అవును... ఇది భయపెట్టే సినిమానే!

అవును... ఇది భయపెట్టే సినిమానే!


 సినిమా రివ్యూ

చిత్రం: ఐస్‌క్రీమ్,

తారాగణం: తేజస్వి, నవదీప్, సంగీతం:

పద్యోతన్, కెమెరా: అంజి, నిర్మాత: తుమ్మలపల్లి

రామసత్యనారాయణ, దర్శకత్వం: రామ్‌గోపాల్ వర్మ
దర్శకుడు వర్మకూ, హారర్ చిత్రాలకూ తెగని బంధం. జనాన్ని కుర్చీ అంచులో కూర్చోబెట్టే చిత్రాలు తీయాలని ఆయనకు చాలాకాలంగా తపన. పదే పదే విఫలమవుతూ వచ్చినా, ఆ కోరిక ఆయన్ను వదల్లేదు. ఈసారైనా సక్సెస్ సాధించాలనుకుంటూ ఆయన చేసిన తాజా విఫల యత్నం ‘ఐస్‌క్రీమ్’.కథ ఏంటంటే...

రేణు (తేజస్వి) ఓ మెడికల్ స్టూడెంట్. ఆమె ప్రియుడు విశాల్ (నవదీప్). తల్లితండ్రులు పెళ్ళికి వెళ్ళడంతో లంకంత కొంపలో రేణు ఒంటరిగా ఉంటుంది. ఆ సమయంలో ఆమెకు ఎదురైన అనుభవాలేమిటి? ఆమె ప్రియుడు విశాల్ ఏం చేశాడు? ఏం జరిగిందన్నది ఈ ‘ఐస్‌క్రీమ్’.ఎలా ఉందంటే...

ఈ సినిమా పేరే విచిత్రం. కథానాయికకు ఐస్‌క్రీమ్ అంటే తెగ ఇష్టం. ఆమె తరచూ అది తింటూ కనిపిస్తుంటుంది. అందుకనో ఏమో ఈ సినిమాకు అదే పేరు పెట్టారు. కానీ, తీరా సినిమాలో, మరీ ముఖ్యంగా చిత్ర ప్రథమార్ధంలో హీరోయిన్ చేసేదల్లా పడుకోవడం, లేవడం, పై దుస్తులు, లోదుస్తులు మార్చుకోవడం, స్నానం చేయడమే! ద్వితీయార్ధంలోనూ దాదాపు ఇదే తంతు. హీరోయిన్ కలగంటోందా, అతీంద్రియ శక్తులేమైనా ఉన్నాయా - అన్నది అర్థం కాక జనం జుట్టు పీక్కుంటారు. హఠాత్తుగా వర్మ చేసిన ముగింపు, చూపిన కై్లమాక్స్ తొందరగా జీర్ణించుకోలేరు.హారర్ సినిమా అనగానే కెమేరా పనితనం, రీరికార్డింగ్ కీలకం. విచిత్రమైన కోణాల్లో కెమేరాను ఉంచి తీసిన మాట నిజమే కానీ, సినిమా అంతటా హీరోయిన్ నడుము కింది భాగాన్నే పదే పదే చూపించారు. ఒక దశలో హీరోయిన్ ముఖం నేరుగా తెర మీద కనిపించేది చాలా తక్కువనిపిస్తుంది. వెరసి, ఈ చిత్రీకరణతో దర్శకుడు మరేదో ఉద్దేశించినట్లు అనిపిస్తుంది.అలాగే, వర్మ మార్కు సంచలనమైన హీరోయిన్ నగ్న సన్నివేశ చిత్రీకరణ కూడా ఫక్తు పబ్లిసిటీ స్టంటేనని అర్థమవుతుంది. కిర్రుమనే తలుపు చప్పుళ్ళు, బాత్రూమ్ కుళాయి నుంచి బొట్లు బొట్లుగా నీళ్ళు పడే చప్పుడు, సన్నటి శబ్దంతో సుడులు తిరిగే గాలి లాంటి హారర్ సౌండ్ ఎఫెక్ట్‌లన్నీ ఉన్నా, నిర్దిష్టమైన కథ కానీ, బలమైన సన్నివేశాలు కానీ ‘ఐస్‌క్రీమ్’లో లేవు.వెండితెర దుస్సాహసం    

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో సమంత పక్కన మెరిసిన తేజస్వి నాయికగా ప్రమోటై, భయోద్విగ్నతలు బాగానే పలికించారు. ఆమెకు జంటగా నవదీప్ ఫరవాలేదనిపిస్తారు. సినిమా మొత్తం హీరో, హీరోయిన్, ఆమెకు దెయ్యంగా తారసపడే ముసలావిడే కనిపిస్తుంటారు. మరో మూడు పాత్రలు అలా వచ్చి, ఇలా వెళ్ళిపోతాయి. ఇన్ని తక్కువ పాత్రలతో, సినిమా తీయడం ఓ ప్రయోగం, సాహసమే. కానీ, తెలుగు సినిమా మార్కు పాటలేమీ లేకుండానే కాదు... కనీసం కథైనా లేకుండా సినిమా తీయడం వర్మ మాత్రమే చేయగల దుస్సాహసం. సినిమా అంతా ఓ పెద్ద ఇంట్లో కింద హాలు, పైన బెడ్‌రూమ్, బాత్‌రూమ్‌లోనే జరుగుతుంది. దాంతో, ఖర్చు కలిసొచ్చిందేమో కానీ, చూసిన పరిసరాలు, సన్నివేశాలే చూస్తున్నట్లనిపించి, కళ్ళతో పాటు బుర్రకూ అలసటనిపిస్తుంది. మొత్తానికి, అంచనాలతో వెళ్ళి, ఈ సినిమాను ధైర్యం చేసి గంటాము ప్పావు భరించగలిగితే చాలు... ఇక సినిమాలంటేనే ఎవరైనా భయపడడం ఖాయం. వర్మ అలా సక్సెసయ్యారు. వాణిజ్యపరంగా చూస్తే, ఈ వెండితెర కల జనం చూడక ముందే హాలులో నుంచి కరిగిపోయే ఐస్‌క్రీమ్. కొసమెరుపు: సినిమా చూసి మల్టీప్లెక్స్ నుంచి బయటకొస్తూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బృందం కాస్తంత బిగ్గరగానే, తమలో తాము అనుకుంటుండగా చెవినపడ్డ మాట -‘‘వర్మా! మాకు ఇదేం ఖర్మ!!’’బలాలు:  వర్మ ఇమేజ్  తొలిసారిగా ఫ్లోకామ్ టెక్నాలజీ వాడకం, నగ్నంగా నటించిన హీరోయిన్ లాంటి ప్రచారం

 తక్కువ నిడివి సినిమాబలహీనతలు:  యథార్థ ఘటన ఆధారంగా అల్లుకున్నామని వర్మ ప్రకటించిన అర్థం పర్థం లేని స్క్రిప్టు  విసుగెత్తించే టేకింగ్

 పస లేక నస పెట్టే స్క్రీన్‌ప్లే
- రెంటాల జయదేవ

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top