దానం చేసి మోసపోయాడు

Donated The Land But Getting Cheated  - Sakshi

ఉద్యోగం ఇస్తామంటే  భూదానం చేసిన వ్యక్తి

ఇవ్వలేమని చేతులెత్తేసిన అధికారులు

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలోని సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి 20 గుంటల భూమిని విరాళంగా ఇచ్చిన భూదాత మల్లెత్తుల కొమురయ్య తన కుమారుడు నాగరాజుకు ఉద్యోగావకాశం ఇస్తానని మోసం చేశారంటూ సబ్‌స్టేషన్‌కు తాళం వేశాడు. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా జరగని కారణంగా రాగినేడుతో పాటు పరిసర గ్రామాల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  దాదాపు ఏడాది కావస్తున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టిం చుకోకపోవడంతో సమస్య జఠిలమైంది. ఇప్పుడిప్పుడే ఎండల తీవ్రత పెరిగి భూగర్భజలాలు అడుగంటుతుండడంతో పంటలకు సాగునీరు కరువైంది.

ఉద్యోగం ఇవ్వాల్సిందే...
రాగినేడు గ్రామానికి మంజూరైన సబ్‌స్టేషన్‌కు అవసరమైన స్థలాన్ని ఇచ్చానని, తన కొడుకు నాగరాజుకు ఉద్యోగావకాశం కల్పించాల్సిందేనని మల్లెత్తుల కొమురయ్య డిమాండ్‌ చేస్తున్నారు. గ్రామానికి సబ్‌స్టేషన్‌ మంజూరు కావడంతో అధికారులు  చర్యలు చేపట్టినా అవసరమైన ప్రభుత్వం స్థలం అందుబాటులో లేకపోవడంతో నిర్మాణపు పనులు మొదలు కాలేదు.  గ్రామానికి చెందిన మల్లెత్తుల కొమురయ్య సబ్‌స్టేషన్‌ నిర్మా ణం చేసుకునేందుకు వీలుగా తన 20 గుంటల భూమిని విరాళంగా అందించారు. ఆ సమయంలో ప్రజాప్రతినిధులతో పాటు విద్యుత్‌శాఖ అధికారులు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ఆశ చూపారు. సబ్‌స్టేషన్‌ నిర్మాణం పూర్తయి విద్యుత్‌ సరఫరా సాగిస్తున్న అధికారులు ఉద్యోగం ఇవ్వకుండా జాప్యం చేస్తుండడాన్ని భూదాత కొముర్య పలుమార్లు ప్రశ్నించారు. అంతేకాకుండా దాదాపు ఏడాది క్రితమే సబ్‌స్టేషన్‌కు తాళం వేసి కుటుంబసభ్యులతో కలిసి అక్కడే ఆందోళనకు దిగారు. ఆయనకు మాజీ ఎమ్మెల్యేలు విజయరమణారావు, గుజ్జుల రామకృష్ణారెడ్డిలతో పాటు పలుసంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. 

ఉద్యోగమా...పరిహారమా..!
సబ్‌స్టేషన్‌ నిర్మాణాలకు అవసరమైన భూమిని విరాళంగా ఇచ్చిన దాతల కుటుంబీకుల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే అవకాశం గతంలో ఉండేదని, ఇప్పుడు ఆ నిబంధన అమల్లో లేదని విద్యుత్‌ అధికారులు పేర్కొంటున్నారు. ఆ సమయంలో హామీ ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు చేయలేమని అధికారగణం చేతులెత్తేయడంతో తన భూ మిలో నిర్మించిన సబ్‌స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా జరగనివ్వమంటూ భూదాత కుటుంబీకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి స్థలం ఇచ్చిన కుటుంబానికి ఉద్యోగం ఇచ్చే అవకాశం లేనపుడు కొంత పరి హారం అందించాలని  గ్రామపెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రైతుల నుంచి తలా కొంత వసూల్‌ చేయాలని భావించారు. ఆ మొత్తం సరిపోదని భావించి నియోజకవర్గ, పార్లమెంట్‌ స్థాయి నాయకులను కూడా పరిహారమందించేందుకు వీలుగా సాయమందించాలని అభ్యర్థించి కొంత మొత్తాన్ని వసూళ్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా సబ్‌స్టేషన్‌కు తాళం వేసిన భూదాతకు న్యాయం చేసి, రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న లో –వోల్టోజీ విద్యుత్‌  సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు.

పరిహారం అందించేందుకు కృషి చేస్తాం
భూదాత కొమురయ్య కుటుంబానికి నిబంధనల మేరకు ఉద్యోగం ఇవ్వలేమని విద్యుత్‌ శాఖ అధికారులు చేతులెత్తేశారు. దాంతో గ్రామంలో ఏర్పాటు చేసిన సబ్‌స్టేషన్‌కు విరాళంగా ఇచ్చిన భూమికి కొంత పరిహారం ఇవ్వాలని గ్రామపెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ప్రజా అవసరాల కోసం భూమినిచ్చేందుకు ముందుకొచ్చిన దాతకు విరాళాల ద్వారా సేకరించి వీలైనంత త్వరగా పరిహారం అందిస్తాం. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం. 


– మల్క కుమారస్వామి, ఎంపీటీసీ సభ్యుడు 

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top