‘నిర్భయ’ దోషి ఆనాడు మైనర్‌ కాదు

Delhi HC adjourns Nirbhaya killer Pawan Gupta is hearing to Jan 24 - Sakshi

ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012 నాటి ‘నిర్భయ’ గ్యాంగ్‌రేప్, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురిలో ఒకరు ఆ ఏడాది తాను మైనర్‌నంటూ చేసుకున్న అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దోషి పవన్‌ కుమార్‌ గుప్తా తరఫున న్యాయవాది ఏపీ సింగ్‌ వాదించారు. ఘటన జరిగే నాటికి  పవన్‌ కుమార్‌ మైనర్‌ అని, దీనికి సంబంధించి మరిన్ని నివేదికలు సమర్పించేందుకు సమయం కావాలని కోర్టును కోరారు.

అందుకు జస్టిస్‌ సురేశ్‌ కుమార్‌ కైత్‌ అంగీకరించి కేసును జనవరి 24కు వాయిదా వేశారు. అయితే తర్వాత బాధితురాలి తల్లిదండ్రుల తరఫున వాదిస్తున్న లాయర్లు దీనిపై అభ్యంతరం లేవనెత్తారు. గతంలో ఇదే విషయంపై ట్రయల్‌కోర్టులో విచారణ జరిగిందని, ఘటన జరిగే నాటికి పవన్‌ కుమార్‌ మైనర్‌ కాదని తేలిందని వారు చెప్పారు. దీనిపై విచారించేందుకు లాయర్‌ ఏపీ సింగ్‌కు సమాచారం ఇచ్చినప్పటికీ ఆయన హాజరు కాలేదు. మధ్యాహ్నానికి వాయిదా వేసి, లాయర్‌కు సమాచారం ఇచ్చి వేచి చూసినప్పటికీ ఆయన స్పందించలేదు. దీంతో కోర్టు ఎదుట హాజరు కాకపోవడాన్ని తప్పుపడుతూ లాయర్‌కు రూ.25వేల జరిమానా విధించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top