వారిద్దరూ ప్రేమించుకున్నారు కానీ..  | Madonna Sebastian Talk About Valentines Day | Sakshi
Sakshi News home page

వారిద్దరూ ప్రేమించుకున్నారు కానీ.. 

Published Sun, Feb 16 2020 10:22 AM | Last Updated on Sun, Feb 16 2020 10:22 AM

Madonna Sebastian Talk About Valentines Day - Sakshi

సాక్షి, చెన్నై: అవును వారిద్దరూ ప్రేమించుకున్నారు కానీ అంటూ ఒక ప్రేమకథను ప్రేమికుల రోజున చెప్పింది నటి మడోనా సెబాస్టియన్‌. మలయాళ చిత్రం ప్రేమమ్‌ చిత్రం ద్వారా పరిచయం అయిన కథానాయికల్లో ఈ అమ్మడు ఒకరు. ఆ తరువాత తమిళంలో కవన్, పవర్‌పాండి, కాదలుమ్‌ కడందుపోగుం, జుంగా చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తెలుగులోనూ ప్రేమమ్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా విక్రమ్‌ప్రభు సరసన వానం కొట్టట్టుం చిత్రంలో నటించింది. అయితే ఈ జాణను బిజీ నటి అనలేం. నాలుగు భాషల్లో నటిస్తున్నా, మంచి సక్సెస్‌లు అందుకున్నా కెరీర్‌ చాలా స్లోగానే సాగుతోంది. స్టార్‌ ఇమేజ్‌ను కూడా అందుకోలేదు.  కాగా ప్రేమికులరోజు సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తన బాల్యంలో ప్రేమికుల రోజున జరిగిన ప్రేమకథను చెప్పుకొచ్చింది. అదేంటో చూద్దాం.

‘నేను పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో ప్రేమికుల రోజున జరిగిన సంఘటన నేను ఇప్పటికీ మరచిపోలేను. ప్రేమికుల రోజు అంటేనే ఆ సంఘటన గుర్తుకొచ్చి నవ్వుకుంటాను. నా సహ విద్యార్థి ఒకతను పక్క తరగతిలో చదువుకుంటున్న అమ్మాయిని ప్రేమించాడు. వారి ప్రేమ మాకందరికీ తెలిసింది. అయితే వారిద్దరూ మాత్రం తమ ప్రేమను ఒకరికొకరు వ్యక్తం చేసుకోలేకపోతున్నారు. దీంతో మేమంతా ప్రేమికులరోజున కలుసుకుని ప్రేమను వ్యక్తం చేసుకోవాలని వారికి నిబంధన విధించాం. అలా వారిద్దరూ కలిసేలా ప్లాన్‌ చేశాం. అందుకు వారు సంకోచంతోనే అంగీకరించారు. దీంతో ఆ ప్రేమజంటను ఒక హోటల్‌కు తీసుకెళ్లి ఏకాంతం కల్పించాం. అయినా ఇద్దరిలో ఎవరూ వారి ప్రేమను చెప్పలేకపోయారు. భోజనం చేశావా? ఏ సినిమా చూశావు? అంటూ ఏదోదే మాట్లాడుకున్నారు కానీ వారిలోని ప్రేమను చివరి వరకూ బయటకు చెప్పనేలేదు. దీంతో మేమంతా సహనం నశించి అక్కడ నుంచి వచ్చేశాం. ప్రేమికుల రోజు వచ్చిందంటే నాకు ఆ సంఘటనే గుర్తుకొచ్చి నవ్వొస్తుంది ’అని నటి మడోనా సెబాస్టియన్‌ చెప్పుకొచ్చింది. కాగా ఈ అమ్మడు ప్రస్తుతం శశికుమార్‌కు జంటగా కొంబు వచ్చ సింగం చిత్రంలో నటిస్తోంది. దీనితో పాటు కన్నడంలో కొటిగొబ్బ3 అనే చిత్రం చేస్తోంది. ఇదే అక్కడ మడోనాకు తొలి చిత్రం అన్నది గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement