‘గుజరాత్‌ మోడల్‌’ మారేనా?

Shekhar Gupta Article On Narendra Modi Ruling - Sakshi

జాతిహితం

బీజేపీ వెలుపల ఉన్న ప్రతిభావంతులను కూడా ప్రభుత్వ శాఖల్లోకి ఆహ్వానించే సంస్కృతికి గతంలో వాజ్‌పేయి పాలన నిదర్శనం కాగా మోదీ, షా ద్వయం పార్టీ వెలుపలి రాజకీయ శక్తులకు కేంద్రంలో చోటు కల్పించలేదు. పైగా ప్రొఫెషనల్స్, స్పెషలిస్టులు, టెక్నోక్రాట్స్‌ పట్ల వీరు పూర్తి అవిశ్వాసంతో ఉండేవారు. చక్కటి అకడమిక్‌ ప్రతిష్ట ఉన్న ఇద్దరు ఆర్బీఐ గవర్నర్లకు మోదీ పాలనలో పట్టిన గతి దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. కానీ తొలిదఫా పాలన మూడేళ్లు పూర్తయ్యాక, ఆర్థిక వ్యవస్థ బీటలువారటం, కొన్ని రాష్ట్రాల శాసనసభల్లో, ఉపఎన్నికల్లో వెనుకంజ వేయడంతో మోదీ పాలనలో కొన్ని మార్పు సంకేతాలు కనిపించాయి. పార్టీతో సంబంధంలేని బ్యురోక్రాట్లు అత్యంత కీలక స్థానాల్లోకి రావడం దీంట్లో భాగమే. కానీ విశ్వాసం, విధేయత కలిగిన వారికి మాత్రమే చోటిచ్చే గుజరాత్‌ మోడల్‌ పాలన ప్రాథమికంగా మారబోవడం లేదు.

మోదీ–షాల నేతృత్వంలోని బీజేపీ పాలనా వ్యవస్థ అనేకమందికి ఏహ్యభావాన్ని కలిగిస్తుండవచ్చు కానీ వారి విధానాలను విశ్వసించేవారు మాత్రం దాన్ని ‘గుజరాత్‌ మోడల్‌’ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఈ విధానాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో మనం స్పష్టంగా తిలకించవచ్చు. మోదీ విమర్శకులు ఈ పరిణామాన్ని 2002 తదుపరి  విభజన రాజకీయాలు అని ముద్రవేసేశారు. అయితే గుజరాత్‌ నమూనా గురించి కాస్త తక్కువ వివాదాస్పదమైన వ్యక్తీకరణను కూడా మనం చూడవచ్చు. అదేమిటంటే  కేంద్రీకృత పాలన. కావాలంటే ప్రధానమంత్రి కార్యాలయంలో తాజా మార్పుల కేసి చూడండి. మోదీ ముఖ్య సహాయకులలో ముగ్గురికి ఇప్పుడు కేబినెట్‌ ర్యాంక్‌ కల్పించడం  మునుపెన్నడూ జరగని, చూడని వ్యవహారం.

మోదీ గుజరాత్‌ పాలనకు ఇది సహజ క్రమాభివృద్ధి మాత్రమే. కానీ, ఎవరికీ ఇబ్బంది లేకుండా ఈ పరిణామాన్ని మోదీ పాలన నమూనాగా చెప్పుకుందాం. ఇది 2001–02లో  గుజరాత్‌లో ఆవిష్కృతమైంది. 2002 నుంచి 2014 వరకు ఈ నమూనా పరిణమిస్తూ వచ్చింది. ఈ నమూనాను 2014లో మోదీ ఢిల్లీకి వెంటబెట్టుకుని వచ్చారు. ప్రధానిగా  రెండో దఫాలో అది మరింత ప్రబలంగా మారనుంది. 

మోదీ నమూనాకు సంబంధించినంత వరకు అయిదు ముఖ్యమైన మూలస్తంభాలు కనిపిస్తున్నాయి. 1. విశ్వసనీయమైన లెఫ్టినెంట్ల ద్వారా పార్టీని పూర్తిగా అజమాయిషీ చేయగల సుప్రీమో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌. 2. ఎంపిక చేసుకున్న కొద్దిమంది ప్రభుత్వ అధికారుల ద్వారా పాలించడం, వీరికి రిటైర్మెంట్‌ అనేదే ఉండదు. 3. ఒక దఫా పాలనలో సాధ్యమయ్యే ఫలితాలను ఇవ్వగల కొన్ని ఆలోచనలతో నడిచే మెíషీన్‌–మోడ్‌ పాలన. దీన్ని కొద్ది మంది వ్యక్తులు మాత్రమే నడుపుతుంటారు. 4. సైద్ధాంతిక బహుళ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సడలనివ్వకపోవడం. 5. పార్టీ లోపల, వెలుపల ప్రతిపక్షాన్ని మొత్తంగా తటస్థం చేయడం, దీనికి సామ దాన భేద దండోపాయాలన్నింటినీ ఉపయోగిస్తారు.

ఈ నమూనా గుజరాత్‌లో అద్భుతంగా పనిచేసింది. ఎందుకంటే గుజరాత్‌ ఒక మధ్య స్థాయి, సాపేక్షికంగా తక్కువ వైవిధ్యతలతో కూడిన రాష్ట్రం. ఇలాంటి నమూనా భారతదేశ వ్యాప్తంగా పనిచేయగలుగుతుందా అని చాలా అనుమానాలున్నాయి. ఇప్పటికే కొన్ని సార్లు ఈ నమూనా హెచ్చరికలు పంపింది. పెద్దనోట్ల రద్దు, విదేశీ విధానంలో కొన్ని వెనుకంజలు (ప్రత్యేకించి ఇరుగుపొరుగు దేశాల్లో ప్రారంభ విజయాల తర్వాత), వృద్ధి క్షీణత, ఉద్యోగాలు కోల్పోవడం, 2017 గుజరాత్‌ ఎన్నికల ఫలితం వంటివి వీటిలో కొన్ని. కానీ అంతిమంగా వచ్చిన ఫలితాలే ముఖ్యమైనవి. కేంద్రంలో బీజేపీ పార్టీ 303 స్థానాలతో కుదురుకుంది. 

అన్ని రాజధానీ నగరాలకు మల్లే, ఢిల్లీ మొట్టమొదటి లక్షణం బ్యురోక్రటిక్‌ తత్వం. అందుకే మోదీకి కూడా తన ముగ్గురు సహాయకులకు పదోన్నతి కల్పించక తప్పలేదు. మాజీ ఐఎఫ్‌ఎస్‌ అధికారి ఎస్‌. జైశంకర్‌ను విదేశీ వ్యవహారాల మంత్రిగా ఎంచుకున్నాక, ర్యాంకుల పరమైన అవరోధాన్ని అధిగమించడానికి మాజీ ఐపీఎస్‌ అధికారి అజిత్‌ దోవల్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా ప్రమోట్‌ చేయక తప్పింది కాదు. ఆ విధంగా దోవల్‌ని ప్రమోట్‌ చేశాక, ఐఏఎస్‌ నుంచి నృపేంద్ర మిశ్రా, పీకే మిశ్రాలకు సమాన స్థాయిని ఇవ్వక తప్పలేదు. ప్రోటోకాల్‌కి సంబంధించిన ఈ అనివార్యతలను మీరు జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరముంది. గతంలో కూడా మంత్రుల స్థాయి లేని వారికి కేబినెట్‌ ర్యాంకు కల్పించక పోలేదు. ప్రత్యేకించి ప్లానింగ్‌ కమిషన్, నీతి అయోగ్‌ అధిపతుల విషయంలో ఇలాగే జరిగింది. ఇక యూపీఏ–2 హయాం లోనూ నందన్‌ నీలేకనికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) అధిపతిగా స్థానం కల్పించారు. అయితే ఇలాంటి వివరణ మూడు అంశాలను తప్పించుకోలేదు. మొదటగా, మోదీ ప్రపంచంలో వివరణ అనే భావనే తార్కిక విరుద్ధమైనది. రెండోది, మోదీ అనివార్యతకు గురై ఈ మార్పులను చేయాల్సి వచ్చిందని ఇది సూచి స్తోంది. పైగా బ్యూరోక్రాటిక్‌ ప్రొటోకాల్‌ విషయంలో తప్పితే మోదీకి ఏ సందర్భంలోనూ బలవంతపు నిర్ణయాలను తీసుకున్న చరిత్ర లేదు. అద్భుత విజయాన్ని సాధించిన తర్వాత ఇలాంటి మార్పులను ఆయన ఎందుకు చేపట్టారు? మూడు, జైశంకర్‌కి ప్రథమ స్థాయిని కల్పించడంలో మోదీ ఎలాంటి ఒత్తిడికి, అనివార్యతకులోను కాలేదు. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా మోదీ ఆ మార్పుకు సిద్ధమయ్యారు. దానికనుగుణంగానే మిగతా మార్పులు కూడా సంభవించాయి.

ప్రధానిమంత్రి కార్యాలయం అమెరికా అధ్యక్షుడి కార్యనిర్వాహక కార్యాలయాన్ని తలపిస్తోంది. ఇక్కడినుంచే కీలకమైన కేబినెట్‌ అధికారులు (మంత్రులు) పనిచేస్తుంటారు. విదేశీ వ్యవహారాల నుంచి స్వచ్ఛభారత్‌ వరకు మోదీ కీలకంగా భావించిన మంత్రివర్గాలను ఆజమాయిషీ చేయడం ద్వారానే మోదీ తొలి దఫా పాలనలో పీఎంఓ ఎదుగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ శాఖలకు చెందిన ముఖ్య అధికారులు ఎదిగారు నేరుగా తమ బాస్‌కే జవాబుదారీగా ఉండే కేబినెట్‌ మంత్రుల స్థాయికి ఎదిగారు. కాబట్టే ప్రధాని సమానులలో ప్రథముడు అనే వెస్ట్‌ మినిస్టర్‌ శైలి కేబినెట్‌ వ్యవస్థ ఇక అవసరం లేదు. అమెరికా అధ్యక్షుడు వైట్‌ హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ స్థాయి కలిగిన  ఇద్దరు శక్తివంతమైన ఎన్‌ఎస్‌ఏలపై విశ్వాసముంచి విదేశీ, రక్షణ శాఖలను నిర్వహిస్తుండగా, మన ప్రధానికి ఇప్పుడు ఇద్దరు చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ తోడుగా ఉంటున్నారు.

మోదీ రెండో పాలనలో కొన్ని వ్యత్యాసాలు ఉంటున్నాయి. మొదటగా, ఆయన పార్టీని నేరుగా కాకుండా అమిత్‌ షా ద్వారా నడిపిస్తున్నారు. రెండు ఇందిరాగాంధీలాగా కొనసాగింపును ఒక సైద్ధాంతిక విషయంగా మోదీ భావించరు. ఆయన మార్పును కోరుకునే మనిషి. ఇక మూడోది ఏమిటంటే మోదీకి కుటుంబం కానీ వారసత్వం కానీ లేవు.  ఈ ప్రాతిపదికన కూడా మోదీని అమెరికన్‌ అధ్యక్షుడితో పోల్చవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే మోదీ తర్వాత బీజేపీకి చెందిన మరొక నాయకుడు వెలుగులోకి వస్తాడు తప్ప మరికొందరు నరేంద్ర మోదీలు ఆవిర్భవించలేరు.

మోదీ తొలి దఫా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక తార్కిక విమర్శ ఏమంటే ప్రతిభ లోపించిందనే. నేనుకూడా ఈ విషయాన్నే చెబుతూ, స్వతంత్ర భారత్‌లోకెల్లా అత్యంత ప్రతిభా రాహిత్య ప్రభుత్వంగా చాలాసార్లు చెబుతూ వచ్చాను. మోదీకి చాలా సన్నిహితంగా ఉన్న వారు దీన్నే సవాలు చేస్తూ ప్రతిభ, అనుభవం లేకుంటే ఏం.. మేం క్రమంగా నేర్చుకుంటాం అని సమర్థించుకునేవారు. కానీ మేం అధికారం గెల్చుకుని దాన్ని ఇతరులకు బహుమతిగా ఇవ్వబోమని వారు చెప్పేవారు. 

ఇది వాజ్‌పేయి తరహా టీమ్‌–బిల్డింగ్‌ను పరిత్యాగం చేయడమే అవుతుంది. వాజ్‌పేయి ప్రతిభను ప్రతి చోటనుంచి వెలికి తీసేవారు. ఉదా. జస్వంత్‌ సింగ్‌ ఆరెస్సెస్‌తో సంబంధం లేని వ్యక్తి. యశ్వంత్‌ సిన్హా, రంగరాజన్‌ కుమార మంగళం బీజీపీలోకి చాలా లేటుగా ప్రవేశించారు. ఇక జార్జి ఫెర్నాండజ్‌ మొదటి, చివరి బీజేపీయేతర, కాంగ్రెసేతర మంత్రిగా రక్షణ శాఖను నిర్వహించారు. అరుణ్‌ శౌరీ శక్తివంతమైన మార్పు ఏజెంటు. తన శాఖలోకి ఆయన వెలుపలినుంచి మేధస్సును, సమగ్రతను తీసుకొచ్చారు. 

వాజ్‌పేయితో పోలిస్తే మోదీ, షాలు తమ తొలి దఫా పాలనలో పూర్తి వ్యతిరేక దిశలో నడిచారు. పార్టీ వెలుపలి ఏ రాజకీయ శక్తులకూ ప్రభుత్వంలో వీరు చోటు కల్పించలేదు. పైగా ప్రోఫెషనల్స్, స్పెషలిస్టులు, టెక్నోక్రాట్స్‌ పట్ల వీరు పూర్తి అవిశ్వాసంతో ఉండేవారు. అత్యున్నతమైన అకడమిక్‌ ప్రతిష్ట కలిగిన ఇద్దరు ఆర్బీఐ గవర్నర్లకు మోదీ పాలనలో పట్టిన గతి దీనికి ప్రత్యక్ష సాక్ష్యం.

మనలాంటి విమర్శకులను కాలం చెల్లిపోయినవారని మోదీ–షా ద్వయం తోసిపుచ్చేవారు. ఆంగ్లేయతత్వం కలిగిన ఢిల్లీ కులీనుల పాత్ర లేకున్నా కేంద్రప్రభుత్వం నడవగలదనే వాస్తవాన్ని మాలాంటి వారు అంగీకరించరని వారు విమర్శించేవారు. కానీ నాలుగో సంవత్సరం నాటికి ఆర్థిక వ్యవస్థ బీటలువారటం, కొన్ని రాష్ట్రాల శాసనసభల్లో, ఉప ఎన్నికల్లో వెనుకంజ వేయడం జరిగిన తర్వాత కేంద్రంలో కొన్ని మార్పు సంకేతాలు కనిపించాయి. దీంట్లో భాగంగానే రిటైర్డ్‌ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆర్కే సింగ్, హర్దీప్‌ పురి వంటివారు ప్రభుత్వ శాఖల్లో ప్రవేశించారు. వారు తమ స్థానాలను మరింత మెరుగుపర్చుకున్నారు కూడా. జైశంకర్‌ వంటివారిని అత్యున్నత పదవుల్లోకి తీసుకోవడం కూడా దీంట్లో భాగమే. ఇప్పుడు పీఎంఓలో ముగ్గురికి ప్రమోషన్‌ ఇచ్చారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి ఉన్నతాధికారులను వెనక్కి రప్పించి కీలక పదవుల్లో నిలిపారు. 

మోదీ నమూనాను ఇప్పటికీ గుజరాత్‌ నమూనాగానే మనం చూస్తున్నాం. కానీ గుజరాత్‌ను పాలించడం కంటే భారతదేశాన్ని పాలించడం సవాలుతో కూడుకున్నదని గ్రహించాక, బీజేపీలో లభ్యం కాని ప్రతిభావంతులు కూడా ప్రభుత్వానికి అవసరం అవుతున్నారు. మోదీ ఇప్పుడు పార్టీ వెలుపలి ప్రతిభ కోసం చూస్తున్నారు కానీ తమ కెరీర్‌లో అత్యంత విశ్వసనీయత సాధించిన వారినే మోదీ ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సూపర్‌ బ్యూరోక్రాట్లతో కూడిన ‘కేబినెట్‌’ ద్వారా పాలన సాగించనున్న ప్రధాని మోదీ రెండో దఫా పాలనపై ఈ దృష్టితోనే మనం నిశిత పరిశీలన చేయాల్సి ఉంది.


శేఖర్‌ గుప్తా 
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top