట్టబోమని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ స్పష్టం చేశారు. బాంబే హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరుపుతామన్నారు.  

స్తంభించిన ముంబై
చెంబూర్, ఘాట్కోపర్, కామ్‌రాజ్‌ నగర్, దిందోషి, కాందివలి, జోగేశ్వరి, కళానగర్, మాహిమ్‌లలో బంద్‌ ప్రభావం తీవ్రంగా కనిపించింది. హార్బర్‌ లైన్‌లోని గోవండీ, మార్‌ఖుర్ద, కుర్లా, నాలా సోపారా ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై నిరసనకారులు బైఠాయించారు. దీంతో ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్నినస్‌కి రావాల్సిన రైళ్లు శివారు స్టేçషన్లలోనే నిలిచిపోయాయి. ముంబైకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన డబ్బావాలాలు కూడా తమ సేవలను నిలిపివేశారు.  స్కూలు బస్సులు నడవకపోవటంతో బుధవారం కూడా పాఠశాలలు మూసే ఉంచారు.

పుణేలోనూ విధ్వంసం
పుణేలోనూ నిరసనకారులు బస్సులు, రైళ్లపై రాళ్లు రువ్వారు. రెండ్రోజులుగా పుణేలో జరుగుతున్న ఆందోళనల్లో 42 ఆర్టీసీ బస్సులు ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. ఇవి కాకుండా నగరంలో బంద్‌ ప్రశాంతంగానే జరిగిందన్నారు. కాగా, ‘భీమా–కోరేగావ్‌’ సంస్మరణ సంబరాలను వ్యతిరేకించిన సమస్త హిందూ అఘాడీ చీఫ్‌ మిలింద్‌ ఎక్‌బోటే ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన దళిత సంఘాల నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, డిసెంబర్‌ 31న పుణేలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ, జేఎన్‌యూ విద్యార్థి ఉమర్‌ ఖాలిద్‌లు విద్వేషపూరిత ప్రసంగం చేశారంటూ ఫిర్యాదు రావటంతో పుణే పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు.

                     వెస్ట్రన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలో ట్రాఫిక్‌ను అడ్డగిస్తున్న ఆందోళనకారులు 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top