పెళ్లి కాని ప్రసాదుల కోసం ప్రత్యేక రైలును ప్రారంభించిన చైనా

China Started Special Train For Single Men And Women - Sakshi

బీజింగ్‌: ఒక్కరే ముద్దు లేదా అసలే వద్దు సిద్దాంతం చైనా జనాభాలో భారీ మార్పులు తీసుకు వచ్చింది. ఈ విధానం వల్ల జననాల సంఖ్య తగ్గడమే కాక స్త్రీ, పురుష జనాభాలో విపరీతమైన తారతమ్యం చోటు చేసుకుంది. ఫలితంగా ప్రస్తుతం చైనాలో పెళ్లి కానీ ప్రసాదుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందట. గతేడాది చైనాలో 1000 మందిలో కేవలం 7.2శాతం మందికి మాత్రమే వివాహం అయ్యిందని అధికారులు తెలిపారు. రాగల ముప్పై ఏళ్లలో దాదాపు 30 లక్షల మంది యువతీ యువకులు పెళ్లి కానీ ప్రసాదులుగా మిగిలిపోనున్నారట. ఈ నేపథ్యంలో పెళ్లి కానీ యువతీ యువకుల కోసం ఓ వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది చైనా. ఒంటరి పక్షుల కోసం ‘లవ్‌ పర్స్యూట్‌’ పేరుతో మూడేళ్ల క్రితం ప్రత్యేక రైలును ప్రారంభించింది.

ఈ రైలులో ఒక్కో ట్రిప్‌లో దాదాపు 1000 మంది పెళ్లి కానీ యువతీ యువకులను ప్రయాణం చేయడానికి అనుమతిస్తారు. చాంగ్‌కింగ్‌ నార్త్‌ స్టేషన్‌ నుంచి కియాంజియాంగ్‌ స్టేషన్‌ వరకు రెండు పగళ్లు, ఒక రాత్రి సాగే ఈ ప్రయాణంలో యువత తమకు జీవితభాగస్వామిగా సరిపోయే వ్యక్తులను అన్వేషించుకోవచ్చు. రైలులో ఉన్న వారిలో ఎవరైనా నచ్చితే వారితో స్నేహం చేసి ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకుని.. ఆ తర్వాత అన్ని బాగున్నాయనుకుంటే.. పెళ్లి చేసుకోవచ్చు. వీరందరికి రైలులోనే భోజన, వసతి సదుపాయాలు కల్పించడమే కాక వినోద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు.

లవ్‌ పర్స్యూట్‌ రైలులో ప్రయాణిస్తున్నప్పుడే తాను తన జీవితభాగస్వామిని గుర్తించానని యాంగ్‌ హువాన్‌ తెలిపింది. తిరుగు ప్రయాణంలో తాము ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నామన్నది. ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు ఒక్కటే అని తేలడంతో వివాహం చేసుకున్నామన్నది. ఈ ప్రయాణంలో తోడు దొరకకపోయినా.. మంచి మిత్రులు పరిచయం అవుతారంటుంది యాంగ్‌.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top