గర్భిణిని బైక్‌ మీదే మూడు ఆస్పత్రుల చుట్టు తిప్పిన వైనం

In Jharkhand Bleeding Pregnant Woman Taken to Hospital on A Bike - Sakshi

రాంచీ : స్థానిక ఎంపీ ఆ గ్రామాన్ని మోడల్‌ విలేజ్‌గా ఎంపిక చేశాడు. కానీ కనీస వసతలు కల్పించడం మర్చిపోయాడు. దాంతో ఆ గ్రామానికి చెందిన నిండు గర్భిణిని ప్రసవం నిమిత్తం బైక్‌ మీద ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఓ పక్క అప్పటికే ఆ మహిళ తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పి అపస్మారక స్థితిలోకి చేరుకుంది. మరో వైపు వైద్యులు ఇక్కడ కాదు అంటూ మూడు ఆస్పత్రులు చుట్టూ తిప్పారు. ఈ హృదయవిదారక సంఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

గ్రామానికి చెందిన శాంతిదేవి అనే మహిళకు నెలలు నిండాయి. దాంతో ఆమె భర్త చండ్వా పీహెచ్‌సీకి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ కోసం ప్రయత్నించడంతో పాటు 108 హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో వేరేదారి లేక బైక్‌పై అక్కడికి తరలించాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు లతేహర్‌ సదార్‌ ఆస్పత్రికి తీసుకెళ్లమని సూచించడంతో మళ్లీ బైక్‌ మీదనే తీసుకెళ్లారు. లతేహర్‌ వైద్యులు రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(రిమ్స్‌)కు శాంతిదేవిని తీసుకెళ్లమని చెప్పి, అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు. దాంతో కుటుంబసభ్యులు ఆమెను అంబులెన్స్‌లో తీసుకెళ్లి రిమ్స్‌లో చేర్పించారు. వైద్యుల తీరు పట్ల శాంతీ దేవి కుటుంబ సభ్యులే కాక సామాజిక కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై స్థానిక సీపీఎం నాయకుడు అయూబ్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ‘లతేహర్‌ డిప్యూటీ కమిషనర్‌ జోక్యం చేసుకున్నా ఆమెకు అంబులెన్స్‌ లభించలేదు. అనంతరం సదార్‌ ఆస్పత్రి వైద్యులు రక్తమార్పిడి చేసేందుకు నిరాకరించా’రని ఆరోపించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఓ గర్భిణీని వైద్యులు మంచి వైద్యం పేరు చెప్పి ఓ ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి అలా తిప్పడం సరైనది కాదని ఆయన తప్పుబట్టారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top