breaking news
violence in assam
-
అట్టుడుకుతున్న అస్సాం
న్యూఢిల్లీ/గువాహటి: పార్లమెంట్ తాజాగా ఆమోదించిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అస్సాంలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గువాహటిలో యుద్ధ వాతావరణం కనిపించింది. కర్ఫ్యూను సైతం లెక్కచేయకుండా రోడ్ల దిగ్బంధం, గృహ దహనాలు, దుకాణాల లూటీకి పాల్పడుతుండటంతో పోలీసులు లాఠీచార్జి, కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు చెబుతుండగా ముగ్గురు మరణించారని ఆందోళనకారులు అంటున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గురువారం విద్యా, వాణిజ్య సంస్థలు పని చేయలేదు. రవాణా వ్యవస్థ స్తంభించింది. అధికారులు ముందు జాగ్రత్తగా త్రిపుర, అసోంలకు రైలు సర్వీసులను రద్దు చేశారు. విమాన సర్వీసులను సైతం పలు ప్రాంతాలకు రద్దు చేశారు. సైనికులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. ఇంటర్నెట్ సేవలపై మరో 48 గంటలపాటు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో అస్సాం వాసులకు ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా పలు హామీలిచ్చారు. ఇంటర్నెట్పై నిషేధం ఉండగా ట్విట్టర్లో హామీల విషయం ప్రజలకెలా తెలుస్తుందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. గువాహటి యుద్ధరంగం రాష్ట్ర రాజధాని గువాహటిలోనే ఆందోళనల ప్రభావం ఎక్కువగా ఉంది. నగరంలో ఆందోళనకారులు భవనాలు, దుకాణాలకు నిప్పు పెట్టడం, ధ్వంసం చేయడం, రోడ్లపై టైర్లు కాల్చడం, అడ్డంకులు కల్పించడం, పోలీసులతో ఘర్షణలకు దిగారు. దీంతో పలుచోట్ల పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోయారని అధికారులు అంటున్నారు. అయితే, ముగ్గురు మృతి చెందారని ఆందోళన కారులు అంటున్నారు. గువాహటిలో పర్యటిస్తున్న అస్సాం పోలీస్ చీఫ్ భాస్కర్ జ్యోతి మహంత కాన్వాయ్‌పై కొందరు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఎటువంటి నష్టం వాటిల్లలేదు. ఎవరికీ ఎటువంటి అపాయం సంభవించలేదు. పోలీసు ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆసు(ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్) పిలుపు మేరకు గువాహటిలోని లతాశిల్ మైదానంలో సినీ, సంగీత పరిశ్రమకు చెందిన ప్రముఖులు సహా వందలాదిగా ప్రజలు, విద్యార్థులు హాజర య్యారు. ఆందోళనకారులు దిగ్బంధించడంతో వేలాది మంది ప్రయాణికులు గువాహటి విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. రహదారుల దిగ్బంధం కారణంగా దిబ్రూగఢ్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పౌరవిమానయాన శాఖ తెలిపింది. డిబ్రూగఢ్‌లో ముఖ్యమంత్రి సోనోవాల్, ఎమ్మెల్యే బినోద్ హజారికా నివాసాలకు, వాహనా లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పోలీసు సర్కిల్ అధికారి కార్యాలయానికి కూడా నిప్పు పెట్టారు. కామ్రూప్ జిల్లాలో దుకాణాలు, విద్యా సంస్థలు, కార్యాలయాలు మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. 31వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. జోర్హాత్ జిల్లాలో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. 39వ నంబర్ జాతీయరహదారిపై బైఠాయించిన వారిని చెదరగొట్టేందుకు గోలా ఘాట్ పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. రంగియాలో కూడా పోలీసు కాల్పులు జరిగాయి. విమాన సర్వీసుల రద్దు అస్సాంలో శాంతిభద్రతల నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసుకుంటున్నట్లు ఇండిగో, విస్తారా, ఎయిరిండియా, స్పైస్‌జెట్ ప్రకటించగా గో ఎయిర్, ఎయిర్ ఏషియా ఇండియా షెడ్యూల్‌ను మార్చుతున్నట్లు తెలిపాయి. ప్రభుత్వ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. జాతీయతను, దేశ సమగ్రతను దెబ్బతీసేవి, హింసను ప్రేరేపించే అంశాలను ప్రసారం చేయవద్దని శాటిలైట్ టీవీ చానెళ్లను కేంద్రం కోరింది. ఇంటర్నెట్పై నిషేధం కొనసాగింపు సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాపించకుండా ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీసులపై మరో 48 గంటలపాటు నిషేధం పొడిగించింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చే చర్యల్లో భాగంగా ప్రభుత్వం గువాహటి పోలీస్ అదనపు కమిషనర్ దీపక్ కుమార్‌ను తొలగించి మున్నాప్రసాద్ గుప్తాను నియమించింది. అదేవిధంగా, అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) ముకేశ్ అగర్వాల్‌ను బదిలీ చేసి, ఆయన స్థానంలో జీపీ సింగ్‌కు బాధ్యతలు అప్పగించింది. త్రిపుర,అస్సాంలకు రైళ్లు బంద్ ఆందోళనల దృష్ట్యా అస్సాం, త్రిపుర వైపు వెళ్లే రైళ్లను రద్దు చేయడమో లేక కుదించడమో చేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఆందోళనల కారణంగా ప్రయాణికులు పలు ప్రాంతాల్లో చిక్కుకు పోయారని తెలిపింది. 12 కంపెనీల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను తరలిస్తున్నట్లు వెల్లడించింది. -
ఈశాన్య, పశ్చిమ రాష్ట్రాల్లో 'ప్రత్యేక' హింస
ఈశాన్య, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ప్రత్యేక హింస రగులుతూనే ఉంది. డిమాండ్ల సాధన కోసం ఆందోళనకారులు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. పశ్చిమబెంగాల్ నుంచి డార్జిలింగ్‌ను విభజించాలంటూ గూర్ఖా జనముక్తి మోర్చా శనివారం నుంచి ప్రారంభించిన నిరవధిక బంద్‌తో జనజీవనం స్తంభించింది. డార్జిలింగ్, కాలింపోంగ్, కుర్సియోంగ్‌లలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. రామమ్-రింబిక్ నిప్పన్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని ఆందోళనకారులు బలవంతంగా అడ్డుకున్నారు. మరోవైపు... అసోంలో ఆందోళనలు ఉద్ధృతరూపం దాలుస్తున్నాయి. దిపు-దోల్డోలి స్టేషన్ల మధ్య పట్టాలను తొలగించడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. పశ్చిమ కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ప్రత్యేక బోడోలాండ్ ఏర్పాటు చేయొద్దంటూ 27 బోడోయేతర సంఘాలు శనివారం 36 గంటల బంద్ మొదలుపెట్టాయి. దీంతో దిగువ అసోంలోని పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది.