మోదీ ఫాలోవర్స్‌లో 60 శాతం ఫేక్‌!

60 Percent Of PM Modis Followers Are Fake - Sakshi

అన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ల్లో ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలో అయ్యే నాయకుడు ఎవరైనా ఉన్నారా? అంటే. అది మన దేశ ప్రధాని నరేంద్ర మోదీనే. ప్రధాని అయ్యాక నరేంద్ర మోదీకి సోషల్‌ మీడియాలో ఫాలోవర్స్‌ విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను వెనక్కి నెట్టేసి మరీ మోదీ మోస్ట్ ఫాలోడ్ వరల్డ్ లీడర్‌గా అవతరించారు. అయితే ఈ విషయంలో మోదీ తన ఫేక్‌ ఫాలోవర్స్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాలట. ఎందుకంటే ట్విటర్‌ ఆడిట్‌.కామ్‌, ట్విప్లోమసీ, అవుట్‌లుక్‌ ఇండియా సర్వే వెల్లడించిన ఫలితాల్లో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. నరేంద్రమోదీ ఫాలోవర్స్‌లో దాదాపు 60 శాతం మంది ఫేక్‌ ఫాలోవర్సేనని ఈ సంస్థల ఆడిట్స్‌ సర్వేలో తెలిసింది. మొత్తం మోదీకి 4 కోట్ల మంది ట్విటర్‌ ఫాలోవర్స్‌ ఉంటే, వారిలో 2.5 కోట్ల మంది ఫేక్‌ ఫాలోవర్సేనని ఈ సర్వే తెలిపింది. కేవలం 30 రోజుల్లోనే మోదీ ఫాలోవర్స్‌ 70 లక్షలు పెరిగిన సంగతి తెలిసిందే.

ఫేక్‌ ఫాలోవర్స్‌ జాబితాలో కేవలం మోదీ మాత్రమే కాక, డొనాల్డ్‌ ట్రంప్‌ వంటి ప్రపంచ నాయకులు కూడా ఉన్నారు. సంఖ్యాపరంగా చూసుకుంటే, మోదీ కంటే ముందు ఫేక్‌ ఫాలోవర్స్‌ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంపే ముందున్నట్టు తెలిసింది. ట్రంప్‌కు ట్విటర్‌లో 48.9 మిలియన్‌ మంది ఫాలోవర్స్‌ ఉంటే, వారిలో 37 శాతం మంది అంటే 18 మిలియన్‌ మంది ఫేక్‌ ఫాలోవర్స్‌ నేనని రిపోర్టు వెల్లడించింది. పోప్‌ ఫ్రాన్సిస్‌కు 59 శాతం మంది(17 మిలియన్‌ మంది‌) ఫేక్‌ ఫాలోవర్స్‌​ ఉన్నట్టు తెలిసింది. ప్రపంచ నాయకుల్లో అత్యంత తక్కువ నకిలీ ఫాలోవర్స్‌ ఉన్నది కింగ్‌ సల్మాన్‌కే. కింగ్‌ సల్మాన్‌కు 6.8 మిలియన్‌ మంది ట్విటర్‌ ఫాలోవర్స్‌ ఉంటే, వారిలో కేవలం 8 శాతం మంది మాత్రమే ఫేక్‌ అని సర్వే వెల్లడించింది.  ఫేక్‌ ఫాలోవర్స్‌లో ఇంటర్నెట్‌ బోట్స్‌ కూడా ఉన్నాయి. సాధారణ మనుషుల బదులు ఆటోమేటెడ్‌ అప్లికేషన్‌ ట్విటర్‌ అకౌంట్లను నిర్వహిస్తూ, ప్రపంచ నాయకులను ఫాలో అవుతూ ఉన్నాయి. 

మోదీ తర్వాత భారత్‌లో ఎక్కువగా ఫాలో అయ్యే నాయకుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. ఆయనకు కూడా 51 శాతం మంది ఫేక్‌ ఫాలోవర్స్‌ ఉన్నట్టు అవుట్‌లుక్‌ ఇండియా బహిర్గతం చేసింది. అయితే అత్యధికంగా ఫేక్‌ ఫాలోవర్స్‌ ఉన్నది కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకేనని తెలిపింది. 69 శాతం ఫేక్‌ ఫాలోవర్స్‌తో రాహుల్‌ అందరి కంటే ముందజలో ఉన్నట్టు అవుట్‌లుక్‌ సర్వేలో వెల్లడైంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top