మౌత్‌ టాక్‌ బాగుంది... ఫ్యామిలీ ఆడియన్స్‌ పెరిగారు

SPYder movie review by audience

‘‘హీరో మహేశ్‌గారు, దర్శకుడు మురుగదాస్‌గారితో పాటు మా టీమంతా ఏ సినిమాకీ పడనంత కష్టం ఈ ‘స్పైడర్‌’కి పడ్డాం. ప్రేక్షకులకు మంచి సందేశంతో పాటు కొత్త కథను, కొత్తదనంతో కూడిన సినిమాను ఇవ్వాలనుకున్నాం. కొత్తదనమంటే కొంత రిస్క్‌ తప్పదు. ఆ రిస్క్‌ తీసుకునే సినిమా చేశాం. ఫస్ట్‌ రెండు మూడు షోలకు కాస్త మిక్డ్స్‌ టాక్‌ వచ్చినా... మెజారిటీ ఆడియన్స్‌కి సినిమా నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ పెరిగారు’’ అన్నారు ‘ఠాగూర్‌’ మధు. మహేశ్‌బాబు హీరోగా ఆయన సమర్పణలో ఎన్వీ ప్రసాద్‌ నిర్మించిన ‘స్పైడర్‌’ బుధవారం విడుదలైంది. ప్రేక్షకుల నుంచి ‘స్పైడర్‌’కి మంచి స్పందన లభిస్తోందంటున్న ‘ఠాగూర్‌’ మధు చెప్పిన విశేషాలు...

► తమిళంలో మార్నింగ్‌ షో నుంచి హిట్‌ టాక్‌ వచ్చింది. బహుశా... అక్కడ కొంచెం అంచనాలు తక్కువ ఉండడం కారణమనుకుంటున్నా. కేరళలోనూ మంచి టాక్‌ వచ్చింది. ‘స్టార్‌ హీరో అయ్యిండి కథకు ఇంపార్టెన్స్‌ ఇచ్చి ఇటువంటి సినిమా చేయడం మహేశ్‌ గొప్పతనం’ అని రజనీకాంత్‌గారు అన్నారు. తెలుగులోనూ పలువురు ప్రముఖులు సినిమా బాగుందని చెప్పారు.

దర్శకుడు సురేందర్‌రెడ్డిగారు మొదటి రోజే రెండుసార్లు సినిమా చూశానన్నారు. ‘హీరో ఇమేజ్, స్టార్‌డమ్‌ పక్కన పెట్టినప్పుడు ఇటువంటి మంచి కథలొస్తాయి. సినిమా అద్భుతంగా ఉంది’ అని సురేందర్‌రెడ్డి అన్నారు. ప్రేక్షకులు చాలా క్లియర్‌గా ఉన్నారు. 90 శాతం మంచి మౌత్‌టాక్‌ను బట్టి వెళ్తున్నారు. మెజారిటీ ప్రేక్షకులు సినిమా బాగుందంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొలి రెండు రోజుల్లో 72 కోట్ల రూపాయలు (గ్రాస్‌) ‘స్పైడర్‌’ కలెక్ట్‌ చేసింది.

► తెలుగు సినిమా పరిధి పెరగాలన్నా, ఇతర భాషల ప్రేక్షకులను ఆకట్టుకోవాలన్నా... భారీ బడ్జెట్‌తో మంచి క్వాలిటీ సినిమాలు తీయక తప్పదు. కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. 20, 30 భాషల్లో తెలుగు సినిమాను విడుదల చేయగల కెపాసిటీ ఉంది. తెలుగు సినిమా మార్కెట్‌ పెంచాలనే ఉద్దేశంతోనే అరబిక్‌లోనూ ‘స్పైడర్‌’ను రిలీజ్‌ చేశాం. అక్కడ కూడా మంచి స్పందన వస్తోంది. ఆస్ట్రేలియాలో ప్రీమియర్‌ షో కలెక్షన్స్‌ బాగున్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top