గత 5-10 ఏళ్లలో ఎప్పుడూ ఎన్నికల్లో పోటీచేయని రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయాలని యోచిస్తున్నట్టు కేంద్ర ...
కోల్‌కతా: గత 5-10 ఏళ్లలో ఎప్పుడూ ఎన్నికల్లో పోటీచేయని రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయాలని యోచిస్తున్నట్టు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మ తెలిపారు. దేశంలో 1,600పైగా రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయని, వాటిలో 200 కన్నా తక్కువే ఎన్నికల్లో పాల్గొంటున్నాయన్నారు. శనివారం నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గత పదేళ్లలో ఎప్పుడూ పోటీ చేయని పార్టీల గుర్తింపును రద్దు చేయడానికి తాము ప్రయత్నిస్తున్నా, అమలు చేయలేకపోయామని, ప్రజాప్రతినిధులపై ప్రజలు ఒత్తిడి చేస్తే అది సాధ్యపడుతుందన్నారు. బోగస్ పార్టీలు పార్టీలు ప్రభుత్వం నుంచి ఆదాయపు పన్ను మినహాయింపుతోపాటు పలు ఇతర రాయితీలు పొందుతున్నాయని తెలిపారు.
భారత్ నంబర్ వన్: ఆధార్ నంబర్‌ను ఓటరు గుర్తింపు కార్డుతో అనుసంధానం చేయడంద్వారా ప్రపంచంలో మొట్టమొదటి బయోమెట్రిక్ డాటాతో కూడిన ఓటరు జాబితా గల దేశంగా భారత్ రికార్డు సృష్టించనుందని బ్రహ్మ తెలిపారు. ప్రస్తుతం ఆధార్‌తో అనుసంధాన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇది ఈ ఏడాదిలో పూర్తవుతుందని తెలిపారు. ఇది పూర్తయితే ఒక ఓటరు పేరు ఒక నియోజకవర్గంలో మాత్రమే ఉంటుందన్నారు. ఓటర్లు స్వచ్ఛందంగా తమ పేర్లు సరిచేసుకోవాలని, ఒకటికంటే ఎక్కువ నియోజకర్గాల్లో ఓటరుగా పేరుంటే అది నేరమవుతుందని చెప్పారు.