షాకింగ్‌ న్యూస్‌ : 5 కోట్ల అకౌంట్లు హ్యాక్‌

5 crore face book accounts hacked - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: దాదాపు 5కోట్ల ఫేస్‌బుక్‌ వినియోగదారుల అకౌంట్లు హ్యాక్‌ అయ్యాయని ఫేస్‌బుక్‌ శుక్రవారం వెల్లడించింది. ‘వ్యూ యాజ్‌’ ఫీచర్‌ ద్వారా హ్యాకర్లు చొరబడి సమాచారాన్ని సేకరించి ఉండొచ్చని అభిప్రాయపడింది. ‘ఈ డేటా దుర్వినియోగం జరిగిందో లేదో ఇంకా స్పష్టత రాలేదు. మిగిలిన వినియోగదారుల భద్రతా వ్యవస్థను పటిష్టం చేశాం. కొంతకాలంగా ఫేస్‌బుక్‌పై తరచూ సైబర్‌ దాడులు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌  అన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే శుక్రవారం ఉదయం 9 కోట్లకు పైగా వినియోగదారులను అత్యవసరంగా తమ అకౌంట్లను లాగ్‌ఔట్‌ చేయాలని ఫేస్‌బుక్‌ సూచించింది. న్యూస్‌ఫీడ్‌ పైన ఈ విషయాన్ని తెలియజేసింది.

 ‘మంగళవారం మధ్యాహ్నం, 5 కోట్ల యూజర్ల డేటాఅటాక్‌ అయిందని మా ఇంజనీరింగ్‌ టీమ్‌ గుర్తించింది. వ్యూ యాజ్‌ అనే ఫీచర్‌లోని సాంకేతిక లోపాన్ని ఉపయోగించుకుని హ్యాకర్లు ఈ దాడికి పాల్పడ్డారు. ఇదిప్రైవేసీ ఫీచర్‌’ అని మార్క్‌ జుకర్‌బర్గ్‌ వెల్లడించారు.  ప్రస్తుతానికి లోపాన్ని సరిచేసినప్పటికీ.. ఆ ఫీచర్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. హ్యాకర్ల దాడి వార్తల నేపథ్యంలో ఫేస్‌బుక్ షేర్లు అమెరికా స్టాక్‌మార్కెట్లలో నష్టపోయాయి. ప్రస్తుతానికి ఆ లోపాన్ని సరిదిద్దామని, ఈ విషయాన్ని అమెరికాలోని సంబంధిత ప్రభుత్వ శాఖలకు తెలియజేశామని ఫేస్‌బుక్‌ పేర్కొంది.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top