‘నాలోని రచయిత మేల్కొంటాడు’
మద్రాసు హైకోర్టు తనకు బాసటగా నిలవటంపై తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ హర్షం వ్యక్తం చేశారు.
	కోర్టు తీర్పుపై వివాదాస్పద రచయిత పెరుమాళ్ హర్షం
	 
	 చెన్నై : మద్రాసు హైకోర్టు తనకు బాసటగా నిలవటంపై తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు తనలోని రచయితను మళ్లీ మేలుకొలుపుతుందని  ఓ ప్రకటనలో తెలిపారు. ‘భయంతో కుచించుకుపోయిన గుండెకు ఈ తీర్పు సాంత్వన కలిగించింది. నేను తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నా’ అని పేర్కొన్నారు. ఈయన రచించిన నవల మధోరుభాగన్ (ఇంగ్లీషులో వన్ పార్ట్ ఉమన్) హిందూమతానికి వ్యతిరేకంగా ఉందని కొందరు బెదిరించి క్షమాపణలు చెప్పించటంపై కోర్టు మండిపడింది. ఈ నవల ప్రతులు వెనక్కు తీసుకోవాలన్న  పిటిషన్‌ను కొట్టేసింది.
	
	రచయితగా పెరుమాళ్‌కు తన భావాలను వ్యక్తపరిచే హక్కుందని, ఇకపైనా ఎలాంటి భయమూ లేకుండాతన రచనలు కొనసాగించవచ్చని తెలిపింది. ‘ఇష్టం లేకపోతే పుస్తకం చదవకండి. అంతేకాని రాయటంలో రచయితకున్న హక్కును, భావ ప్రకటన స్వేచ్ఛను హరించకండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1)(ఏ) ప్రకారం దేశంలోని ప్రతి ఒక్కరూ తమ భావాలను వ్యక్త పరచొచ్చు’ అని పేర్కొంది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
