అట్టుడుకుతున్న అస్సాం

3 Die in Guwahati as Police Fire on Protesters of Citizenship Bill Protests - Sakshi

‘పౌరసత్వ’ బిల్లుపై గువాహటిలో పెల్లుబికిన ఆగ్రహజ్వాలలు

పోలీసు కాల్పుల్లో ముగ్గురు మృతి?

పలు చోట్ల లాఠీచార్జి

ఇంటర్నెట్‌పై నిషేధం

రైళ్లు, విమాన సర్వీసులు బంద్‌

న్యూఢిల్లీ/గువాహటి: పార్లమెంట్‌ తాజాగా ఆమోదించిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అస్సాంలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గువాహటిలో యుద్ధ వాతావరణం కనిపించింది. కర్ఫ్యూను సైతం లెక్కచేయకుండా రోడ్ల దిగ్బంధం, గృహ దహనాలు, దుకాణాల లూటీకి పాల్పడుతుండటంతో పోలీసులు లాఠీచార్జి, కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు చెబుతుండగా ముగ్గురు మరణించారని ఆందోళనకారులు అంటున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గురువారం విద్యా, వాణిజ్య సంస్థలు పని చేయలేదు.

రవాణా వ్యవస్థ స్తంభించింది. అధికారులు ముందు జాగ్రత్తగా త్రిపుర, అసోంలకు రైలు సర్వీసులను రద్దు చేశారు. విమాన సర్వీసులను సైతం పలు ప్రాంతాలకు రద్దు చేశారు. సైనికులు ఫ్లాగ్‌ మార్చ్‌ చేపట్టారు. ఇంటర్నెట్‌ సేవలపై మరో 48 గంటలపాటు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో అస్సాం వాసులకు ప్రధాని మోదీ ట్విట్టర్‌ ద్వారా పలు హామీలిచ్చారు. ఇంటర్నెట్‌పై నిషేధం ఉండగా ట్విట్టర్‌లో హామీల విషయం ప్రజలకెలా తెలుస్తుందని కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది.

గువాహటి యుద్ధరంగం
రాష్ట్ర రాజధాని గువాహటిలోనే ఆందోళనల ప్రభావం ఎక్కువగా ఉంది. నగరంలో ఆందోళనకారులు భవనాలు, దుకాణాలకు నిప్పు పెట్టడం, ధ్వంసం చేయడం, రోడ్లపై టైర్లు కాల్చడం, అడ్డంకులు కల్పించడం, పోలీసులతో ఘర్షణలకు దిగారు. దీంతో పలుచోట్ల పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోయారని అధికారులు అంటున్నారు. అయితే, ముగ్గురు మృతి చెందారని ఆందోళన కారులు అంటున్నారు. గువాహటిలో పర్యటిస్తున్న అస్సాం పోలీస్‌ చీఫ్‌ భాస్కర్‌ జ్యోతి మహంత కాన్వాయ్‌పై కొందరు రాళ్లు విసిరారు.

ఈ ఘటనలో ఎటువంటి నష్టం వాటిల్లలేదు. ఎవరికీ ఎటువంటి అపాయం సంభవించలేదు. పోలీసు ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆసు(ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌) పిలుపు మేరకు గువాహటిలోని లతాశిల్‌ మైదానంలో సినీ, సంగీత పరిశ్రమకు చెందిన ప్రముఖులు సహా వందలాదిగా ప్రజలు, విద్యార్థులు హాజర య్యారు. ఆందోళనకారులు దిగ్బంధించడంతో వేలాది మంది ప్రయాణికులు గువాహటి విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. రహదారుల దిగ్బంధం కారణంగా దిబ్రూగఢ్‌ విమానాశ్రయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పౌరవిమానయాన శాఖ తెలిపింది.

డిబ్రూగఢ్‌లో ముఖ్యమంత్రి సోనోవాల్, ఎమ్మెల్యే బినోద్‌ హజారికా నివాసాలకు, వాహనా లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పోలీసు సర్కిల్‌ అధికారి కార్యాలయానికి కూడా నిప్పు పెట్టారు. కామ్‌రూప్‌ జిల్లాలో దుకాణాలు, విద్యా సంస్థలు, కార్యాలయాలు మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. 31వ నంబర్‌ జాతీయ రహదారిని దిగ్బంధించారు. జోర్హాత్‌ జిల్లాలో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. 39వ నంబర్‌ జాతీయరహదారిపై బైఠాయించిన వారిని చెదరగొట్టేందుకు గోలా ఘాట్‌  పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. రంగియాలో కూడా పోలీసు కాల్పులు జరిగాయి.

విమాన సర్వీసుల రద్దు
అస్సాంలో శాంతిభద్రతల నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసుకుంటున్నట్లు ఇండిగో, విస్తారా, ఎయిరిండియా, స్పైస్‌జెట్‌ ప్రకటించగా గో ఎయిర్, ఎయిర్‌ ఏషియా ఇండియా షెడ్యూల్‌ను మార్చుతున్నట్లు తెలిపాయి. ప్రభుత్వ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. జాతీయతను, దేశ సమగ్రతను దెబ్బతీసేవి, హింసను ప్రేరేపించే అంశాలను ప్రసారం చేయవద్దని శాటిలైట్‌ టీవీ చానెళ్లను కేంద్రం కోరింది.  

ఇంటర్నెట్‌పై నిషేధం కొనసాగింపు
సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాపించకుండా ప్రభుత్వం ఇంటర్నెట్‌ సర్వీసులపై మరో 48 గంటలపాటు నిషేధం పొడిగించింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చే చర్యల్లో భాగంగా ప్రభుత్వం గువాహటి పోలీస్‌ అదనపు కమిషనర్‌ దీపక్‌ కుమార్‌ను తొలగించి మున్నాప్రసాద్‌ గుప్తాను నియమించింది. అదేవిధంగా, అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) ముకేశ్‌ అగర్వాల్‌ను బదిలీ చేసి, ఆయన స్థానంలో జీపీ సింగ్‌కు బాధ్యతలు అప్పగించింది.

త్రిపుర,అస్సాంలకు రైళ్లు బంద్‌
ఆందోళనల దృష్ట్యా అస్సాం, త్రిపుర వైపు వెళ్లే  రైళ్లను రద్దు చేయడమో లేక కుదించడమో చేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఆందోళనల కారణంగా ప్రయాణికులు పలు ప్రాంతాల్లో చిక్కుకు పోయారని తెలిపింది. 12 కంపెనీల రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ను  తరలిస్తున్నట్లు వెల్లడించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top