సీరియస్‌గా ఫోటోషూట్.. తర్వాత ఏం జరిగిందంటే

కాలిఫోర్నియా : ప్రతీ ఒక్కరు తమ పెళ్లి వేడుకలను ప్రత్యేకమైనదిగా మలుచుకోవాలని భావిస్తారు. అందులో భాగంగానే పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ తీసుకోవడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఇంకా చెప్పాలంటే ఈ ఆనవాయితీ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా ఇండో-అమెరికన్ దంపతులు తమ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ తీసుకోవాలనుకున్నారు. అందుకు కాలిఫోర్నియాలోని మలీబు ప్రాంతంలో ఉన్న సాడల్‌రాక్ రాంచ్‌ను ఎంచుకొన్నారు. ఇంతవరకు బాగానే ఉంది.
దంపతులిద్దరు తమ ఫోటోషూట్‌ను తీసుకోవడానికి జిరాఫీ ఎన్‌క్లోజర్ వద్దకు వచ్చారు. ఇంతలో జిరాఫీ.. నేనున్నానంటూ వాళ్ల దగ్గరకు వచ్చి నిల్చుంది. అయితే దాన్ని గమనించకుండా వారిద్దరు తమ ఫొటోషూట్‌లో బిజీగా ఉన్నారు. పెళ్లికొడుకు తలపాగాను గమనించిన జిరాఫీ అది తినేది అనుకుందో ఏమో తెలీదు కాని ఒక్కసారిగా తలపాగాను తన నోటితో పైకి లాగేసింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన పెళ్లికూతురు తలపాగాను జిరాఫీ నోటి నుంచి లాగడానికి ప్రయత్నించింది. ఇంతలో ఫొటోషూట్ తీస్తున్న వ్యక్తి తలపాగాను కిందకు లాక్కున్నాడు. అయితే ఈ ఘటనతో ఉలిక్కిపడిన పెళ్లికొడుకు కాసేపటికి తాను చేసిన పనికి నవ్వుకున్నాడు. అయితే ఈ వీడియోనూ అపెరినా స్టూడియో సోషల్‌మీడియాలో షేర్ చేసింది. 'ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు.. కానీ నిజంగా ఈ ఫొటోషూట్‌ను మాత్రం చాలా ఎంజాయ్ చేశాము. వెడ్డింగ్ ఫొటోషూట్‌లో జిరాఫీ కూడా పాల్గొనడం మాకు ప్రత్యేకంగా అనిపించింది' అంటూ తమ అనుభవాన్ని వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి