మిడిల్‌ కొలాబ్‌తో నష్టమే! | Damage with Middle Kolab! | Sakshi
Sakshi News home page

మిడిల్‌ కొలాబ్‌తో నష్టమే!

Apr 7 2018 2:51 AM | Updated on Apr 7 2018 2:57 AM

Damage with Middle Kolab! - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి సబ్‌ బేసిన్‌లో ప్రధాన ఉప నదిగా ఉన్న ఇంద్రావతి నీటిని ఆధారంగా చేసుకుని ఒడిశా రాష్ట్రం చేపట్టిన మిడిల్‌ కొలాబ్‌ ప్రాజెక్టుతో దిగువ తెలంగాణ ప్రయోజనాలకు నష్టమేనని రాష్ట్ర ఇంజనీర్ల కమిటీ తేల్చింది. ఇంద్రావతికి అడ్డుకట్ట వేసి భారీ స్థాయిలో నీటిని వినియోగించుకుంటూ శబరి నదికి తరలించేలా మిడిల్‌ కొలాబ్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టును నిర్మించేందుకు ఒడిశా కసరత్తు చేస్తోందని, దీంతో భవిష్యత్తులో దిగువ ప్రాజెక్టులపై ప్రభావం కచ్చితంగా ఉంటుందని గుర్తించింది. దీనిపై త్వరలోనే కేంద్ర జల సంఘానికి, గోదావరి బోర్డుకు తమ అభిప్రాయాలతో నివేదికను సమర్పించనుంది.

విద్యుదుత్పత్తి లక్ష్యంగా..
భారీ విద్యుదుత్పత్తి లక్ష్యంగా ఒడిశా ప్రభుత్వం మిడిల్‌ కొలాబ్‌ ప్రాజెక్టును నిర్మించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఎగువ నుంచి వచ్చే ఇంద్రావతి ఉప నది నీళ్లను జౌరా నాలా ద్వారా ఓ బ్యారేజీలోకి అక్కడి నుంచి పవర్‌హౌస్‌కు తిరిగి అక్కడి నుంచి మరో బ్యారేజీకి తరలించి ఆయకట్టుకు సైతం నీటిని అందించాలని నిర్ణయించింది. మొత్తంగా ఇక్కడ రోజుకు ఒక టీఎంసీ చొప్పున కనిష్టంగా 50 టీఎంసీల మేర వినియోగించుకునేలా ఎత్తులు వేస్తోంది.

ఈ ప్రాజెక్టుపై ఇటీవల గోదావరి బోర్డు, కేంద్ర జల సంఘం రాష్ట్ర వివరణ కోరింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులతో చర్చించి అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం సీఈ నరసింహారావు, కోటేశ్వర్‌రావు, ఉదయ్‌శంకర్‌తో కూడిన బృందాన్ని ఒడిశా పంపారు. ఈ బృందం రెండ్రోజుల పాటు మిడిల్‌ కొలాబ్‌ ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది.

దీని ప్రకారం.. వాస్తవానికి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మధ్య 1975లో కుదిరిన ఒప్పందం మేరకు ఇంద్రావతి, కొలాబ్‌ నది కలిసే ప్రాంతంలో 75 శాతం డిపెండబులిటీ లెక్కన ఒడిశా 8.5 టీఎంసీల మేర వాడుకునే వెసులుబాటు ఉందని, అయితే ఒడిశా ప్రస్తుతం సుమారు 50 టీఎంసీల మేర నీటిని తరలించుకునేలా ప్రణాళికలు వేస్తోందని గుర్తించింది. భవిష్యత్తులో మరో 75 టీఎంసీల నుంచి 100 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశాలున్నాయని తెలిపింది.

జలాలు వృథాగా సముద్రంలోకి
ఇప్పటికే శబరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని, ప్రస్తుతం మిడిల్‌ కొలాబ్‌తో ఇంద్రావతి నీటిని శబరికి తరలిస్తే మరిన్ని జలాలు వృథాగా సముద్రంలో కలిసే అవకాశం ఉందని కమిటీ అంటోంది. దీనికి తోడు ఇంద్రావతి జలాలపై ఆధారపడిన దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ ఎత్తిపోతల పథకాలకు నీటి లభ్యత తగ్గి మిడిల్‌ కొలాబ్‌తో ఇవన్నీ ప్రభావితమయ్యే అవకాశం ఉందని గుర్తించారు.

గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారం ఒక సబ్‌ బేసిన్‌ పరిధిలో ఉండే రాష్ట్రాల అవసరాలు తీరాకే మరో సబ్‌ బేసిన్‌కు నీటిని తరలించాలని, అయితే ప్రస్తుతం దిగువ రాష్ట్రమైన తెలంగాణ అవసరాలను పణంగాపెట్టి ఇంద్రావతి నీటిని కొలాబ్‌ సబ్‌ బేసిన్‌కు తరలించేలా ఒడిశా ప్రభుత్వం ఎత్తుగడ వేస్తోందని నీటి పారుదల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వానికి, కేంద్రానికి నివేదిక ఇస్తామంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement