చంద్రబాబు, కేసీఆర్‌లు చొరవ తీసుకోవాలి: కేతిరెడ్డి

Kethireddy Jagadishwar reddy Letter To KCR And Chandrababu - Sakshi

ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యలపై కమిటీ ఏర్పాటు చేయాలి

ఈ ప్రజా సమస్యను, దోపిడీని సీఎంలు అరికట్టాలి

లేఖలో తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

సాక్షి, చెన్నై: చిత్ర పరిశ్రమ సమస్యలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించి, పరిష్కారం కోసం ఓ కమిటీని నియమించాలని నిర్మాత, దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ని, ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబుని కమిటీ ఏర్పాటుకు లేఖ రాసినట్లు ఓ ప్రకటనలో కేతిరెడ్డి తెలిపారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్, నిర్మాతల మధ్య జరుగుతున్న వివాదం, ప్రస్తుతం సినిమా థియేటర్లను బంద్ చేయటం.. సినీ ప్రేమికులకు ఇబ్బందిగా మరిందన్నారు. కుటుంబ సభ్యులందరికి కేవలం సినిమా అనే వినోదం తప్పితే వేరే వినోదం లేదన్నారు. చిన్న సినిమాను బతికించుటకు మరో ఆటను జతచేస్తూ 5 ఆటలు ప్రదర్శించాలని, అదనపు షోకు ఎలాంటి టాక్స్ లేకుండా ఉండేలా జీవో తేవాలని విజ్ఞప్తి చేశారు.

చిన్న సినిమాను, చిన్న నిర్మాతలను బ్రతికించాలని, ఈ డిజిటల్ సర్వీసు ప్రొవైడర్స్ నిర్మాతలే మేము ఇచ్చే కంటెంట్ ద్వారా ప్రకటనలను అందులో చేర్చి కోట్లు సంపాదిస్తున్నారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రదర్శన కోసం నిర్మాతల వద్ద నిబంధనలకు విరుద్ధంగా అధిక రుసుం వసూలు చేస్తున్నారు. మా కంటెంట్ ప్రదర్శనకు డబ్బులే తీసుకోకుండా ఉండేలా చర్యలు చేపట్టాలి. ఒకప్పుడు యూఎఫ్‌ఓ(u.f.o) అని, క్యూబ్ (qube) అని వేరు వేరు సంస్థలని ఇప్పుడు రెండు సంస్థలు మోనోపాలి కొరకు నిర్మాతలను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వారిని నియంత్రించుటకు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ప్రభుత్వమే థియేటర్లకు వారి ప్రొజెక్టర్లు స్థానంలో ప్రొజెక్టర్లను సరఫరా చేసే ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌ల ద్వారా చేయుటకు చేయూత నివ్వాలి.

ప్రస్తుతం ఆన్ లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకుంటే రూ.15 అధికంగా తీసుకుంటున్నారు. ప్రభుత్వమే ఓ పోర్టల్‌ను ప్రారంభించి ప్రేక్షకులపై ఆదనపు భారం పడకుండా చూడాలి. అందులో కొంత భాగం నిర్మాతకు  ఇవ్వాలని, ఇప్పటికే సినిమా చూడాలంటే ప్రేక్షకుడు నిలువుదోపిడికి గురవుతున్నారు. తినుబండారాలు, తదితర విషయాల్లో దోపిడీ జరుగుతుంది కాబట్టి ఇది వ్యాపారం అనే కంటే ప్రజా సమస్య అని కూడా ఆలోచించి ప్రభుత్వం ఈ మాఫియాపై ఉక్కు పదం మోపి సగటు సినీ ప్రేక్షకులను, పరిశ్రమను కాపాడాలి. అందుకోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకొని వెంటనే సినిమా, ప్రేక్షకుల దోపిడీకి చరమగీతం పాడాలని కేతిరెడ్డి ఆ లేఖలో కోరారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top