లద్దాఖ్‌కు యుద్ధ విమానాలు 

Warplanes Reached To Ladakh By Indian Government - Sakshi

రంగంలోకి దింపిన భారత్‌

ఉత్తర సెక్టార్‌లోకి మరిన్ని మిగ్‌ విమానాలు

ఆర్మీ సైనిక స్థావరాలకు స్వదేశీ ‘భారత్‌’ డ్రోన్‌ తరలింపు

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌ లోని వాస్తవాధీన రేఖ వెంట గస్తీ నిర్వహించేందుకు భారతీయ నౌకాదళానికి చెందిన పొసీడాన్‌ 8ఐ జలాంతర్గామి విధ్వంసక యుద్ధ విమానాన్ని భారత్‌ రంగంలోకి దింపింది. చైనా దళాల కదలికను గమనించేందుకు దీన్ని ఉపయోగించనున్నారు. అలాగే, మరికొన్ని ఎంఐజీ –29కే జెట్‌ విమానాలను కూడా త్వరలో నార్తర్న్‌ సెక్టార్‌లోని పలు కీలక వైమానిక కేంద్రాలకు తరలించనుంది. వీటి మోహరింపుతో వైమానిక దళ సామర్థ్యం, గగనతల ఆధిపత్యం మరింత మెరుగుపడుతుందని సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ప్రస్తుతం నౌకాదళం వద్ద 40 ఎంఐజీ–29కే జెట్‌ విమానాలున్నాయి. ఇప్పటికే తూర్పు లద్దాఖ్, తదితర ప్రాంతాల్లోని కీలక ఎయిర్‌బేసెస్‌లో సుఖోయ్‌ 30 ఎంకేఐ, జాగ్వార్, మిరేజ్‌ 2000 యుద్ధ విమానాలను భారత్‌ సిద్ధంగా ఉంచింది.

ఆగస్ట్‌ చివరినాటికి ఐదు రఫేల్‌ ఫైటర్‌ జెట్స్‌ను కూడా లద్దాఖ్‌లో సిద్ధంగా ఉంచాలని భారత్‌ భావిస్తోంది. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో భారత నౌకాదళం, అమెరికా నేవీతో కలిసి అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మిలటరీ డ్రిల్స్‌ నిర్వహించింది. ఈ డ్రిల్స్‌లో పాల్గొన్న అమెరికాకు చెందిన యూఎస్‌ఎస్‌ నిమిజ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌక. మరోవైపు, డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీఓ) దేశీయంగా రూపొందించిన డ్రోన్‌ను త్వరలో తూర్పు లద్దాఖ్‌లోని ఆర్మీ బేస్‌లకు పంపించనున్నారు. ఈ డ్రోన్‌కు ‘భారత్‌’ అని డీఆర్‌డీఓ నామకరణం చేసింది. ఎత్తైన ప్రాంతాల్లో, కఠిన వాతావరణ పరిస్థితుల్లో ఇది గస్తీ విధులు నిర్వహించగలదని డీఆర్‌డీఓ పేర్కొంది.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top